
వివాదాలు, క్రమశిక్షణ లేమి కారణంగా బ్రహాండమైన కెరీర్‌ను నాశనం చేసుకున్న మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి వార్తల్లో నిలిచాడు. నిన్న (అక్టోబర్ 7) ముంబైతో జరిగిన రంజీ వార్మప్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ (181) చేసిన అనంతరం షా తన మాజీ సహచరుడు ముషీర్ ఖాన్‌తో (Musheer Khan) గొడవ పడ్డాడు.
వాస్తవానికి ముషీర్ ఖానే మొదట షాను గెలికాడు. షాను ఔట్ చేసిన ఆనందంలో ముషీర్ వ్యంగ్యంగా థ్యాంక్యూ అని అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన షా.. ఒక్కసారిగా ముషీర్‌పైకి దూసుకొచ్చి, కాలర్ పట్టుకొని బ్యాట్ ఎత్తాడు. అంపైర్లు, సహచరులు వారించడంతో షా తగ్గి పెవిలియన్ వైపు వెళ్లబోయాడు.
పోయే క్రమంలో మరో ముంబై ఆటగాడు షమ్స్ ములానీ కూడా షాను ఏదో అన్నాడు. దీనికి కూడా షా ఘాటుగానే స్పందించాడు. ఈ గొడవల కారణంగా షా చేసిన సూపర్ సెంచరీ మరుగున పడింది. మిస్ బిహేవియర్ కారణంగా అందరూ షానే తప్పుబడుతున్నారు. ఈ వివాదాల కారణంగానే ఎక్కడో ఉండాల్సిన వాడు ఇంకా దేశవాలీ క్రికెట్‌లోనే మిగిలిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇంత వివాదం జరిగిన తర్వాత షా తన సోషల్‌మీడియా పోస్ట్ కారణంగా మరోసారి వార్తల్లోకెక్కడం విశేషం. మ్యాచ్ ముగిసిన అనంతరం షా తన ప్రేయసి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్‌తో (Akriti Agarwal) కలిసి రిలాక్స్ అవుతున్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు.
గత కొంతకాలంగా షా-అకృతి మధ్య ప్రేయాణం నడుస్తుందన్న టాక్ నడుస్తుంది. వీరిద్దరూ ఇటీవల గణేశ్ చతుర్థి వేడుకల్లో కలిసి కనిపించారు. షా కొంతకాలం క్రితం మోడల్ నిధి తపాడియాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అకృతితో డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్‌మీడియా టాక్.
ఎవరీ అకృతి..?
అకృతి అగర్వాల్ ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ముంబైలోని నిర్మలా కాలేజీ నుంచి BMS పూర్తి చేసిన అకృతి.. కోవిడ్ సమయంలో డాన్స్, లైఫ్‌స్టైల్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.
షా సెకెండ్ ఇన్నింగ్స్
18 ఏళ్ల వయసులో వెస్టిండీస్‌పై టెస్ట్ సెంచరీతో క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న షా.. ఆతర్వాత ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేమి, వివాదాల కారణంగా కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు.
ఇటీవలే క్రికెటర్‌గా జన్మనిచ్చిన ముంబై టీమ్ కూడా షాను వదిలేసింది. దీంతో అతను మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఈ జట్టు తరఫున కూడా వరుస సెంచరీలతో అదరగొడుతున్న షా.. టీమిండియాలో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
షా తన ఆఫ్ ద ఫీల్డ్ యాక్టివిటీస్‌ను పక్కన పెడితే క్రికెటర్‌గా మంచి భవిష్యత్తు ఉంటుంది. షా కంటే జూనియర్ అయిన శుభ్‌మన్ గిల్ ఇప్పుడు రెండు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్ అయిపోయాడు. కానీ, షా మాత్రం టీమిండియాలో చోటు కోసం పోరాడుతున్నాడు.
చదవండి: సంచలన వార్త.. దేశం కోసం భారీ డీల్‌ను వదులుకున్న కమిన్స్, హెడ్..?