ఉబర్ రేప్ కేసులో సాక్షులని పునర్విచారించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. అంతే కాకుండా ప్రస్తుతం ట్రయిల్ కోర్టు
న్యూఢిల్లీ: ఉబర్ రేప్ కేసులో సాక్షులని పునర్విచారించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. అంతే కాకుండా ప్రస్తుతం ట్రయిల్ కోర్టులో కొనసాగుతున్న విచారణలపై కూడా స్టే మంజూరు చేసింది. సాక్షుల పునర్విచారణకి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన అప్పీలుపై స్పందించిన న్యాయమూర్తులు జస్టిస్ జగదీష్ సింగ్, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలతో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను సీల్డు కవర్‌లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అలాగే బాధితురాలు దాఖలు చేసిన అప్పీలుపై రెండు వారాల్లోగా స్పందించాలని నిందితుడు శివ్‌కుమార్ యాదవ్, ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, సాక్షులని సరిగ్గా విచారించలేదని వారిని పునర్విచారించాలని నిందితుడు ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేయగా, దానికి కోర్టు సానుకూలంగా స్పందిస్తూ మార్చి 4న తీర్పునిచ్చింది. అయితే, బాధితురాలు ఆ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
విచారణ ఆలస్యం అయితే బాధపడాల్సింది నిందితుడేనన్న హైకోర్టు వ్యాఖ్యలపై బాధితురాలు స్పందించింది. అది పూర్తిగా తప్పు, ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ మొదలుకొని ప్రతి విషయంలో తానే వ్యధకు గురవుతున్నానని పేర్కొన్నారు. సాక్షుల పునర్విచారణకు ఆదేశిస్తూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా సాక్షుల పునర్విచారణను రోజువారీ పద్ధతిలో చేయాలని, విచారణను వాయిదాలు వేయొద్దని హైకోర్టు మార్చి 4న తీర్పులో వెలువరించింది.