2016 విద్యాసంవత్సరానికిగాను 5వ, 8వ తరగతుల విద్యార్థులకు ఉపకార వేతనాల పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యావిభాగం యోచిస్తోంది.
సాక్షి, ముంబై: 2016 విద్యాసంవత్సరానికిగాను 5వ, 8వ తరగతుల విద్యార్థులకు ఉపకార వేతనాల పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యావిభాగం యోచిస్తోంది. ఇప్పటిదాకా ఈ పరీక్షలను కేవలం 4వ, 7వ తరగతుల విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇకపై 5వ, 8వ తరగతుల విద్యార్థులకు కూడా నిర్వహించాలని రాష్ట్ర విద్యావిభాగం, మహరాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్‌ను కోరింది. కాగా రాష్ట్ర ఉన్నత విద్యా ఉపకారవేతనాల పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు.
ఇందులో 9 వేల నుంచి 10 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నారు. 4వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నెలకు రూ.100 చొప్పున 10 నెలల పాటు, ఏడవ తరగతిలో ప్రతిభ కనబర్చిన వారికి రూ.150 చొప్పున పది నెలలపాటు అందజేస్తున్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షలను పరిచయం చేసే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఉపకార వేతనాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇందుకోసం విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను స్వల్పంగా సవరించాల్సి ఉంటుందన్నారు.
ఎగ్జామినేషన్ కౌన్సిల్ డెరైక్టర్ దిలీప్ సహస్ర బుద్దే ఈ విషయమై మాట్లాడుతూ.. ‘ఈ ఉపకార వేతనాల పరీక్షలను విద్యార్థులకు వివిధ శ్లాబ్‌లలో నిర్వహించనున్నాం. గతంలో 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక తరగతులుగా పరిగణలోకి తీసుకునేవారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాధ్యమిక తరగతులుగా పరిగణనలోకి తీసుకునేవారు. అయితే (విద్యాహక్కు చట్టం)ఆర్‌టీఏ చట్టం ప్రకారం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నత ప్రాథమిక తరగతులుగా పరిగణిస్తున్నారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే.
ఇందుకు పాఠశాల విద్యావిభాగం అంగీకరిస్తేనే దీనిని అమలు చేస్తామ’న్నారు. అయితే ఈ విధానం విద్యార్థులకు లాభదాయకంగా ఉండడంతో విద్యావేత్తలు దీనిని సమర్థిస్తున్నారని, ఈ పరీక్షతో 5వ, 8వ తరగతిలో విద్యార్థులు కొంతైనా పరిజ్ఞానాన్ని సంపాదిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా ఈ ఏడాది మార్చిలో ముంబై రీజియన్‌లో 964 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షను 1,65,888 మంది విద్యార్థులు రాశారు. ఇందులో ఠాణే, రాయ్‌ఘడ్‌కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. కాగా ఇందులో 75,084 మంది విద్యార్థులు ప్రీ-సెకండరీ స్కూల్ స్కాలర్షిప్ పరీక్షలో పాల్గొన్నారు.