తిరుచ్చిలో గోడకూలి ముగ్గురు కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచ్చి సింగారతోపు సమీపంలోని మదురై రోడ్డులో కమలేష్ పటేల్ కొయ్యమిల్లు ఉంది.
గోడకూలి ముగ్గురి మృతి
Sep 20 2013 3:05 AM | Updated on Aug 21 2018 5:44 PM
సేలం, న్యూస్‌లైన్: తిరుచ్చిలో గోడకూలి ముగ్గురు కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచ్చి సింగారతోపు సమీపంలోని మదురై రోడ్డులో కమలేష్ పటేల్ కొయ్యమిల్లు ఉంది. కమలేష్ ఆ మిల్లును తొలగించి ఆ స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తొమ్మిది మంది కార్మికులు భవనానికి కడగాలు తీసేపనిలో నిమగ్నమయ్యూరు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారు తవ్వుతున్న స్థలం పక్కన ఉన్న భవనం కాంపౌండ్ గోడ వారిపై కూలిపోయింది. ఆ సమయంలో ముగ్గురు కూలీలు అప్రమత్తమై తప్పించుకున్నారు.
మిగిలిన ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో తిరుచ్చి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఇందులో ఉమారాణి, కన్మణి, పూంగోదైలు మృతి చెందారు. గాయపడ్డ మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం తిరుచ్చి జీహెచ్‌కు తరలించారు. అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది తిరుచ్చి సమీపంలోని మరుదూర్‌కు చెందిన వారుగా గుర్తించారు. కలెక్టర్ జయశ్రీ, మురళీధరన్, సిటీ పోలీసు కమిషనర్ శైలేష్ కుమార్ యాదవ్, తహశీల్దార్ బాలదండాయుధం తదితరులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
Advertisement


