
2 రోజుల క్రితం వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం ఫడ్నవీస్
గురువారం నుంచి సేవలు మొదలు
ఇప్పటికే సీఎస్‌ఎంటీ– జాల్నా, నాందేడ్‌ల మధ్య అనేక రైళ్లు
ప్రస్తుతం ముంబై నుంచి తెలంగాణకు కేవలం ఒకే ఒక్క రైలు సర్వీసు
కనీసం ఈ రైలునైనా నిజామాబాద్ వరకూ పొడిగిస్తే బాగుండేదంటున్న స్థానిక తెలంగాణ ప్రజలు
దాదర్: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్‌ఎంటీ)–జాల్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నాందేడ్ వరకు పొడిగించారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించినప్పటికీ గురువారం నుంచి ప్రత్యక్షంగా సర్వీసులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అదనంగా మరో కొత్త రైలు అందుబాటులోకి రావడంతో మరఠ్వాడ రీజియన్ ముఖ్యంగా పర్బణీ, పూర్ణ, నాందేడ్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ముంబై– నాందేడ్ మధ్య నడిచే అనేక రైళ్లున్నాయి. అలాగే నాందేడ్ మీదుగా వెళ్లే మరికొన్ని రైళ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వందేభారత్ రైలును నాందేడ్‌కు బదులుగా నిజామాబాద్ వరకు పొడిగిస్తే తమకు లాభదాయకంగా ఉండేదని ముంబైలోని నివసిస్తున్న తెలంగాణ ప్రజలు (Telangana Public) అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఆరునెలల క్రింద ప్రారంభం..
దాదాపు ఆరు నెలల కిందట ముంబై–జాల్నాల మధ్య ప్రారంభించిన 20705/20706 రైలుకు ప్రయాణికుల నుంచి ఆశించినంత మేర స్పందన రాలేదు. దీంతో నాందేడ్ (Nanded) వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (ashwini vaishnaw) రెండు నెలల కిందట మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ముంబై–జాల్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నాందేడ్ వరకు పొడిగిస్తామని ప్రకటించారు. ముంబై–నాందేడ్ మధ్య ఉన్న 610 కిలోమీటర్ల దూరాన్ని వందేభారత్ రైలు కేవలం 9 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.
18 చైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు ఇలా మొత్తం 20 బోగీలున్న ఈ రైలులో 1,440 మంది ప్రయాణించేందుకు వీలుంది. 20705 నంబరు రైలు ప్రతీ రోజు ఉదయం 5 గంటలకు నాందేడ్ స్టేషన్ నుంచి బయలుదేరి పూర్ణ, పర్బణీ, జాల్నా, ఔరంగాబాద్, మన్మాడ్, నాసిక్, కల్యాణ్, థానే, దాదర్ స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2.25 గంటలకు సీఎస్‌ఎంటీకి చేరుకుంటుంది. అలాగే 20706 నంబరు రైలు మధ్యాహ్నం 1.10 గంటలకు సీఎస్‌ఎంటీ నుంచి బయలుదేరి రాత్రి 10.50 నాందేడ్‌కు చేరుకుంటుంది. ఈ రైలువల్ల రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల విలువైన సమయం ఎంతో ఆదా కానుంది.
ఇప్పటికైనా స్పందించండి...
ఇదిలాఉండగా తెలంగాణలోని నిజామాబాద్, ఆర్మూర్, మెట్‌పల్లి, కొరుట్ల, జగిత్యాల, కరీంనగర్ (Karimnagar) ప్రాంత వాసులకు ముంబై నుంచి నేరుగా నడిచే సీఎస్‌ఎంటీ– లింగంపల్లి దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రమే ఆధారం. అజంతా ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఉన్నప్పటికీ ఇది మన్మాడ్ నుంచి బయలు దేరుతున్న కారణంగా వీరికి అంత సౌకర్యవంతంగా ఉండదు. దీంతో అందుబాటులో ఉన్న ఒకే ఒక్క దేవగిరి ఎక్స్‌ప్రెస్ సీజన్, అన్‌సీజన్ తేడా లేకుండా ఎప్పుడూ కిటకిటలాడుతుంటూంది.
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముంబై (Mumbai) పర్యటనకు వచ్చిన అనేక మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ముంబై– నిజామాబాద్ ఒక ప్రత్యేక రైలు కావాలని వేడుకుంటూ అనేక వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఆ లేఖలన్నీ చెత్త బుట్టల పాలయ్యాయి. ఇంతవరకు ఈ విజ్ఞప్తిని పట్టించుకున్నవారే లేరు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాతైనా తమ కల నెరవేతుందని ముంబైలో ఉంటున్న తెలంగాణ వాసులు భావించారు. కానీ అది నెరవేరలేదు.
చదవండి: సాధారణ చార్జీలతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణం!
ఈ నేపథ్యంలో తాజాగా ముంబై–జాల్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలునైనా నిజామాబాద్ వరకూ పొడిగించినా బాగుండేదని, దీని వల్ల రైల్వేకు ఆదాయం కూడా భారీగా సమకూరేదని స్థానిక తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఈ వందేభారత్ రైలును నిజామాబాద్ వరకూ పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నారు. నాందేడ్ వరకు విస్తరించారు. దీన్ని నిజామాబాద్ (Nizambad) వరకు పొడగిస్తే తెలంగాణ వాసులకు ఎంతో మేలు జరిగేది. రైల్వేకు కూడా భారీగా ఆదాయం వచ్చేది. కనీసం ఈ వందేభారత్ రైలునైనా నిజామాబాద్ వరకు పొడిగించే ప్రయత్నం చేయాలని ముంబైలో ఉంటున్న తెలంగాణ వాసులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాత్రి 12 దాకా మెట్రో సర్వీసులు
దాదర్: గణేశోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్ధం అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయించింది. వివిధ ప్రాంతాల నుంచి వినాయకుని దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశ్యంతో ఎమ్మెమ్మార్డీయే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సాధారణంగా మెట్రో రైళ్లు ప్రతీరోజు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. కానీ గణేశోత్సవాల సందర్భంగా ఎదురయ్యే రద్దీని దృష్టిలో ఉంచుకుని నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు అంటే సెప్టెంబరు ఆరో తేదీ వరకు 11 రోజులపాటు కొనసాగుతాయని మెట్రో–2ఏ, మెట్రో–7 మార్గాలలో అర్థరాత్రి 12 గంటలవరకూ సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా ట్రిప్పుల సంఖ్య కూడా పెంచినట్లు వెల్లడించారు.