
ఎదురుచూస్తున్న పిలుపు రానేవచ్చింది..
ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పిలుపు రానేవచ్చింది. ఈనెల 22న ఉదయం ఏడు గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంతో జరగబోయే సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని పార్టీ అధినేత్రి..
- 22న ఎమ్మెల్యేలతో జయలలిత సమావేశం
- తప్పక హాజరుకావాలని ఆదేశించిన ఏఐడీఎంకే అధినేత్రి
చెన్నై: ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పిలుపు రానేవచ్చింది. ఈనెల 22న ఉదయం ఏడు గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంతో జరగబోయే సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని పార్టీ అధినేత్రి జయలలిత శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఆమె కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అయితే సమావేశం ప్రధాన అజెండా ఏమిటనేదానిపై ప్రకటనలో ప్రస్తావించలేదు.
దీంతో జయలలితను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. కర్ణాటక హైకోర్టు తీర్పుతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసునుంచి నిర్దోషిగా బయటపడటంతో సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు జయకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. అయితే హైకోర్టు తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేయనున్నట్లు వార్తలు రావడం, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య కూడా ఆ వార్తలను నిర్ధారించడంతో సీఎం పదవి చేపట్టేవిషయంలో జయలలిత పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. వచ్చే శుక్రవారం (22న) జరిగే సమావేశం తరువాత జయ పదవీస్వీకారానికి సంబంధించిన అన్ని విషయాలపై స్పష్టతవచ్చే అవకాశం ఉంది.