ఈవీఎంకు 36 ఏళ్లు  

From 36 Years - Sakshi

1982నుంచి  ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు 

సాక్షి,ఖమ్మం: తొలుత బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఓట్లు వేసేవారు. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951లో జరగ్గా అప్పుడు బ్యాలెట్‌ పత్రాల విధానమే ఉంది. 1982లో తొలిసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు (ఈవీఎంలు) అమలులోకి వచ్చాయి. అయితే..2004 నుంచి పూర్తి స్థాయిలో ఈవీఎంలను వినియోగించారు. తొలిసారిగా కేరళ రాష్ట్రం పరూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982 మే 19న వాడారు. ఆ తర్వాత 1982, 83లో దేశ వ్యాప్తంగా జరిగిన 10 ఉప ఎన్నికల్లోనూ వీటిద్వారానే ఓట్లేశారు. వీటి పనితీరుపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 1984 మే 5న వినియోగాన్ని రద్దు చేసింది.

 దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి 1988 డిసెంబర్‌లో సెక్షన్‌ 61–ఏ ద్వారా ప్రజా ప్రాతినిథ్య చట్టంతో ఈవీఎంల వాడకాన్ని తప్పనిసరి చేసింది. 1999, 2004 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, లోక్‌సభకు 2004–14 మధ్య జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగించారు. 2013 ఆగస్టు 14న ఈవీఎంలకు వీవీ ప్యాట్‌ (ఓటరు వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌)ను అనుసంధానం చేశారు. వీటి వల్ల తాను వేసిన ఓటు ఎవరికి పడిందనే విషయంలో ఓటర్లకు అపోహలు లేకుండా నిర్ధారించుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top