రెండేళ్లుగా కరువుతో కొట్టుమిట్టాడిన రాష్ట్ర రైతుల్లో ఈసారి ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది కోలారు, చిక్కబళాపుర జిల్లాల్లో తప్పించి అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం
సాక్షి, బెంగళూరు : రెండేళ్లుగా కరువుతో కొట్టుమిట్టాడిన రాష్ట్ర రైతుల్లో ఈసారి ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది కోలారు, చిక్కబళాపుర జిల్లాల్లో తప్పించి అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడటంతో ఖరీఫ్‌లో విత్తన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జూలై చివరికి రాష్ట్రంలో అన్ని పంటలకూ కలిపి 74.29 లక్షల హెక్టార్లను ఖరీఫ్ సీజన్‌గా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో ఇప్పటికే 51 లక్షల హెక్టార్ల మేర విత్తన ప్రక్రియ పూర్తయింది. ఇది లక్ష్యంలో దాదాపు 68 శాతం. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 35.22 లక్షల హెక్టార్ల మేరకు మాత్రమే విత్తన ప్రక్రియ పూర్తయ్యింది. పత్తి, చెరకు తదితర వాణిజ్య పంటల విత్తన ప్రక్రియ లక్ష్యం తో పోలిస్తే 91 శాతంతో దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఆ తర్వాతి స్థానంలో పప్పుదినుసులు (74 శాతం), నూనె గింజలు (65 శాతం), ధాన్యపు గింజలు (59 శాతం) ఉన్నాయి.
పెరిగిన నీటి లభ్యత ...
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర తదితర ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తుండటంతో కర్ణాటకలోని అన్ని రిజర్వాయర్లలోకి వరద భారీగా చేరింది. దీంతో రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పంటలకు నీటి లభ్యత పెరగడంతో వాణిజ్య పంటలవైపు రైతులతోపాటు, వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. ఈ ఖరీఫ్‌లో 10.55 లక్షల హెక్టార్లలో వాణిజ్య పంటలను పండించాలని వ్యవసాయ శాఖ లక్ష్యం కాగా ఇప్పటికే 9.65 లక్షల హెక్టార్లలో విత్తన ప్రక్రియ పూర్తయింది. ఇందులో పత్తి 4.5 లక్షల హెక్టార్లు, చెరుకు 4.17 లక్షల హెక్టార్లు, పొగాకు 0.98 లక్షల హెక్టార్లు విస్తీర్ణం మేర విత్తన ప్రక్రియ పూర్తయింది.
పప్పుధాన్యాలు...
ఈ ఖరీఫ్ సీజన్‌లో 15.87 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు పండించాలని లక్ష్యంగా ఎంచుకోగా.. కంది, పెసర తదితర పంటలకు సంబంధించి ఇప్పటి వరకూ 11.73 లక్షల హెక్టార్లలో (74 శాతం) రైతులు విత్తన ప్రక్రియ పూర్తి చేశారు. వేరుశనగ, సూర్యకాంతి తదితర నూనెగింజల పంటలకు సంబంధించి 12.82 లక్షల హెక్టార్లు లక్ష్యం కాగా... ఇప్పటికే 8.33 లక్షల హెక్టార్లలో (65 శాతం) రైతులు విత్తనాలు వేశారు. ధాన్యపు పంటల విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. 21 లక్షల హెక్టార్ల లక్ష్యానికి సంబంధించి ఇప్పటి వరకూ 12.39 (59 శాతం) లక్షల హెక్టార్లలో విత్తన ప్రక్రియ ముగిసింది.
జిల్లాల వారీగా తీసుకుంటే మొత్తం 30 జిల్లాలకు గాను 23 జిల్లాల్లో 60 శాతం పైగా విత్తన ప్రక్రియ పూర్తయింది. ఇందులో హావేరి 97 శాతంతో మొదటి స్థానంలో నిలువగా తుమకూరు 26 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.