
గడిచిన 27 నెలల్లో 8,329 షెల్ కంపెనీల గుర్తింపు
5,873 షెల్ కంపెనీలతో రెండో స్థానంలో ఢిల్లీ.. ఏపీలో 760 షెల్ కంపెనీల గుర్తింపు
27నెలల్లో దేశవ్యాప్తంగా 40,944 షెల్ కంపెనీలను రద్దు చేసిన కేంద్రం
సాక్షి, అమరావతి: అక్రమ వ్యాపారాలు/తాత్కాలిక వ్యాపార అవసరాల కోసం ఏర్పాటు చేసే షెల్ కంపెనీలకు మహారాష్ట్ర అడ్డాగా మారింది. దేశంలోనే అత్యధిక షెల్ కంపెనీలు మహారాష్ట్రలో ఉన్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా రెండేళ్లు ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకపోయినా, దరఖాస్తులు సమర్పించకపోయినా అటువంటి కంపెనీలను కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ షెల్ కంపెనీలుగా గుర్తించి రద్దు చేస్తుంది.
గడిచిన 27నెలల్లో దేశవ్యాప్తంగా 40,944 షెల్ కంపెనీలను గుర్తించి రద్దు చేసినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి హర్ష్ మల్హోత్రా రాజ్యసభలో వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై15 నాటికి దేశవ్యాప్తంగా 40,944 కంపెనీల గుర్తింపును రద్దు చేసినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఒక్క మహారాష్ట్రలోనే 8,329 కంపెనీలుండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో 5,873 కంపెనీలతో ఢిల్లీ నిలిచింది.
4వస్థానంలో తెలంగాణ
దొంగ కంపెనీల ఏర్పాటులో కర్ణాటక మూడోస్థానంలో నిలవగా తెలంగాణ నాలుగోస్థానంలో నిలిచింది. కర్ణాటకలో గడిచిన 27 నెలల్లో 4,803, తెలంగాణలో 3,086 షెల్ కంపెనీలను గుర్తించి రద్దు చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండువేలకుపైనే షెల్ కంపెనీలున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 760 షెల్ కంపెనీలను గుర్తించి రద్దు చేసింది. మిగిలిన రాష్ట్రాల్లోను మరికొన్ని కంపెనీలను రద్దుచేసినట్టు కేంద్రం వివరించింది.