సాంగ్లీకి వెళితేనే...! | there is no use by offices in Sangli | Sakshi
Sakshi News home page

సాంగ్లీకి వెళితేనే...!

Mar 17 2014 10:53 PM | Updated on Aug 28 2018 8:04 PM

పట్టణంలో వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు నామమాత్రంగా మారడంతో స్థానిక పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణంలో వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు నామమాత్రంగా మారడంతో స్థానిక పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు కార్యాలయాల్లో అధికారులను నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పలువురు పారిశ్రామిక వేత్తలు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. పుణేలో పరిశ్రమ, కాలుష్య నియంత్రణ బోర్డు కార్యాలయం,  ఔరంగాబాద్‌లో అబ్కారీ, బారామతిలో విద్యుత్ పంపిణీ, అహ్మద్‌నగర్‌లో ఇండియన్ బాయిలర్ రెగ్యులేషన్ సంస్థలకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఉన్నాయన్నారు. అయితే ఇవి మొక్కుబడిగా మారాయన్నారు.

 దీంతో తాము పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోందన్నారు. ఇది అత్యంత వ్యయప్రయాసలతో కూడుకొని ఉంటుందన్నారు. ముంబై, పుణే, నాసిక్‌ల తర్వాత నాలుగోస్థానంలో షోలాపూర్ ఉంది. ఇక్కడ దుప్పట్లు, వస్త్రాలు తయారు చేసే స్పిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కుటీర, భారీ పరిశ్రమలు దాదాపు 12 వేలవరకు ఉన్నాయి. ఇక్కడికి 200 కిలో మీటర్ల దూరంలోని సాంగ్లీలో జనాభా సంఖ్య తక్కువే. అంతేకాకుండా పరిశ్రమల సంఖ్య కూడా చెప్పుకోదగ్గస్థాయిలో లేదు. అయినప్పటికీ ఎంఐడీసీ ప్రధాన కార్యాలయం మాత్రం ఉంది. 120 కి.మీ దూరంలోని లాతూర్ పట్టణాన్ని షోలాపూర్‌తో పోలిస్తే జనాభా తక్కువే. సహకార సంస్థల సంఖ్య కూడా అంతంతే.

అయితే పారిశ్రామికవాడలో స్థలం అవసరమైతే అందుకోసం పారిశ్రామికవేత్తలు సాంగ్లీకి వెళ్లకతప్పడం లేదు. లాతూర్‌లో రిజిస్ట్రేషన్   ఉపసంచాలకుడు గత ఏడాది బదిలీ అయ్యారు. దీంతో ఈ బాధ్యతలను ఔరంగాబాద్‌లోని డీడీఆర్ డిప్యూటీ డెరైక్లర్లకు అప్పగించారు.  ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన న్యాయవాదులు, ఆయా సంస్థల డెరైక్టర్లు ఔరంగాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. అదేవిధంగా ఎంఐడీసీ ప్రధాన కార్యాలయం పరిస్థితి కూడా ఇదే విధంగా తయారైందని వారు వాపోతున్నారు. ఫిబ్రవరిలో సాంగ్లీకి చెందిన ఎంఐడీసీ ప్రధాన కార్యాలయం ప్రధానాధికారి పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో కొల్హాపూర్‌కు చెందిన ఎంఐడీసీ ప్రధానాధికారికి ఈ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇందుకు సంబంధించిన పనుల కోసం స్థానిక పారిశ్రామిక వేత్తలు కొల్హాపూర్‌కు వెళ్లాల్సి వ స్తోంది. ఇలా చిన్న చిన్న పనుల కోసం లాతూర్, ఉస్మానాబాద్‌లకు వెళ్లాల్సి రావడంపై స్థానిక పారిశ్రామికవేత్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయా కార్యాలయాల్లో విధులు నిర్వహించేవారు షోలాపూర్ నుంచి వచ్చేవారిపట్ల వివక్ష చూపుతున్నారంటూ వాపోతున్నారు.

డీడీఆర్ డిప్యూటీ డెరైక్టర్ కార్యాలయం ఇక్కడ ఉండాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నామని అశ్వని హెర్బల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ బిపిన్ పటేల్ తెలిపారు. ఇదిలావుండగా కులధ్రువీకరణకు సంబందించిన ఉన్నతస్థాయి కార్యాలయం పుణేలో ఉంది. దీంతో స్థానిక విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయపరంగా రిజర్వేషన్ పదవులు పొందగోరేవారు కులధ్రువీకరణ పత్రాల కోసం పుణేకి వెళ్లాల్సి వస్తోంది.  శాసనసభ్యురాలు ప్రణతి శిందే చొరవతో సదరు కార్యాలయం ఇక్కడ ఏర్పాటైంది. అలాగే ఎస్‌బీఐ డివిజన్ కార్యాలయం సతారాలో ఉండేది. అందువల్ల ఇక్కడ పెద్ద మొత్తానికి సంబంధించిన రుణాల ఫైళ్లు సాతారాకు వెళ్లేవి. దీంతో సదరు వ్యాపారులు కూడా అక్కడికి వెళ్లక తప్పేదికాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement