సగం తెరుచుకున్న నగరం!

Lockdown Rules Relaxed in Odisha Some Districts - Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన రాష్ట్రప్రభుత్వం

బరంపురంలో తెరుచుకున్న వ్యాపార సముదాయాలు

ఊపిరి పీల్చుకున్న ప్రజలు

ఒడిశా ,బరంపురం: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కబలిస్తూ.. మరణ మృదంగం మోగించిన నేపథ్యంలో ఈ వైరస్‌ను తరిమి కొట్టేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించడంతో బరంపురం నగరంలో సగం వరకు దుకాణాలు తెరుచుకున్నాయి. చిన్న చిన్న వ్యాపార సముదాయాలు, మోటారు గ్యారేజీలు, హార్డ్‌వేర్, సిమెంట్‌ దుకాణాలు, బుక్‌ స్టోర్లు వంటివి తెరుచుకున్నాయి. జిల్లా కలెక్టర్‌ ఆదేశించిన ప్రకారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ దుకాణాలు తెరుచుకొని అనంతరం మూసి వేశారు. చిన్న చిన్న కర్మాగారాల్లో వస్తువుల తయారీ ప్రారంభమయ్యింది. దీంతో గత 4 వారాల నుంచి లాక్‌డౌన్, షట్‌డౌన్‌ కారణంగా జిల్లాలో పూర్తిగా మూతపడ్డ వ్యాపార ఉత్పత్తుల తిరిగి ప్రపారంభం కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

జోరుగా థర్మల్‌ స్క్రీనింగ్‌
నగరంలో కొంత వెసులుబాటుతో లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కరోనా థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు జోరుగా కొనసాగాయి. గోపాల్‌రావు గురడా, జయంతి పేటా, కాళికా అమ్మవారి వీధి, డైమండ్‌ ట్యాంక్‌ రోడ్, పాకలవారి వీధి, పొవల్‌ స్టీట్, బిరక వీధి, పెట్ట వీధి, శనివారం పేట, చిన్నబజార్, పోవల్‌ స్ట్రీట్, బుత్త సహీ, మాధవనగర్, కొడ్రా వీధి, మల్లసాని పేట, జమాల్‌ వీధి, ఉత్కళ్‌ సినిమా రోడ్, కొమ్మలబాల వీధి, మేదర వీధితో పాటు పలు కాలనీలు, అపార్ట్‌మెంట్‌ లలో ఆశ, అంగన్‌వాడీ మహిళల సహకారంతో తహసీల్దార్, పాలన అధికారులు, వైద్య, ఆరోగ్యశాఖ వైద్యులు ఇంటింటికీ వెళ్లి, ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారా.

కానరాని భౌతిక దూరం!
లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా.. నగరంలో ఎక్కడికక్కడే భౌతికదూరం నిబంధనలు అతిక్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న నేపథ్యంలో సాక్షాతు గల ఎంకేసీజీ మెడికల్‌ కళాశాలకు చికిత్సకు వచ్చిన బాధితులు భౌతిక దూరం పాటించకుండా మందుల కోసం ఎగబడ్డారు. కొమ్మపల్లి చేపల మార్కెట్, గిరి మార్కెట్‌ లలో ప్రజలు చేపలు కొనేందుకు ఎగబడ్డారు.

బీజేపీ సాయం..
మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పాత బరంపురంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్ను చరణ్‌పతి, యువమోర్చా కార్యదర్శి రాజేంద్రకుమార్‌ సాహు, కైలాస్‌ సడంగి, మదన్‌మోహన్‌ పాత్రో తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top