కావేరి వరదలో చిక్కుకున్న నలుగురు రాత్రంతా నరకయాతన అనుభవించారు. జాతీయ విపత్తుల నివారణ బృందం రంగంలోకి దిగడంతో సురక్షితంగా బయటపడ్డారు.
తీర గ్రామాలను ముంచెత్తుతున్న వరదనీరు
Published Mon, Aug 5 2013 11:25 PM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
కావేరి వరదలో చిక్కుకున్న నలుగురు రాత్రంతా నరకయాతన అనుభవించారు. జాతీయ విపత్తుల నివారణ బృందం రంగంలోకి దిగడంతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లి విరిసింది. మరోవైపు కావేరి ఏ మాత్రమూ శాంతించడం లేదు. ఎప్పుడేం జరుగుతుందోనని తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, చెన్నై: కర్ణాటకలోని వర్షాలతో కావేరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం నాటి పరిస్థితే సోమవారమూ కొనసాగింది. మెట్టూరు డ్యాం నిండిపోవడంతో ఉబరి నీళ్లను బయటకు పంపుతున్నారు. డ్యామ్‌లోకి 1.5 లక్షల ఘనపుటడుగుల నీళ్లు వస్తున్నాయి. అలాగే 1.2 లక్షల ఘనపుటడుగుల నీటిని బయటకు పంపుతున్నారు. మెట్టూరు నుంచి ఉబరి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో డెల్టా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర గ్రామాల్లో తిష్ట వేసి పరిస్థితిని సమీక్షిస్తోంది. చిన్నపాటి వరద ముప్పు హెచ్చరిక జారీ అయినా ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సర్వం సిద్ధం చేసింది. కొన్ని గ్రామాలను వరద ముంచెత్తడంతో అక్కడి వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలించింది.
కొట్టుకెళ్లిన నలుగురు: ధర్మపురి జిల్లా చెల్లంకోట్టైకు చెందిన మాధయ్యన్(50) బంధువు మరణించారు. ఆయన కర్మకాండ చేస్తూ వరద నీటిలో మాధయ్యన్ ఆదివారం కొట్టుకెళ్లారు. ఆయన్ను రక్షించేందుకు ఎనిమిది మంది రెండు బుట్ట పడవల్లో వెళ్లారు. వరద పెరగడంతో ఆ పడవలు బోల్తా కొట్టాయి. దీంతో అందులో ఉన్న వాళ్లు కావేరిలో పడ్డారు. ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అయితే మాధయ్యన్, జాలర్లు రామకృష్ణన్, ముత్తు, సహదేవన్ వరదలో చిక్కుకుపోయూరు.
ఫలించిన కృషి: హొగ్నెకల్ వద్ద కావేరిలో చిక్కుకున్న వీరిని రక్షించేందుకు అధికారులు శ్రమించాల్సి వచ్చింది. ఆదివారం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రాత్రంతా చెట్టు మీదే ఆ నలుగురు నరకయాతన అనుభవించారు. నీటి ఉద్ధృతి కారణంగా తమ వాళ్లు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదోనన్న ఆందోళన బాధిత కుటుంబాల్లో నెలకొంది. ధర్మపురి కలెక్టర్ వివేకానంద, ఎస్పీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిబ్బంది ఆదివారం రాత్రంతా అక్కడే పడిగాపులు కాశారు. హ్యాండ్ మైక్ ద్వారా బాధితులకు ధైర్యం చెబుతూ వచ్చారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జాతీయ విపత్తుల నివారణ బృందం సభ్యులు హొగ్నెకల్‌కు చేరుకున్నారు. తాళ్ల సాయంతో నీటిలోకి దిగేందుకు ఆ బృందం పలుమార్లు ప్రయత్నించింది.
ఓ దశలో ఇద్దరు సభ్యులు నీటి ఉద్ధృతికి కొట్టుకెళ్లారు. అయితే ఆ ఇద్దరూ ఈతగాళ్లు కావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. బెంగళూరు, కోయంబత్తూరు నుంచి రెండు హెలికాప్టర్లను సోమవారం రంగంలోకి దించారు. వీటి ద్వారా ఒక్కొక్కరినీ అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. వీరికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం హొగ్నెకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కావేరి ఉగ్ర తాండవాన్ని ఎదుర్కొని వీరోచితంగా పోరాడి నలుగుర్ని రక్షించిన ఆ బృంద సభ్యులు, హెలికాప్టర్ పెలైట్లను స్థానికులు అభినందించారు. వారి కరచలనం కోసం పోటీపడ్డారు.
Advertisement
Advertisement