అక్రమంగా సేకరించిన పాము విషాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని మంగళవారం కర్ణాటకలోని అటవీశాఖ సిబ్బంది అరెస్ట్ చేశారు.
మైసూరు (కర్ణాటక): అక్రమంగా సేకరించిన పాము విషాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని మంగళవారం కర్ణాటకలోని అటవీశాఖ సిబ్బంది అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి రూ.50లక్షల విలువైన లీటర్ తాచుపాము విషం స్వాధీనం చేసుకున్నారు. సోమవారపేట తాలూకా యడియూరు గ్రామానికి చెందిన రాజు గతంలో టింబర్ యార్డులో పని చేస్తూ ప్రమాదానికి గురై కాలు పోగొట్టుకున్నాడు.
దీంతో చేయడానికి పని లభించకపోవడంతో సోమవారపేట తాలూకాలోని అటవీప్రాంతంలోని గిరిజనుల సాయంతో తాచుపాముల విషాన్ని సేకరించడం ప్రారంభించాడు. అలా సేకరించిన విషాన్ని మంగళవారం మైసూరు గ్రామాంతర బస్టాండ్‌లో విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా అటవీశాఖ సిబ్బంది అరెస్ట్ చేసి లీటర్ తాచుపాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.