రైలు చార్జీల పెంపు విపక్షాల నిరసన


సాక్షి, న్యూఢిల్లీ:రైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ విపక్షాలు శనివారం నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. విద్యుత్ కోతలు, నీటి సరఫరా సమస్యలకు  నిరసనగా గతకొద్ది రోజులుగా నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం జనక్‌పురిలో రైలు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేయడమే కాకుండా బారికేడ్లు ఛేదించుకుని ముందుకెళ్లేందుకు యత్ని ంచిన కాంగ్రెస్ కార్యకర్తలను నియంత్రించడం కోసం పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ప్రయోగించారు.

 

 ఈ సందర్భంగా డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ మాట్లాడుతూ ధరలను నియంత్రిస్తామంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. బడ్జెట్ సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయని, ఇంతలోనే రైలు చార్జీలను ఎలా పెంచుతారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రజలు మంచి రోజుల గురించి మాట్లాడేవారని, అయితే ఇప్పుడు చేదు మందుల గురించి మాట్లాడుతున్నారని ఆయన  విమర్శించారు.ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తానన్నారని, అయితే అలా చేసే సూచనలు కనిపించడం లేదని లవ్లీ అన్నారు. మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలనే తీసుకున్నట్లయితే ప్రజలు శిక్షిస్తారని ఆయన ెహ చ్చరించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమవుతోందన్నారు.

 

 ప్రజలకు భారంగా మారిన రైలు చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని లవ్లీ డిమాండ్ చేశారు. సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం పెంచడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్నారు. చార్జీల పెంపును ప్రభుత్వం ఉపసంహరించనట్లయితే రైల్‌రోకో కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. యూపీఏ సర్కారు బడ్జెట్ సమావేశాలకు ముందు రైలు చార్జీలను పెంచినపుడు దానిని విమర్శిస్తూ ట్వీట్ చేసిన నరేంద్ర మోడీ... ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందు రైలు చార్జీలను ఎలా పెంచారని అజయ్ మాకెన్ ప్రశ్నించారు. ఇదిలాఉంచితే రైలు చార్జీల  పెంపును నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు రైల్ భవన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.

 

 సీపీఎం ఢిల్లీ విభాగం కూడా రైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రైల్ భవన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది.  ఎన్నికలకు  ముందు ధరల  పెంపును విమర్శించి, ధరలు నియంత్రిస్తామని చెప్పడంద్వారా ప్రజల మద్దతు చూరగొని ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని, అయితే ఇప్పుడు ఎన్‌డీయే ప్రభుత్వం కూడా ధరలను పెంచుతోందని సీపీఎం ఢిల్లీ శాఖ సభ్యుడు అనురాగ్‌శర్మ ఆరోపించారు. కాగా సీపీఎం, ఎన్‌ఎస్‌యూఐ నిరసనప్రదర్శనల కారణంగా శనివారం  ఉదయం మధ్య ఢిల్లీలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top