మరుగు ఎక్కడా? | Nil 64.59 per cent of the households in the state of toilets | Sakshi
Sakshi News home page

మరుగు ఎక్కడా?

Jun 30 2014 3:06 AM | Updated on Sep 2 2017 9:34 AM

మరుగు ఎక్కడా?

మరుగు ఎక్కడా?

ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో బహిర్బూమికి వెళ్లిన అక్కా చెల్లి విగత జీవులై తేలారు. వారిద్దరే కాదు ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న హత్యాచారాల్లో...

  • రాష్ట్రంలో 64.59 శాతం ఇళ్లకు టాయిలెట్లు నిల్
  •  సరైన నీటి సరఫరా లేకపోవడమే  ప్రధాన కారణం
  •  క్రూర జంతువులు, ‘మృగాల’ బారిన పడుతున్న మహిళలు
  •  హత్యాచారాలు, కిడ్నాపులూ ఈ సమయంలోనే ఎక్కువ
  •  వాస్తవాలు బహిర్గతం చేసిన ఎన్‌బీఏ సర్వే
  • ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో బహిర్బూమికి వెళ్లిన అక్కా చెల్లి విగత జీవులై తేలారు. వారిద్దరే కాదు ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న హత్యాచారాల్లో చాలా మంది మహిళలు బహిర్భూమికి వెళ్లినప్పుడు ఎన్నో ఘోరాలు సంభవించాయని అని ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. ఇళ్లలో వ్యక్తిగత శౌచాలయాలు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మహిళలు బహిర్భూమి కోసం వెళ్లి ‘మృగాల’ బారిన పడుతున్నారు. సమాచార సాంకేతిక రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కర్ణాటక ఇందుకు మినహాయింపు కాదు. మార్చి నుంచి ఏప్రిల్ వరకూ కర్ణాటకలో  నిర్మల్ భారత్ అభియాన్ జరిపిన సర్వేను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
     
    సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని 64.59 శాతం ఇళ్లకు వ్యక్తిగత శౌచాలయాలు (మరుగుదొడ్లు) లేవు. దీంతో వారు చాలా మంది బయలు ప్రదేశాలను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ ఉదాసీనతతో పాటు ప్రజల్లో ఉన్న కొన్ని మూఢనమ్మకాలు కూడా కారణమని నిర్మల్ భారత్ అభియాన్ (ఎన్‌బీఏ) సర్వేలో తేలింది. రాష్ట్రంలో మొత్తం 1.31 కోట్ల ఇళ్లు ఉండగా అందులో కేవలం 35.41 శాతం ఇళ్లలో మాత్రమే వ్యక్తిగత శౌచాలయాలు ఉన్నాయి.

    దీంతో వ్యక్తిగత శౌచాలయాల విషయంలో జాతీయ సగటు (40.30 శాతం) కంటే కర్ణాటక పరిస్థితి ఘోరంగా ఉన్నట్లు తేలింది. దేశంలోని అన్ని కుటుంబాలకు 2022 లోపు వ్యక్తిగత శౌచాలయాలు ఏర్పాటు లక్ష్యంగా ఎన్‌బీఏ పథకం రూపొందించబడింది. ఈ పథకం కింద వ్యక్తిగత శౌచాలయాలు నిర్మించుకోదలిచిన వారికి ఎన్‌బీఏ నుంచి రూ.4,700 నగదు అందుతుంది.

    అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామి పథకం కింద మరో రూ.5,400 అదనంగా చేర్చి మొత్తం రూ.10,100  అందిస్తోంది. అయినా కూడా రాష్ట్రంలో అనుకున్నంత మేర వ్యక్తిగత శౌచాలయాలు నిర్మాణం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది.  సరైన నీటి సరఫరా విధానం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తేలింది.  
     
    మరోవైపు వ్యక్తిగత శౌచాలయాలను కుటుంబ సభ్యులందరూ ఉపయోగించడం లేదు. కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వ్యక్తిగత శౌచాలయాలను ఉపయోగిస్తుండగా మిగిలిన వారు బయలు ప్రదేశాలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వ్యక్తిగత శౌచాలయాలు ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్యలో 35 శాతం వరకూ ఉన్నట్లు ఎన్‌బీఏ పరిశీలనలో తేలింది. ఈ విధంగా ‘ఆ పని’ కోసం బయటకు వెళుతుండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

    ఈ పరిస్థితి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటోంది. మరోవైపు బయలు ప్రదేశాలకు వెళ్లిన సమయంలో అటవీ ప్రాంత సమీప గ్రామస్తులు చిరుతలు, ఏనుగుల వంటి వన్యమృగాలు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బహిర్భుమికి వెళ్లిన మహిళలపై హత్యాచారాలు, కిడ్నాపులు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయని సర్వేలో తేలింది. మరోవైపు ఇదే సర్వేలో రాష్ట్రంలోని మొత్తం 72.44 అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ, 4.59 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో శౌచాలయాలు లేనట్లు తెలిసింది. అదే విధంగా 10.87 శాతం పాఠశాలలకు నీటి సరఫరా లేదని సర్వే తేల్చింది.

    ఈ విషయమై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇళ్లలో శౌచాలయాలు ఉండటం ఇంటి పవిత్రత దెబ్బతింటుందని భావిస్తున్నారు. అందువల్లే వ్యక్తిగత శౌచాలయాల నిర్మాణం అనుకున్నంతమేర వేగంగా జరగడం లేదని చెబుతున్నారు. అయితే ‘ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం తాగునీటి సరఫరానే సరిగా ఉండదు. అటువంటి సమయంలో ఇళ్లలోనే శౌచాలయాలు నిర్మించుకోవడం ఎంత వరకూ ఉపయోగకరం.’ అనేది ప్రజల వాదనగా కన్పిస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement