రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్తటీమ్‌

Niranjan Patnaik As Orissa PCC Chief - Sakshi

పీసీసీ చీఫ్‌గా నిరంజన్‌ పట్నాయక్‌ 

భువనేశ్వర్‌ : రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీకి కొత్త కార్యవర్గం నియామకం జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా నిరంజన్‌ పట్నాయక్‌ నియమితులయ్యారు. ప్రసాద్‌ హరిచందన్‌ స్థానంలో ఆయన నియామకం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నొబొ కిషోర్‌ దాస్, చిరంజీవ్‌ బిశ్వాల్, పార్లమెంట్‌ మాజీ సభ్యుడు ప్రదీప్‌ మఝి అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర శాఖ వ్యవహారాల ఇన్‌చార్జి జితేంద్ర సింగ్‌లు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయిన తర్వాత ఈ నియామకం జరిగింది. ఎమ్మెల్యేలు నొబొ కిషోర్‌ దాస్, చిరంజీవ్‌ బిశ్వాల్, పార్లమెంట్‌ మాజీ సభ్యుడు ప్రదీప్‌ మఝి రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

పార్టీని పటిష్ట పరుస్తా
రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మనోగతాలకు పార్టీ హై కమాండ్‌ రాహుల్‌ గాంధీ పరిగణనలోకి తీసుకుని తనను పీసీసీ అధ్యక్షుడిగా  నియమించడంపట్ల కొత్త అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ హర్షం వ్యక్తం చేశారు. పార్టీని రాష్ట్రంలో పటిష్టపరచడమే తన  ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగం, రైతులు, దళితులు, నీటి ఎద్దడి, మహా నది జలాల పంపిణీ వివాదం వంటిక కీలకమైన సమస్యల పట్ల పార్టీ దృష్టి సారిస్తుందని వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉభయ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన కార్యాచరణగా పేర్కొన్నారు. 

ఇతర సభ్యులు వీరే.. మాజీ పార్లమెంట్‌ సభ్యుడు భక్త చరణ్‌ దాస్‌ను  ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమించారు.పార్టీ రాష్ట్ర శాఖ వ్యవహారాల ఇన్‌చార్జి జితేంద్ర సింగ్‌ను సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జగన్నాథ్‌ పట్నాయక్‌ను  సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నియమించారు. కోర్‌ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు  జయదేవ్‌ జెనా, ఈ కమిటీ కన్వీనర్‌గా రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్, క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్, సీనియర్‌ నాయకుడు శరత్‌ రౌత్‌ కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బర్‌గడ్‌ జిల్లా ఉప ఎన్నికలో పార్టీ వైఫల్యాల దృష్ట్యా రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కొత్త కార్యవర్గం నియామకం జరుగుతుందని మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌ హరిచందన్‌ ముందస్తు సంకేతాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజా నియామకాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top