వర్షకాలం మొదలుకాక ముందే వర్లీలోని రెండు స్టార్మ్‌వాటర్ పంపింగ్ స్టేషన్లను పూర్తి చేస్తామని...
- ప్రకటించిన బీఎంసీ..రూ. 228 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి
- వర్షపు నీటిని తరలింపు కోసం వాటర్ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం
సాక్షి, ముంబై: వర్షకాలం మొదలుకాక ముందే వర్లీలోని రెండు స్టార్మ్‌వాటర్ పంపింగ్ స్టేషన్లను పూర్తి చేస్తామని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే రూ. 228 కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొంది. జూన్ మొదటి వారంలో ఈ పనులు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. పనులు పూర్తయితే మహాలక్షి, దాదర్ ప్రాంతాల్లో వర్షపు నీటి సమస్య ఉండదని తెలిపింది. ప్రతి ఏటా వర్షకాలంలో దాదర్ రైల్వే స్టేషన్, పూల మార్కెట్, సేనాపతి బాపట్ మార్గ్, ఎన్.ఎం.జోషి మార్గ్ ఇతర దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయి. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పంపింగ్ స్టేషన్ల ద్వారా వరద నీటిని సముద్రంలో కలిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
ప్రస్తుతం నగరంలో ఐర్లా, హజిఅలీలో పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరిన్ని పంపింగ్ స్టేషన్ల నిర్మాణాన్ని ఆరేళ్ల క్రితమే బీఎంసీ చేపట్టింది. రూ.3,535 కోట్లతో బ్రిమ్‌స్టోవాడ్ ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది ప్రాంతాల్లో పంపింగ్ స్టేషన్లను నిర్మించాలని నిర్ణయించింది. హజిఅలీ, జుహూలోని ఐర్లా, లవ్‌గ్రోవ్, క్లేవ్‌ల్యాండ్ బందర్ (ఈ రెండు వర్లీలోనే ఉన్నాయి) బ్రిటానియా (రే రోడ్), గజ్‌దర్‌బంద్ (ఖార్‌దందా), మొగ్ర సాంతక్రూజ్, మహుల్‌లలో వాటిని నిర్మించనుంది. అయితే ఇప్పటి వరకు కేవలం రెండు పంపింగ్ స్టేషన్లను మాత్రమే బీఎంసీ పూర్తి చేసింది. దాదాపు రూ.115 కోట్లను క్లేవ్ బందర్‌కు, లవ్‌గ్రోవ్ పంపింగ్ స్టేషన్‌కు రూ.113 కోట్లను ఖర్చు చేశారు. క్లేవ్‌లో ఏడు పంపులు, లవ్‌గ్రోవ్‌లో 10 పంపులున్నాయి. ఈ పంప్‌ల ద్వారా దాదాపు 6,000 లీటర్ల వరద నీటిని ఒక్క సెకెండ్‌లో తొలగించవచ్చని సమాచారం.