breaking news
-
కేసీఆర్ ఎక్కడున్నా ‘రజాకార్’ చూడాలి
కరీంనగర్ టౌన్: నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలు, గోసను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ‘రజాకార్’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని మమత థియేటర్లో రజాకార్ చిత్ర యూనిట్, బీజేపీ కార్యకర్తలతో కలిసి సినిమా చూసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియంత నిజాం, రజాకార్ల రాక్షస పాలనపై తెలంగాణ ప్రజ లు చేసిన పోరాటాల చరిత్రను అద్భుతంగా తెరపై చూపించారని కొనియాడారు. ఈ వాస్తవాలను నేటి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాను ప్రజలకు అందించిన దర్శక, నిర్మాతలు యాట సత్యనారాయణ, గూడూరు నారాయణరెడ్డిని అభినందించారు. కేసీఆర్ ఎక్కడున్నా రజాకార్ సినిమా చూడాలన్నారు. ఆ సినిమా చూసిన తర్వాత కూడా నిజాం గొప్పోడు, రజాకార్లు మంచోళ్లని అనిపిస్తే నిరభ్యంతరంగా కేసీఆర్ ‘ట్వీట్’చేయొచ్చు అని సూచించారు. అవసరమైతే ఆనాడు నిజాం సమాధి ఎదుట మోకరిల్లిన కేసీఆర్ ఫొటోను కూడా ఈ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయవచ్చని పేర్కొన్నారు. -
గ్యారంటీల అమలుకు ‘డిజిటల్ క్యాంపెయిన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను ఎన్నోరకాలుగా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచి్చన ప్రతి హామీ అమలు చేయాల్సిందేనని, ఈ దిశగా ఒత్తిడి చేసేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టిందన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రశి్నస్తున్న తెలంగాణ పోస్టర్, వెబ్‌సైట్‌ను రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అహంకారం, నియంతృత్వం, నిరంకుశత్వంతో కేసీఆర్ ఓడిపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం గెలవలేదన్నారు. అనేక తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పథకాల అమలులో చేతులెత్తేసిందని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ.15 వేలు ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక రకాల గ్యారంటీలంటూ మభ్యపెట్టి ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. -
జంపింగ్‌లు షురూ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన మరుసటి రోజే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడవకుండానే ఎమ్మెల్యేలు పార్టీ మారడం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పక్షాన గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి గానీ, శాసనసభ్యత్వానికి గానీ రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, ఇక నుంచి తన రాజకీయం ఏంటో చూపిస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వక భేటీ పేరిట కలిసినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ పార్టీ మారలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీలోకి, నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే రావడంతో రాజకీయం రసకందాయంలో పడిందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలను అధికారికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, ఆపరేషన్ ఆకర్‡్షకు ఇక మరింత పదును పెట్టే క్రమంలో గేమ్ స్టార్ట్ చేసిందని చెబుతున్నారు. టచ్‌లో 26 మంది? ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ సంఖ్య 38 అయ్యింది. అయితే వీరిలో మూడింట రెండొంతుల మంది అంటే 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు, రంగారెడ్డి నుంచి ఇద్దరు, మేడ్చల్ నుంచి ఇద్దరు, కొత్తగూడెం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వీరంతా కాంగ్రెస్‌లో చేరతారా లేక మర్యాదపూర్వకంగానే కలిశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాము అండగా నిలుస్తామని తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ రోజే గేట్లు తెరిచానని, అవతలివైపు ఎంతమంది ఉంటారో తనకు తెలియదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తావిస్తున్నాయి. నాటి బీఆర్ఎస్ తరహాలోనే! ఓటుకు కోట్లు వ్యవహారం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమై భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు అనే కారణం చూపుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూనే ఉంది. ఒక పార్టీలో గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో పలుమార్లు నిలదీశారు. పార్టీ మారిన వారిని ఉరి తీయాలంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న ఓ నాయకుడు మాట్లాడుతూ ‘నాడు కేసీఆర్ సూత్రాన్నే మేం పాటిస్తున్నాం. మా కోట గోడలను పదిలం చేసుకుంటున్నాం. బలంగా చుట్టూ కంచె వేసుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని కొందరు, మూడు నెలల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని మరికొందరు చేస్తున్న వ్యాఖ్య ల వెనుక ఆంతర్యం ఏంటో అందరికీ తెలిసిందే. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్లకు ఫిరాయింపుల రాజకీయం అలవాటే. మా జాగ్రత్తలో మేం ఉండకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు రాజకీయం చేస్తున్నారు. వాళ్ల శాసనసభాపక్షం మా పార్టీలో విలీనం అవు తుందేమో?’అని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం, మున్షీ సమక్షంలో చేరికలు బీఆర్ఎస్కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, రంజిత్‌రెడ్డితో కలిసి మొత్తం ముగ్గురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టయింది. కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు: రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రంజిత్‌రెడ్డి తన రాజీనామా లేఖను పంపారు. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రంజిత్‌రెడ్డి ‘ఎక్స్’లో తెలిపారు. ఇన్ని రోజులు చేవెళ్ల ఎంపీగా తనకు సేవలు చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, కేసీఆర్, కేటీఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు. -
వేడెక్కిన రాజకీయం
సాక్షి, మేడ్చల్ జిల్లా: పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై జెండా ఎగురవేసేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజిగిరి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మూడు జిల్లాలు.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నగరంతోపాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ(బీజేపీ), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్ గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోంది. శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్రంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుండటంతో ఓటర్ల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మల్కాజిగిరి ఎంపీ పరిధిలో ప్రస్తుతానికి 37,28,519 ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,58,190 మంది ఓటర్లు ఉండగా, మల్కాజిగిరిలో 4,99,538, కుత్బుల్లాపూర్‌లో 7,12,756, కూకట్‌పల్లిలో4,71,878, ఉప్పల్‌లో 5,33,544, ఎల్బీనగర్లో 6,00,552, కంట్మోనెంట్లో 2,52,060 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు వరకు కూడా అర్హులైన వారు కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పార్టీలు అప్రమత్తం మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావటంతో ... కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాలను ఆయా పార్టీలు ప్రకటించటంతో వారు ప్రచారంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచార పర్వంలో ముందున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆయన బస్తీలు ,పురపాలక సంఘాలు ,డివిజన్లు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఈటల విజయం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కంట్మోనెంట్ అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని ఎన్నికల శంఖారాన్ని పూరించగా, శుక్రవారం భారత ప్రధాని మోదీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తాజాగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పేరును అధికారికంగా నేడో ,రేపో ప్రకటించవచ్చునని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీలో అసమ్మతిపై దృష్టి బీజేపీలో టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన కొందరు నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఆశించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పి.హరీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు అసంతృప్తి నేతలను బుజ్జగించటంతో పాటు అభ్యర్థి ఈటల గెలుపు కోసం పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
వంద రోజుల్లో.. వంద తప్పులు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో వంద తప్పులు చేసిందని.. నాలుగు కోట్ల మంది ప్రజలను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగం పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మళ్లీ తిప్పలు పడుతోందని.. సాగునీరు, విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. హామీల అమలు ఏది? కాంగ్రెస్ ఇచ్చి న హామీలు అమలు చేయకపోగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా కింద రూ.15 వేలు, వరికి రూ.500 బోనస్, ప్రతి మహిళకు రూ.2,500 సాయం వంటి హామీల అమలు ఎప్పుడు? రైతుబంధును సీరియల్లా ఎంతకాలం సాగదీస్తారు. మూడు నెలలైనా పెన్షన్లను రూ.4000కు ఎందుకు పెంచలేదు. ఒకటో తేదీనే ఇస్తామన్న జీతాలు అందరికి ఎందుకు అందడం లేదు. 200 యూనిట్ల వినియోగం దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందు కు కట్టాలి? గృహజ్యోతికి ఏటా రూ.8 వేలకోట్లు అవసరమైతే బడ్జెట్లో రూ.2,400 కోట్లే ఎందుకు పెట్టారు? దళితబంధు పథకాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు? అంబేడ్కర్ అభయహస్తం పథకాన్ని అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు? ఒకే ఒక్కరోజు ప్రజాభవన్‌కు వెళ్లి ఆ తర్వాత ఎందుకు ముఖం చాటేశారు? చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేస్తున్నారు? కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు? భూగర్భ జలాలు అడుగంటుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు?’’ అని ప్రశ్నించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీరు ఇవ్వకపోవడం ఘోరమన్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ రైతుల ఆత్మహత్యలు జరిగే పరిస్థితికి తెరలేపుతున్నారని ఆరోపించారు. వేళాపాళా లేని కరెంటు కోతలేంటి? యాసంగి సాగు గణనీయంగా తగ్గినా ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని కేటీఆర్ నిలదీశారు. ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ పంటలను కాపాడుకునే దుస్థితి ఎందుకు వచ్చి ందని ప్రశ్నించారు. ‘‘వేళాపాళా లేని కరెంటు కోతలేమిటి? పల్లెలు, పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు? నాణ్యత లేని కరెంట్ వల్ల మోటార్లు కాలిపోవడానికి బాధ్యులెవరు? యూరియా కోసం మళ్లీ క్యూలైన్లలో నిలబడే దుస్థితి ఎందుకు తెచ్చారు? సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారు? మిషన్ భగీరథను మూలన పడేసి.. మళ్లీ ట్యాంకర్ల రాజ్యం తేవడమేంటి? ఉచిత బస్సు ప్రయాణమని ఆశపెట్టి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారా? ఆటోడ్రైవర్ల పొట్టగొట్టి.. ఏటా ఇస్తామన్న రూ.12 వేలు ఎగ్గొడతారా? పదేళ్లు సంతోషంగా ఉన్న నేతన్నల జీవితాలను ఎందుకు ఆగం చేశారు? ఆర్డర్లు ఇవ్వకుండా సాంచాల సంక్షోభాన్ని ఎందుకు సృష్టించారు?’’ అని ప్రశ్నించారు. -
నా రాజకీయం చూపిస్తా! : సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ మొదలుకొని కడియం శ్రీహరి వంటి వారి దాకా ఈ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదంటూ మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎన్నికల తర్వాత ఆపరేషన్ మొదలుపెడతామని అంటున్నారు. ఇది దేనికి సంకేతం? వందరోజుల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా ఫిరాయింపుల జోలికి వెళ్లానా? కానీ ఈ రోజు వాళ్లిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటమా? కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటారు. కొట్టకుంట ఊర్కుంటమా? కొడతం కదా.. అందుకే వందో రోజు మొదలుపెట్టిన. ఓ గేట్ ఓపెన్ చేసిన. ఈరోజు ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే వచ్చా రు. ఎన్నికల నగారా మోగింది కాబట్టి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కూడా పని మొదలు పెట్టిన. నిన్న కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగా చాలా నిబద్ధతతో ప్రతిరోజూ 18 గంటలు ప్రజల కోసం పనిచేసిన. చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పనిచేసిన. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధానాధికారి నగారా ఊదిండు. ఇక ఎన్నికల రూపం చూపిస్తా. నా రాజకీయం ఏంటో చూపిస్తా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్య మంత్రిగా 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. వందరోజుల్లో అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. నిజాం నకలునే కేసీఆర్ చూపించారు ‘వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైంది. ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని అధికారం నుంచి దించారు. ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదు. ఏనాడూ ప్రజల స్వేచ్ఛను గౌరవించ లేదు. నిజాం నకలునే కేసీఆర్ చూపించారు. ఖాసిం రజ్వీ ద్వారా నిజాం తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసిన వారిని అణిచివేసే ప్రయత్నం చేసినట్లు,ప్రభాకర్‌రావు ద్వారా కేసీఆర్ చేశారు. ప్రజల స్వేచ్ఛను హరించాలని భావించారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. 2023 డిసెంబర్ 3న స్వేచ్ఛను తెచ్చుకున్నారు. 1948 సెపె్టంబర్ 17న ఎలాగో అలాగే స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు..’ అని రేవంత్ అన్నారు. ఆరు గ్యారెంటీలతో సంక్షేమ పాలన ‘వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. మేము పాలకులం కాదు.. సేవకులం అని తెలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఉద్యమ సమయంలో వాహనాలపై రాసుకున్న ‘టీజీ’ని అమల్లోకి తీసుకొచ్చాం. ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. తెలంగాణ తల్లి, ప్రభుత్వ చిహ్నాల్లో రాజ దర్పాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. సచివాలయంలోకి అందరికీ ప్రవేశం కల్పించాం. 2004 నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని 26 కోట్ల మంది వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 8 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించాం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని వ్యాధులను చేర్చడమే కాకుండా పరిమితి రూ.10 లక్షలకు పెంచాం. 32 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాన్ని అందుకున్నాయి..’ అని సీఎం వివరించారు. కేంద్రం, గవర్నర్‌తో సామరస్యంగా ముందుకు.. ‘కేంద్ర ప్రభుత్వంతో, తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సామరస్య పూర్వకంగా ముందుకెళ్తున్నాం. వైబ్రంట్ తెలంగాణ మా లక్ష్యం. తెలంగాణ విజన్ –2050 ద్వారా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. మా ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండడం ఖాయం. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఉంటాం. కానీ అభివృద్ధిని 2050 లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. సామాజిక న్యాయానికి మారు పేరుగా ‘వందరోజుల్లో సామాజిక న్యాయానికి మారుపేరుగా పాలన సాగించాం. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, నలుగురు ప్రభుత్వ విప్‌లను నియమిస్తే అన్ని వర్గాలకు అవకాశం కల్పించాం. మంత్రుల్లో కూడా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. – త్వరలోనే సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తా. గతంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిపై మేం చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సామాజిక స్పృహ కలిగిన మంచి మిత్రుడు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆయనకే ఇద్దామనుకుంటే తిరస్కరించారు. బీఆర్ఎస్తో కలిసేంత తప్పు చేయరు. కలిస్తే ఆయనే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అనర్హులకు రైతుభరోసా ఇవ్వం రైతుబంధు పథకాన్ని 5 ఎకరాల లోపు 62 లక్షల రైతులకు అందించాం. రైతుభరోసాను పకడ్బందీగా అమలు చేస్తాం. కొండలు, గుట్టలు, రోడ్లకు, కోటీశ్వరులకు, అనర్హులకు ఇవ్వం. అధికారులపై వ్యక్తిగత కక్ష సాధింపులు ఉండవు. హైదరాబాద్‌లోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చించి జర్నలిస్టులందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార నిర్ణయంతో వస్తే సంతకం చేస్తా..’ అని రేవంత్ చెప్పారు. టీయూడబ్లు్యజే ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం సీపీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి పాల్గొన్నారు. తన్నీరు.. నువ్వు పన్నీరు కాదు ‘200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేస్తుంటే కొన్ని గంజాయి మొక్కలు మళ్లీ తమ పరిమళాలను వెదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఉచిత కరెంటుకు సబ్సిడీని ముందు చెల్లించిన తరువాతే వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. ఇంటి పేరులో తన్నీరు (తన్నీరు రంగారావు) ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదు. ఈ గంజాయి మొక్కను కూడా పీకుతం. ఎక్కువ రోజులు ఆ కుర్చీలో ఉండవు. విద్యుత్ సరఫరా విషయంలో కొన్నిచోట్ల కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి వందల కోట్లు కాదు, వేల కోట్లకు చేరింది. అవినీతిపై రాజ్యాంగబద్ధంగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. బతుకమ్మను కొందరు ప్లాస్టిక్ బతుకమ్మను చేశారు. ఎవరు ఉన్నా లేకున్నా బతుకమ్మ, బోనాల పండుగలు ఘనంగా జరుగుతాయి. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం. ధరణి పోర్టల్‌ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అవినీతి జరిగిందా లేదా అనే విషయం బయటపడదు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించం..’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఖబడ్దార్ రేవంత్.. నోరు, ఒళ్లు దగ్గరపెట్టుకో: ఈటల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నోరు, ఓళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడలంటూ హెచ్చరించారు. ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తున్న వసూళ్ల చిట్టా రికార్డ్ అవుందని అన్నారు. నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ రెడ్డి.. రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమకు పెద్దన్న అని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఇటీవల రేవంత్ మాట్లాడిన ఈటల చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని మోదీ కేటాయించారని చెప్పిన సీఎం .. మళ్లీ అదే నోటితో ప్రధానిని తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా అలానే మాట్లాడారని, ఆయనకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందంటూ హెచ్చరించారు. నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకోని జాగ్రత్తగా మాట్లాడాలని రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ హితవు పలికారు. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించిన రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చదవండి: ఇక నా రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్ పిల్లి కళ్లు మూసుకొని పాలుతాగినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేదిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుందన్నారు. "ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావని. నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారు అని మర్చిపోకు." అంటూ వార్నింగ్ ఇచ్చారు. మల్కాజ్‌గిరిలో ఎవరు వచ్చినా.. ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా.. గెలిచేది బీజేపీనే అని.. ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేధిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నందంతా రికార్డ్ అవుతుందన్నారు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చినా, ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను దానం నాగేందర్‌కు కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుడ్ బై చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
ఇక నా రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్ 3న తెలంగాణలో ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని, స్వేచ్ఛకు మించింది ఏదీ లేదని నిరూపించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంబించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో రేవంత్ మాట్లాడారు. ‘మా ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నిన్నటిదాకా సీఎంగా నిబద్ధతతో పనిచేశా. ఇక పార్టీ అధ్యక్షునిగా నన్ను చూస్తారు. ఎన్నికల నగారా మోగినందున ఎన్నికల్లో నా రాజకీయ రూపం చూస్తారు. సీఎంగా వందవ రోజు ఒక గేట్ ఓపెన్ చేశా. అవతల వర్గం ఖాళీ అయితే గేట్లు మూసినా తెరచినా ఒక్కటే. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటానా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు పెద్దలు కొట్టకుండా ఊరుకుంటామా. యువకుల ఆత్మబలిదానాలతో సమైక్య పాలన నుంచి విముక్తి పొంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ రాజరికపోకడలను మళ్లీ తీసుకువచ్చారు. తన వారసులే ఆధిపత్యం చెలాయించాలని కోరుకున్నారు. కేసీఆర్ నిజాం నకలునే మళ్లీ చూపించాడు. ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు. తిరుగుబాటు చేసినవారందరినీ అణచివేశాడు. దీంతో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పరిపాలనను తీసుకువచ్చారు. ధర్నాచౌక్ వద్దు అన్న వారిని కూడా ధర్నా చేసుకోనిచ్చిన ప్రభుత్వం మాది. ప్రగతిభవన్ కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. సామంతులలాగా అధికారం కొద్ది మంది అధికారుల చేతిలో పెట్టకుండా అధికారులందరికీ పాలనలో స్వేచ్ఛను కల్పించి పారదర్శకతను తీసుకువచ్చాం. ఉద్యమంలో మాట్లాడిన మాటలను మర్చిపోయి కేసీఆర్ తెలంగాణ సంస్కృతిని చెరిపే ప్రయత్నం చేశారు. మేం వచ్చిన తర్వాత జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు తీసుకువచ్చి, ఆరోగ్య శ్రీ పరిమితి పెంచాం. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరి కమిషన్(ఈఆర్సీ)లో కేసీఆర్ నాటిన గంజాయి మొక్క ఒకటి గృహజ్యోతి డబ్బులు ముందే డిస్కంలకు ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఇచ్చిన వ్యక్తి ఇంటి పేరు కూడా తన్నీరు. ఈ తన్నీరుకు గతంలో రైతులకు ఉచిత విద్యుత్ డబ్బులు కేసీఆర్ ముందే ఇచ్చాడో లేదా తెల్వదా. ఈ గంజాయి మొక్కలన్నింటిని సమూలంగా పీకేస్తాం’ అని రేవంత్ హెచ్చరించారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా -
బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా
సాక్షి,రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేసీఆర్‌కు లేఖ పంపించిన రజింత్‌రెడ్డి.. చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్ బై చెప్పగా, ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సమక్షంలో ఆరూరి కాషాయకండువా కప్పుకున్నారు. కాగా, ఆరూరి రమేష్ ఆదివారం బీజేపీలో చేరాలరు. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి బీజేపీ కండువా కప్పి రమేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రమేష్‌తో పాటుగా పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు, వరంగల్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా కాషాయతీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆరూరి నిన్న బీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆరూరి వరంగల్ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారు. కాగా, బీజేపీ ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో వరంగల్ సీటు అభ్యర్థిని ప్రకటించలేదు. -
ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ చేరుకున్న కేటీఆర్, హరీష్
Updates.. ►ఢిల్లీ చేరుకున్న కేటీఆర్, హరీష్‌రావు ►ఈరోజు సాయంత్రం కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ కవిత అరెస్టు చట్టబద్ధమే: కోర్టు కవితకు ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చిన సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్లో సంచలన విషయాలు కవితను అరెస్టు చేయవద్దని ఎక్కడా సుప్రీంకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదు తదుపరి హియరింగ్ వరకు మాత్రమే సమన్లు ఇవ్వమని ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పింది ఆ తర్వాత రెండుసార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ కవిత సుప్రీంకోర్టులో వాటిని ఛాలెంజ్ చేయలేదు సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట తప్పారా లేదా అన్నది? మా పరిధిలో నిర్ణయించే అంశం కాదు సెక్షన్-19 ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూ అరెస్టు చేశారా లేదా అన్నది మాత్రమే చూస్తాం కవితను చట్టబద్ధంగానే అరెస్టు చేశారు మనీలాండరింగ్ చట్టం సెక్షన్-19 కింద అన్ని నిబంధనలను పాటించారు ఈ నేరాల్లో కవిత కీలక పాత్ర పోషించారనేదానికి ఆధారాలు ఉన్నాయి అందుకే ఆమెను రిమాండ్ చేస్తూ దర్యాప్తు కోసం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నాం సీసీటీవీ కవరేజ్‌లో ఆమెను విచారించాలి. సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలి మహిళను విచారించే సమయంలో తీసుకోవలసిన అన్ని నిబంధనలు పాటించాలి ఆమె తరపు న్యాయవాదులు ప్రతిరోజు అరగంట పాటు కలవవచ్చు ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ , బావ హరీష్ రావు కజిన్ బ్రదర్స్ శ్రీధర్, ప్రణీత్ కుమార్, శరత్ కలుసుకునే అవకాశం ఉంది అరెస్టు తరువాత హైబీపీకి గురైనట్లు ఈసీజీ రిపోర్టు ఉన్న నేపథ్యంలో తగిన మందులు ఇవ్వాలి 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలి ►ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కవితను కలవునున్న కేటీఆర్, హరీష్ రావు. నేటి నుంచి కవిత కస్టోడియల్ ఇంటరాగేషన్ నేటి నుంచి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కస్టోడియల్ ఇంటరాగేషన్ ప్రతిరోజు ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు ఇంటరాగేషన్ చేయనున్న ఈడీ కవిత పాత్రకు సంబంధించి ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చిన అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర రెడ్డి ఆమె టీంలో ఉన్న సభ్యులు ఇచ్చిన సమాచారాన్ని కవిత ద్వారా ధ్రువీకరించనున్న ఈడీ గత విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కవిత తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని ఈడీ ఆరోపణ ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు కుటుంబ సభ్యులను లాయర్లను కలుసుకునేందుకు అనుమతించిన కోర్టు నేడు సాయంత్రం కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు , లాయర్లు ►శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి. ►ప్రతీరోజు కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు అవకాశమిచ్చిన కోర్టు. ►నేడు ఢిల్లీకి వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు. ►ఈడీ కస్టడీలో కవిత విచారణను వీడియో తీయనున్న ఈడీ అధికారులు. ►ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఈడీ అధికారులను ఆదేశించింది. ►ఇక, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ కవితను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్టు చేసి, ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ►ఈ క్రమంలో కవితను ఈడీ అధికారులు శనివారం ఉదయం 11.30 సమయంలో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపర్చారు. మద్యం స్కాం కేసుకు సంబంధించి కవిత నుంచి కీలక అంశాలు రాబట్టాల్సి ఉందని, ఆమెను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందికి ఈడీ నోటీసులు.. ►కవిత భర్త అనిల్‌కు, ఆమె వ్యక్తిగత సిబ్బంది ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. వారిని సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో సోదాల సందర్భంగా ఈడీ అధికారులు ఈ నలుగురి ఫోన్లను సీజ్ చేశారు కూడా. -
రేవంత్ సీఎం అవుతారని పదేళ్ల క్రితమే చెప్పా..
కంటోన్మెంట్: రేవంత్‌రెడ్డి సీఎం అవుతాడని తాను పదేళ్ల క్రితమే జోస్యం చెప్పానని మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. 2014 సెపె్టంబర్లో మల్లారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కంటోన్మెంట్ పరిధిలో జరిగిన ఓ ప్రైవేటు ఫంక్షన్లో రేవంత్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదా సంభాషణల్లో భాగంగా మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ... ‘అన్నా నువ్వు సీఎం అవుతావు అన్నా.. ఆ చాన్స్ నీ ఒక్కడికే ఉంది రెడ్డిలల్ల..’అన్నారు. అప్పట్లో తీన్మార్ వార్తల్లో ప్రసారం అయిన ఈ వీడియా తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శనివారం మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వీడియోను చూపుతూ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తనకు రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో తామిద్దరం కలిసి ప్రచారం చేసిన ఫొటోలను సైతం చూపించారు. తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. తాను మాత్రం బీఆర్ఎస్ను వీడేది లేదంటూ స్పష్టం చేశారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నానని తెలిపారు. -
కవిత అరెస్టు ఎన్నికల స్టంట్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఓ ఎన్నికల స్టంట్ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ టీవీ సీరియల్లా సాగదీసి, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు అరెస్టు చేయడం కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీసే డ్రామాయేనని ఆరోపించారు. అరె స్టు సానుభూతితో బీఆర్ఎస్, అవినీతి వ్యతిరేకుల మని చెప్పుకొంటూ బీజేపీ ఓట్లు దండుకునేందుకు చేస్తున్న ప్రయత్నమిదని విమర్శించారు. కవిత తండ్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏమీ స్పందించకపోవడం, ప్రధాని మోదీ కూడా మౌనం పాటించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వందరోజుల పాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ తన నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, డాక్టర్ రోహిణ్‌రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ చట్టసభల్లో మాట్లాడిన ప్రధాని మోదీకి తెలంగాణ పేరు పలికే అర్హత లేదు. గత పదేళ్లలో విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మేం కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై న్యాయ విచారణకు ఆదేశించాం. మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు. కానీ అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదు. భాష గురించి మాజీ సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయమైంది. కేసీఆర్ అసెంబ్లీలో ఉత్తమ్‌ను ఉద్దేశించి ఏం మాట్లాడారో, మొన్న నల్లగొండ సభలో ఎన్ని మాటలు మాట్లాడారో సోషల్ మీడియాలో వస్తోంది చూడమనండి. మా ప్రభుత్వాన్ని పడగొడతారా? ప్రజాప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్, బీజే పీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ ఆలోచన చేస్తే.. వారు నిద్రలేచేసరికి వారి పక్కన ఎవరూ ఉండరు. ఆఖరికి బట్టలు కూడా ఉండవు. మీరు పడగొట్టాలని అనుకుంటే.. నిలబెట్టేందుకు మా ప్రయత్నం మేం చేస్తాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నన్ను కలుస్తున్నారు. ప్రజాప్రభుత్వాన్ని పడగొడతా మని కొందరంటున్నారు, మరికొందరు మాకు అండగా నిలబడతామని చెప్తున్నారు. మేం ఫిరాయింపులను ప్రోత్సహించం. ప్రతిపక్ష పాత్ర కాకుండా ప్ర భుత్వాన్నిపడగొడతామంటే.. మా తడాఖా చూపిస్తాం. ఇది అభద్రతా భావంతో చెప్తున్నది కాదు. మా పాలనకు రెఫరెండం.. బీఆర్ఎస్, బీజేపీల పదేళ్ల పాలనకు, వందరోజుల మా పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం. మేం చేస్తున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలను చూపి ఓట్లు అడుగుతాం..’’అని రేవంత్‌రెడ్డి చెప్పారు. టానిక్ మద్యం వ్యాపారంలో తీగలాగుతున్నామని.. దొరలు, పెద్దలంతా బయటకు వస్తారని, వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వంద రోజుల పాలన పూర్తి సంతృప్తినిచ్చింది రాష్ట్రంలో వందరోజుల పాలన పూర్తి సంతృప్తినిచ్చింది. ‘మార్పు కావాలి–కాంగ్రెస్ రావాలి’నినాదం, 6 గ్యారంటీలను చూసి ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఆ మార్పు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వందేళ్లకు సరిపడా విధ్వంసం చేస్తే.. దానిని చక్కదిద్దేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాంటి హంగూ ఆర్భాటాలకు వెళ్లకుండా ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరిస్తున్నారు. సీఎం దర్శన భాగ్యమే కలగని రోజుల నుంచి సీఎం, మంత్రులంతా ప్రజల్లోనే ఉండే మార్పు వచ్చింది. విజ్ఞులు, మేధావులు, కళాకారులతో కలసి, వారి ఆలోచనలను తెలుసుకుంటూ పాలన సాగిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఇప్పటివరకు 26 కోట్ల ప్రయాణాలు జరిగాయి. ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాం. రూ.500 సిలిండర్‌ను 8 లక్షల మంది వినియోగించుకున్నారు. 37 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. పారదర్శక పాలన అందిస్తున్నాం. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చాం. కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతూ పెండింగ్ పథకాలకు అనుమతులు తెచ్చుకుంటున్నాం. పొరుగు రాష్ట్రాలతో గిల్లికజ్జాలు పెట్టుకోదలుచుకోలేదు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మోదీ, ఈడీ కలసి వచ్చారు ఎన్నికల సమయంలో సాధారణంగా ఈడీ, సీబీఐ ముందు వస్తే తర్వాత మోదీ వచ్చేవారు. కానీ కవిత కేసులో ఇద్దరూ ఒకేసారి వచ్చారు. మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా మౌనం దాల్చడం రాజకీయ లబ్ధి తప్ప మరొకటి కాదు. బీఆర్ఎస్, బీజేపీల నాటకాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. వచ్చే ఐదేళ్లూ కాంగ్రెస్ దోచుకుంటుందంటూ మా ప్రభుత్వంపై చౌకబారు ఆరోపణలు చేయడం ప్రధాని మోదీ స్థాయికి తగదు. దళిత ఉప ముఖ్యమంత్రి భట్టిని తక్కువ ఎత్తు పీటపై కూర్చోబెట్టడం అవమానించడమేనంటూ, గతంలో అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందంటూ ప్రధాని మోదీ మాట్లాడటం దారుణం. అసలు దళితులను రాష్ట్రపతిని, సీఎంలను చేసినదే కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు దళితుడే. ఈ విషయాన్ని మోదీ గుర్తించుకోవాలి. -
ఇసుర్రాయిలో తెలంగాణ నలిగిపోయింది
నాగర్‌కర్నూల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య తెలంగాణ ఇసుర్రాయిలో పడిన మాదిరిగా నలిగిపోయిందని.. ఆ రెండూ పార్టీలు కలసి తెలంగాణకు సంబంధించిన ప్రతీ స్వప్నాన్ని ఛిద్రం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లూటీకి పాల్పడితే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు భూములు, ఇతర ఆస్తుల కైంకర్యానికి దిగుతోందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టు తయారైందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతాన్ని రెండింతలు చేశారని.. ఈ ఎన్నికల్లో బీజేపీని రెండంకెల సీట్లలో గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు..’అంటూ తెలు గులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల నగారా మోగిస్తోందని సాయంత్రమే టీవీల్లో చూశా. కానీ దేశ ప్రజలు ఇప్పటికే అబ్కీ బార్.. మోదీ సర్కార్.. 400 పార్ (మళ్లీ మోదీ సర్కార్.. ఈసారి 400 సీట్లపైనే..) అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నాగర్‌కర్నూల్‌లో జన సునామీని.. నిన్న మల్కాజిగిరిలో రోడ్‌షోకు వచి్చన అద్భుత స్పందనను చూస్తే.. మోదీనే మరోసారి ప్రధాని అని తెలంగాణ చెబుతున్నట్టు ఉంది. ఏ ఒక్క అవినీతిపరుడు తప్పించుకోలేడు అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరూ శిక్ష పడకుండా తప్పించుకోలేరని తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను. అవినీతిపరులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో మాకు తెలంగాణ ప్రజలు, యువత, మహిళల ఆశీర్వాదం కావాలి. కాంగ్రెస్ చేసేది మోసాలు, దోపిడీయే.. ఏడు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మోసాలు, దోపిడీ తప్ప ఏమీ లేవు. గరీబీ హఠావో అని నినాదమిచ్చి మోసానికి, లూటీకి దిగింది. పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చాకే దేశంలో మార్పు ప్రారంభమైంది. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారు. మార్పు అనేది మోదీ గ్యారంటీగా అమల్లోకి వచి్చంది. ఇప్పుడు మనందరం కలసి తెలంగాణలో కూడా మార్పు తీసుకురావాలి. మోదీ మీ ఓట్లతో గెలిచి కుటుంబ సభ్యులకో, పరివారానికో పదవులు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఏర్పాటు చేయడు. మొత్తం 140 కోట్ల మంది భారతీయులు మోదీ కుటుంబ సభ్యులే. 23 ఏళ్ల నుంచి సీఎంగా, ప్రధానిగా ప్రజలకు సేవచేసే అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఒక్కరోజు కూడా నా కోసం సెలవు తీసుకోలేదు. పేదలకు లబ్ధి చేకూర్చడం కోసం జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు, బీమా, ముద్రా రుణాలు, ఆయుష్మాన్ భారత్ వంటివి తెచ్చాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ మొదలైంది. దీనిని పూర్తి చేయడం మోదీ గ్యారంటీ. అట్టడుగు వర్గాలను కాంగ్రెస్ అవమానిస్తోంది కేందప్రభుత్వ పథకాల ద్వారా అత్యధికప్రయోజ నం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, రైతులకే అందుతోంది. ఇది సామాజిక న్యాయం. ఈ పథకాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి అవినీతి, కుటుంబ పార్టీలు వ్యతిరేకిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అవమానిస్తోంది. గతంలో అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించింది. ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి కాకుండా ఓడించాలని చూసింది. ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టి అవమానించింది. కేసీఆర్ కూడా కొత్త రాజ్యాంగం కావాలంటూ అంబేడ్కర్‌ను అవమానించారు. దళితబంధు ఇస్తామని మోసం చేశారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి దగా చేశారు. కాంగ్రెస్ 2జీ స్కామ్‌కు పాల్పడితే.. బీఆర్ఎస్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతికి దిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ భూముల కుంభకోణాలకు దిగాయి..’’అని ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీ తరఫున బరి లో ఉన్న పి.భరత్‌ప్రసాద్ (నాగర్‌కర్నూల్), డీకే అరుణ (మహబూబ్‌నగర్), కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్) శానంపూడి సైదిరెడ్డి (నల్గొండ)లను వేదికపై నుంచి సభికులకు మోదీ పరిచయం చేశారు. పార్టీ తరఫున ప్రజలకు సేవ బాధ్యతను వారికి అప్పగించానని, వారిని గెలిపించి మద్దతివ్వాలని కోరారు. దొంగలు పోతే గజదొంగలు వచ్చారు: కిషన్‌రెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి, దొంగల పాలన పోవాలనుకుంటే.. గజ దొంగలు అధికారంలోకి వచ్చారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘‘గతంలో కాంగ్రెస్ హయాంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు గ్యారంటీల పేరిట గారడీ చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోంది. గ్యారంటీలు అమలు చేస్తున్నామని ప్రచారం చేస్తోందే తప్ప క్షేత్రస్థాయిలో అవి పేదలకు ఏమాత్రం అందడం లేదు. గత పదేళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంది. రాష్ట్రంలో సరిపోక ఢిల్లీలో కూడా లిక్కర్ వ్యాపారంలో అవినీతికి పాల్పడ్డారు. తాజా అరెస్టులు, ఇతర పరిణామాలకు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలి..’’అని పేర్కొన్నారు. తెలంగాణలో నిజమైన మా ర్పు రావాలంటే రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘ఎక్స్’లో నా ప్రసంగాలను తెలుగులో వినండి ‘‘నా ప్రసంగాలను, ఆలోచనలను, నాకు–ప్రజలకు మధ్య సంభాషణలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లేందుకు, ప్రతి పౌరుడు వినేందుకు కృత్రిమ మేధ ద్వారా అందుబాటులో ఉంచాం. ఎక్స్ (ట్విటర్)లో ‘నమో ఇన్ తెలుగు’హ్యాండిల్ ద్వారా చూడొచ్చు. ఏఐని ఉపయోగించి నాతో జతకలవొచ్చు. ప్రసంగాలను అంతా వినండి..’’అని ప్రధాని మోదీ కోరారు. ఇక తన ప్రసంగాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్‌రావు తెలుగులోకి అనువదిస్తుంటాన్ని చూసి.. ‘‘ఇంత బాగా ట్రాన్స్‌లేట్ చేస్తున్నారు. పదిరోజులు మీరు నాతో ఉంటే నాకు తెలుగు వచ్చేస్తుంది..’’అని నవ్వుతూ పేర్కొన్నారు. 17 సీట్లలో కమలం వికసించాలి తెలంగాణను మళ్లీ నాశనం చేసేందుకు కాంగ్రెస్‌కు ఐదేళ్లు చాలు. దేశవ్యాప్తంగా బీజేపీని 400 సీట్లలో గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ తమ ఇష్టానుసారం చేయడం సాధ్యం కాదు. అందువల్ల తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో కమలం పువ్వును వికసించేలా చేయండి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతాన్ని రెండింతలు చేశారు. ఈసారి రెండంకెల సీట్లలో గెలిపించండి. అలా చేస్తే తెలంగాణ ప్రజల నుంచి ఎంపీల ద్వారా నాకు నేరుగా సందేశం చేరుతుంది. మీకు మరింత సేవచేసే అవకాశం నాకు లభిస్తుంది. మీ కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలు తెలుసుకుని.. వాటిని తీర్చేందుకు రాత్రీపగలూ శ్రమిస్తా.. – ప్రధాని మోదీ -
నామినేటెడ్ పదవుల పందేరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. నామినేటెడ్ పదవుల కసరత్తు పూర్తయిందని, ఏ క్షణమైనా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడవచ్చని మూడు రోజులుగా గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజున శనివారం రాత్రి అనధికారిక సమాచారం మీడియాకు అందింది. అయితే, ఈనెల 14వ తేదీనే ఉత్తర్వులు వెలువడినట్టు ఇందులో పేర్కొన్నారు. పదవుల పంపిణీ ఇలా... 1) పటేల్ రమేశ్‌రెడ్డి – టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్; 2) కె.శివసేనారెడ్డి – స్పోర్ట్స్ అథారిటీ; 3) ఎన్.ప్రీతమ్ – ఎస్సీ కార్పొరేషన్; 4) నూతి శ్రీకాంత్–బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్; 5) ఎస్.అన్వేశ్ రెడ్డి–విత్తనాభివృద్ధి కార్పొరేషన్; 6) ఈరవత్రి అనిల్–మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్; 7) ఎం.విజయబాబు – సహకార, గృహనిర్మాణ సమాఖ్య; 8) రాయల నాగేశ్వరరావు – వేర్ హౌసింగ్ కార్పొరేషన్; 9) కాసుల బాలరాజు– ఆగ్రో ఇండస్ట్రీస్; 10 నేరెల్ల శారద – మహిళా కమిషన్; 11) బంట్రు శోభారాణి – మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్; 12) సీహెచ్ జగదీశ్వర్‌రావు – నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్; 13) జంగా రాఘవరెడ్డి – నూనె గింజల పెంపకందారుల సమాఖ్య; 14) మానాల మోహన్‌రెడ్డి – కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్; 15) బెల్లయ్యనాయక్ – గిరిజన, సహకార, ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్; 16) ఆర్,గురునాథ్‌రెడ్డి– పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్; 17) జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ – డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్; 18) చల్లా నర్సింహారెడ్డి యూఎఫ్ఐడీసీ; 19) మెట్టు సాయికుమార్ – మత్స్యసహకార సొసైటీల సమాఖ్య; 20) కొత్తాకు నాగు – ఎస్టీ సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ; 21) జనక్ ప్రసాద్ – కనీస వేతన సలహా మండలి; 22) ఎండీ రియాజ్ – గ్రంథాలయ పరిషత్; 23) ఎం.వీరయ్యవర్మ – వికలాంగుల కార్పొరేషన్; 24) నాయుడు సత్యనారాయణ – చేనేత; 25) ఎంఏ జబ్బార్ – వైస్ చైర్మన్, మైనార్టీస్ ఫైనాన్స్; 26) నిర్మలా జగ్గారెడ్డి – పారిశ్రామిక మౌలికసదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ); 27) మల్రెడ్డి రాంరెడ్డి – రహదారుల అభివృద్ధి; 28) కల్వ సుజాత – వైశ్య కార్పొరేషన్; 29) పొడెం వీరయ్య – అటవీ అభివృద్ధి; 30) ప్రకాశ్‌రెడ్డి – ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్; 31) కె.నరేందర్‌రెడ్డి – సుడా(శాతవాహన అర్బన్ డెవలప్మెంట్); 32) పుంజాల అలేఖ్య – సంగీత నాటక అకాడమీ; 33) గిరిధర్‌రెడ్డి – చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌టీసీ); 34) మన్నె సతీ‹Ùకుమార్ – టీఎస్టీఎస్; 35) జెరిపేటి జైపాల్ – అత్యంత వెనకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఎంబీసీ); 36) వెంకట్రాంరెడ్డి – కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), 37) ఎంఏ ఫయీం – తెలంగాణ ఫుడ్స్ (నోట్: ఈ జాబితా అనధికారిక సమాచారం మేరకు మాత్రమే. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ నెల 14నే ఇచ్చినా ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా వెలువడించాల్సి ఉంది.) -
కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టి బొమ్మల దహనం, రాస్తారోకోలు, ధర్నాలతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు నిరసన తెలిపాయి. ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల శనివారం తెల్లవారుజాము నుంచే పార్టీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వనపర్తి, నల్లగొండ తదితర చోట్ల నిరసనలు మి న్నంటాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్ర హం వ్యక్తంచేసింది. లోకసభఎన్నికల ముందు బీఆర్ ఎస్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో కుట్ర పన్నుతున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నిరసనలో అపశృతి సిరిసిల్ల: కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో శనివారం చేపట్టిన ధర్నాలో భాగంగా ప్రధాని మోదీ ఫ్లెక్సీపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ క్రమంలో కోడం సాయి (30) అనే యువకుడికి మంటలంటుకున్నాయి. వెంటనే మంటలార్పి అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇదే ఆందోళన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మహిళా ఎంపీపీలు పరస్పరం ఘర్షణపడి ఒకరినొకరు కొట్టుకోబోయారు. నేతలు వారిని వారించారు. -
పొత్తుకు బ్రేక్.. బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తుపై బీఎస్పీ వెనకడుగు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కుదిరిందని బీఆర్ఎస్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బ్రేక్ పడింది. బీఆర్ఎస్తో పొత్తును విరమించుకుంటున్నట్లు బీఎస్పీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. పొత్తు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం తనకు ఇష్టం లేదని చెప్పడంతోపాటు తాను బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నందినగర్‌లో కేసీఆర్‌తో ప్రవీణ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన భవిష్యత్తు ప్రస్థానం బీఆర్ఎస్, కేసీఆర్‌తో కొనసాగుతుందని భేటీ అనంతరం ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఇదిలాఉంటే ఒకట్రెండు రోజుల్లో ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరతారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. బీఎస్పీతో పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే ప్రవీణ్‌కు బీఆర్ఎస్లో కీలక పదవి కూడా దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పకూడదనే..: ప్రవీణ్ కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో కాకుండా ప్రాంతీయ పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవాలని అందరితో చర్చించి నిర్ణయించుకున్నాం. అందులోభాగంగా బీఆర్ఎస్తో జరిగిన చర్చల ఫలితంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలు కేటాయించారు. దీనికి బీఎస్పీ జాతీయ నాయకత్వం కూడా అంగీకరించినా బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవడం బీజేపీకి నచ్చలేదు. పొత్తును విరమించుకోవాలని బీఎస్పీ అధిష్టానంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని బీఎస్పీ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు అందాయి. పొత్తు కోసం కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించాను. రాబోయే రోజుల్లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తా. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. బహుజన వాదాన్ని ఎన్నటికీ వీడను. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఎస్పీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నా. శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ నిర్ణయం తీసుకుంటా’ అని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆది నుంచీ ఊగిసలాటే... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ, బీఆర్ఎస్ నడుమ పొత్తు చర్చల్లో మొదటి నుంచీ ఊగిసలాట ధోరణి కనిపించింది. ఓ వైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్‌తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే తాము దేశంలో ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రకటించారు. అయితే మాయావతి ప్రకటన తెలంగాణకు వర్తించదని ప్రవీణ్ పేర్కొన్నారు. మరోవైపు మాయావతితో కేసీఆర్ మాట్లాడారని కూడా పేర్కొన్నారు. రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో బీఎస్పీ మూడు సీట్లు కోరినట్లు ప్రచారం జరగ్గా.. నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అది జరిగి 24 గంటలు కాకమునుపే బీఎస్పీని వీడుతున్నట్లు ప్రవీణ్ ప్రకటించి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.ఐపీఎస్ అధికారి నుంచి... సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రవీణ్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించారు. గురుకుల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి తెచ్చేందుకు కృషి చేశారు. ‘స్వేరోస్’ సంస్థ ద్వారా గురుకులాల విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 2021లో తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్‌కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలో కాన్షీరాం అధ్యక్షుడిగా ఉన్న 1994 నుంచి రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ విఫలమైన బీస్పీలో ప్రవీణ్‌కుమార్ చేరడమే అప్పట్లో చర్చనీయాంశమైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తిచూపుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, పర్యటనలు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువతను ఏకం చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 107 మంది బీఎస్పీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆయన స్వయంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ మనుగడ కోసం తాను పోరాడిన బీఆర్ఎస్తోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. -
టార్గెట్.. బీఆర్ఎస్ ఖతం!
సాక్షి, హైదరాబాద్: ‘నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. నాకేదో కాళ్లలో కట్టె పెట్టాలి. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే... మిమ్మల్ని దించుతామని చెప్పి దించి చూపెట్టాం. ఇప్పుడు కూడా స్పష్టంగా చెబుతున్నా. పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపు మీ పక్కన ఎవరూ ఉండరు. అలా వాళ్లు కోరుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. మీరు తారీఖు చెప్పండి. పడగొట్టేది ఏంటో చెప్పండి. దాని పరిణామాలేంటో నేను చెప్తా..’ అని శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆన్‌రికార్డ్ మాట్లాడిన మాటలు ఇవి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రేవంత్ భరోసా వెనుక ఉన్న ఆంతర్యమేంటన్న దానిపై పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం బీఆర్ఎస్ పక్షాన ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది కాంగ్రెస్‌తో టచ్‌లోకి వచ్చారని తెలుస్తోంది. ఏ క్షణమైనా, పరిస్థితి ఎలా ఉన్నా ఎదుర్కొనే ప్రణాళికలో భాగంగానే అన్ని రకాల మంతనాలు పూర్తయ్యాయని, భవిష్యత్తులో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకున్నామని రేవంత్ సన్నిహితులు బహిరంగంగానే చెబుతుండటం గమనార్హం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు కొత్తగా ఎన్నికైన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బీఆర్ఎస్తో బంధం తెంచుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలు మినహా అందరూ టచ్‌లోకి వచ్చినట్లు వారు చెబుతుండటం చర్చనీయాంశమవుతోంది. కర్ణాటక తర్వాత ఇక్కడేనా? పార్లమెంటు ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా, కర్ణాటక రాజకీయాల్లో మార్పులను బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా లేదా అన్నది తేలుతుందని ఇప్పటికే బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో మంచి మెజార్టీతో మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చి, కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారును పడగొట్టగలిగితే తెలంగాణలోనూ కచ్చితంగా ఆపరేషన్ ఉంటుందని కమలనాథులు కూడా బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక టీమ్ ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేసుకుంటోందని తెలుస్తోంది. అనివార్య పరిస్థితులు వస్తే ఏకంగా బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని (బీఆర్ఎస్ఎల్పీ) కాంగ్రెస్‌లో విలీనం చేసే లక్ష్యంగానే ఇది సాగుతోందని సమాచారం. ఈ భరోసాతోనే మీడియా సమావేశంలో రేవంత్ భరోసాతో కూడిన వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం తనను కలిసిన ఎమ్మెల్యేలు కూడా అండగా నిలుస్తామని, నిజంగా అలాంటి పరిస్థితులు వస్తే తాము నిలబడతామని చెబుతున్నారని రేవంత్ వెల్లడించడం గమనార్హం. -
కవిత అరెస్టు ఎన్నికల స్టంట్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఓ ఎన్నికల స్టంట్ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ టీవీ సీరియల్లా సాగదీసి, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు అరెస్టు చేయడం కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీసే డ్రామాయేనని ఆరోపించారు. అరెస్టు సానుభూతితో బీఆర్ఎస్, అవినీతి వ్యతిరేకుల మని చెప్పుకొంటూ బీజేపీ ఓట్లు దండుకునేందుకు చేస్తున్న ప్రయత్నమిదని విమర్శించారు. కవిత తండ్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏమీ స్పందించకపోవడం, ప్రధాని మోదీ కూడా మౌనం పాటించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వందరోజుల పాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ తన నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, డాక్టర్ రోహిణ్‌రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ చట్టసభల్లో మాట్లాడిన ప్రధాని మోదీకి తెలంగాణ పేరు పలికే అర్హత లేదు. గత పదేళ్లలో విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మేం కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై న్యాయ విచారణకు ఆదేశించాం. మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు. కానీ అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదు. భాష గురించి మాజీ సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయమైంది. కేసీఆర్ అసెంబ్లీలో ఉత్తమ్‌ను ఉద్దేశించి ఏం మాట్లాడారో, మొన్న నల్లగొండ సభలో ఎన్ని మాటలు మాట్లాడారో సోషల్ మీడియాలో వస్తోంది చూడమనండి. మా ప్రభుత్వాన్ని పడగొడతారా? ప్రజాప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్, బీజే పీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ ఆలోచన చేస్తే.. వారు నిద్రలేచేసరికి వారి పక్కన ఎవరూ ఉండరు. ఆఖరికి బట్టలు కూడా ఉండవు. మీరు పడగొట్టాలని అనుకుంటే.. నిలబెట్టేందుకు మా ప్రయత్నం మేం చేస్తాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నన్ను కలుస్తున్నారు. ప్రజాప్రభుత్వాన్ని పడగొడతా మని కొందరంటున్నారు, మరికొందరు మాకు అండగా నిలబడతామని చెప్తున్నారు. మేం ఫిరాయింపులను ప్రోత్సహించం. ప్రతిపక్ష పాత్ర కాకుండా ప్ర భుత్వాన్నిపడగొడతామంటే.. మా తడాఖా చూపిస్తాం. ఇది అభద్రతా భావంతో చెప్తున్నది కాదు. మా పాలనకు రెఫరెండం.. బీఆర్ఎస్, బీజేపీల పదేళ్ల పాలనకు, వందరోజుల మా పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం. మేం చేస్తున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలను చూపి ఓట్లు అడుగుతాం..’’అని రేవంత్‌రెడ్డి చెప్పారు. టానిక్ మద్యం వ్యాపారంలో తీగలాగుతున్నామని.. దొరలు, పెద్దలంతా బయటకు వస్తారని, వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మోదీ, ఈడీ కలసి వచ్చారు ఎన్నికల సమయంలో సాధారణంగా ఈడీ, సీబీఐ ముందు వస్తే తర్వాత మోదీ వచ్చేవారు. కానీ కవిత కేసులో ఇద్దరూ ఒకేసారి వచ్చారు. మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా మౌనం దాల్చడం రాజకీయ లబ్ధి తప్ప మరొకటి కాదు. బీఆర్ఎస్, బీజేపీల నాటకాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. వచ్చే ఐదేళ్లూ కాంగ్రెస్ దోచుకుంటుందంటూ మా ప్రభుత్వంపై చౌకబారు ఆరోపణలు చేయడం ప్రధాని మోదీ స్థాయికి తగదు. దళిత ఉప ముఖ్యమంత్రి భట్టిని తక్కువ ఎత్తు పీటపై కూర్చోబెట్టడం అవమానించడమేనంటూ, గతంలో అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందంటూ ప్రధాని మోదీ మాట్లాడటం దారుణం. అసలు దళితులను రాష్ట్రపతిని, సీఎంలను చేసినదే కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు దళితుడే. ఈ విషయాన్ని మోదీ గుర్తించుకోవాలి. వంద రోజుల పాలన పూర్తి సంతృప్తినిచ్చింది రాష్ట్రంలో వందరోజుల పాలన పూర్తి సంతృప్తినిచ్చింది. ‘మార్పు కావాలి–కాంగ్రెస్ రావాలి’నినాదం, 6 గ్యారంటీలను చూసి ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఆ మార్పు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వందేళ్లకు సరిపడా విధ్వంసం చేస్తే.. దానిని చక్కదిద్దేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాంటి హంగూ ఆర్భాటాలకు వెళ్లకుండా ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరిస్తున్నారు. సీఎం దర్శన భాగ్యమే కలగని రోజుల నుంచి సీఎం, మంత్రులంతా ప్రజల్లోనే ఉండే మార్పు వచ్చింది. విజ్ఞులు, మేధావులు, కళాకారులతో కలసి, వారి ఆలోచనలను తెలుసుకుంటూ పాలన సాగిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఇప్పటివరకు 26 కోట్ల ప్రయాణాలు జరిగాయి. ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాం. రూ.500 సిలిండర్‌ను 8 లక్షల మంది వినియోగించుకున్నారు. 37 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. పారదర్శక పాలన అందిస్తున్నాం. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చాం. కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతూ పెండింగ్ పథకాలకు అనుమతులు తెచ్చుకుంటున్నాం. పొరుగు రాష్ట్రాలతో గిల్లికజ్జాలు పెట్టుకోదలుచుకోలేదు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ పసునూరి దయాకర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్త నేతలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. -
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్‌బై చెప్పారు. బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ‘బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల (వాటికి ఎంత మంచి ప్రాముఖ్యత ఉన్నా) వల్ల బీఎస్పీ వంటి గొప్ప పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల బీఆర్ఎస్-బీఎస్పీ పార్టీలు లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left. With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭. I don’t want the image of… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2024 బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌గా ప్రవీణకుమార్ ప్రకటించారు. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయటం పార్టీకి పెద్ద షాక్ అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
Hyd: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తా.. లాస్య నందిత సోదరి నివేదిత
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత తెలిపారు. శనివారం కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. క్యార్యకర్తలు, కంటోన్మెంట్ ప్రజల కోరిన తర్వాతే పోటీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నాన్న సాయన్నను, చెల్లి లాస్యనందితను ఆదరించినట్లుగానే కంటోన్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు. త్వరలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా, ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్‌సభ ఎన్నికలతో పాటే ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్వహించనుంది. ఉప ఎన్నికలో పోటీకి లాస్య నందిత సోదరి ముందుకు రావడంతో బీఆర్ఎస్ కూడా ఆమెకే టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నేను ఉంటా - దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత pic.twitter.com/M8Fm7gMlRK — Telugu Scribe (@TeluguScribe) March 16, 2024 -
ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు.. ప్రధాని మోదీ
సాక్షి,నాగర్‌కర్నూల్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించకముందే దేశ ప్రజలు తీర్పు ఇచ్చేశారని, మూడోసారి మోదీయే ప్రధాని అని నిర్ణయించారని ప్రధాని అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చార్సౌ పార్( నాలుగు వందలు దాటి) అని నినదిస్తున్నారన్నారు. సభలో మోదీ మాట్లాడుతూ ‘ నిన్న(మార్చ్15) మల్కాజ్గిరి రోడ్ షోలో నిన్న జన ప్రవాహాన్ని చూశాను. యువకులు, మహిళలు, వృద్ధులు చాలా మంది రోడ్ల మీద నిల్చొని బీజేపీకి మద్దతు తెలిపారు. మల్కాజ్‌గిరిలో అద్భుతం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలపుడు బీఆర్ఎస్ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చూశాను. మోదీని మూడోసారి ప్రధాని చేయడానికి ఇప్పుడు అంతే ఉత్సాహంతో వేచి చూస్తున్నారు. గత పదేళ్లలో కేంద్ర పథాకాలు తెలంగాణ ప్రజలకు చేరకుండా అవినీతి, అబద్ధాల కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి. ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ అంబేద్కర్‌ను ఓడించింది. గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఓడించాలని చూశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఎస్సీ వర్గానికి చెందిన ప్రస్తుత డిప్యూటీ సీఎంను కూడా ఇప్పుడు అవమానిస్తోంది. కాంగ్రెస్ నేతలు పైన కూర్చుంటారు. ఎస్సీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెడతారు. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బాటలో వెళ్లే పార్టీనే. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అని పిలుస్తారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది. కానీ పదేళ్లలో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నలిగిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల కలలను చిన్నాభిన్నం చేశారు. ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆటలు సాగవు. ఇందుకే ఇక్కడ బీజేపీ ఎంపీలు గెలవాల్సి ఉంది. తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపీలుంటే నేను మీకు చాలా సేవ చేయడానికి వీలవుతుంది. ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే మీ ఆకాంక్ష ఢిల్లీలో నాకు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓట్లు రెండింతలు చేశారు. ఈసారి బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లివ్వండి. నా ప్రసంగాలు ఎక్స్(ట్విటర్)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో తెలుగులో వినండి. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాడు. అంబేద్కర్‌ను అవమానిస్తున్నాడు. దళితబంధుతో కేసీఆర్ దళితులను మోసం చేశాడు. బీఆర్ఎస్ దళితున్ని సీఎం చేస్తానని చేయలేదు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ స్కాముల్లో భాగస్వాములు, కాంగ్రెస్ 2జీ కుంభకోణం చేస్తే బీఆర్ఎస్ నీటి పారుదల ప్రాజెక్టులో అవినీతి చేసింది. రాష్ట్రం బయటికి వెళ్లి అవినీతి పార్టీలతో కలిసి అవినీతి చేశారు. ఈ నిజాలు రోజు మన ముందు బయటపడుతూనే ఉన్నాయి. మోదీ మీ దగ్గర ఓటు తీసుకుని కుటుంబ సభ్యులకు కుర్చీ ఇవ్వడు. వారి బ్యాంకు బ్యాలెన్సులు పెంచడు.140 కోట్ల మంది మోదీ కుటుంబ సభ్యులే. మోదీ కుర్చీలో కూర్చొని సుఖ పడడు. చాలా కాలం సీఎంగా, ఇప్పుడు పీఎంగా నాకు సేవ చేసే అవకాశమిచ్చారు. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నేను నా కోసం వాడుకోలేదు. నేను ఏమైనా చేశానంటే, రాత్రి పగలు కష్టపడ్డానంటే 140 కోట్ల మంది ప్రజల కోసమే. ఇందుకే మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేసే గ్యారెంటీ. ఆర్టికల్ 370 రద్దు చేస్తామంటే చేశాం. రాముడు సొంతింటికి వస్తాడని చెప్పాం. వచ్చాడు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రభాగంలో నిలిపాం. ఇది మోదీ గ్యారెంటీ . తెలంగాణలో పేదల కోసం ఒక కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. తెలంగాణలో 1 కోటి 50 లక్షల మందికి బీమా చేశాం. తెలంగాణలో 67 లక్షల కంటే చిన్న వ్యాపారులకు ముద్ర రుణాలు వచ్చాయి. 80 లక్షల కంటే ఎక్కువ మందికి ఆయుష్మాన్ భారత్ లబ్ధి చేకూరింది. తెలంగాణ ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఒక్క అవినీతి పరున్ని వదలను. అవినీతిపై పోరాడేందుకు నాకు ఆశీర్వాదం ఇవ్వండి. నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించండి’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్, నల్గొండ, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: ప్రధాని మోదీ
Live Updates.. బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న మోదీ ప్రసంగం... తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: మోదీ గత పదేళ్ల తెలంగాణ అభివృద్దికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసింది తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయి మల్కాజ్‌గిరిలో ప్రజల అద్భుత స్పందన చూశాను వేగవంతమైన అభివృద్ధి కూడా తెలంగాణలో తీసుకురావాలి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్దికి అడ్డుగా మారాయి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి పాల్పడింది తెలంగాణను గేట్‌వే ఆఫ్ సౌత్ అంటారు ఏడు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవటం మినహా కాంగ్రెస్ ఏం చేయలేదు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలి 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం ఈసారి 400 సీట్లు ఎన్డీయేకు రాబోతున్నాయి గరీబీ హఠావో నినాదం కాంగ్రెస్‌వాళ్లు ఇచ్చారు. కానీ, పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద లబ్ది పొందారు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది బీజేపీనే దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు జరిగింది ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశాం రాజ్యాంగాన్ని మారుస్తామని అంబేద్కర్‌ను కేసీఆర్ అవమానించారు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అడుగు జాడల్లోనే నడుస్తోంది కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లి లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడ్డ చరిత్ర కేసీఆర్ కుటుంబానిది. కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోంది. గ్యారెంటీల పేరతో కాంగ్రెస్ గారడీలు చేస్తోంది. నేడు యువత, ప్రజలు, మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో దోచుకుంది సరిపోక ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దోచుకున్నారు. ►నాగర్ కర్నూల్ చేరుకున్న ప్రధాని మోదీ. కాసేపట్లో బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొననున్న మోదీ. ►బేగంపేట్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ.. ►ప్రధాని మోదీ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ పాల్గొననున్నారు. ►కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జిల్లాలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ►శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భారీ రోడ్డుషోలో పాల్గొన్నారు. రాత్రి వరకు ఈరోడ్డు షో కొనసాగింది. ►అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకొని మోదీ అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూల్‌కు మోదీ వెళ్లనున్నారు. అక్కడ వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ►ఈ బహిరంగ సభలో కృష్ణా క్లస్టర్ పరిధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్ సభ స్థానాల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థులతోపాటు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోనున్నారు.