ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ చిక్కుల్లో పడ్డారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ చిక్కుల్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో జితేంద్ర సింగ్ తోమర్ ఎన్నికను సవాలుచేస్తూ బీజేపీ నేత నందర్ కిషోర్ గర్గ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆయనకు నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరింది. నామినేషన్ ఫారంతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో తోమర్ నకిలీ విద్యార్హతలను పేర్కొన్నారని గర్గ్ పిటిషన్‌లో ఆరోపించారు. నకిలీ విద్యార్హతలను అఫిడవిట్‌లో పేర్కొన్నందున తోమర్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
లా డిగ్రీ గురించి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తోమర్ తప్పుడు సమాచారం ఇచ్చారని గర్గ్ ఆరోపించారు. లా గ్రాడ్యుయేట్‌గా, అడ్వొకేట్‌గా చెప్పుకుని తోమర్ ఓటర్లను ప్రభావితం చేశారని గర్గ్ తరపు న్యాయవాదులు లలీత్‌కుమార్, దీపక్ ఓరా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల పత్రాలను మే 17లోగా సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు తోమర్‌ను ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ మే 18న జరుగనుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తోమర్ సమర్పించిన డాక్యుమెంట్లను భద్రపరచాలని సంబంధిత అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం తోమర్ మంత్రిగా ఉన్నందున ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల డాక్యుమెంట్లను ధ్వంసం చేయవచ్చన్న భయాన్ని గర్గ్ వెలిబుచ్చడంతో కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జితేంద్ర సింగ్ తోమర్ త్రినగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలలో ఆయన నంద్‌కిషోర్ గర్గ్‌ని ఓడించారు. తోమర్ లా డిగ్రీని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఫిబ్రవరిలోనే దాఖలైన మరో పిటిషన్‌పై న్యాయస్థానం ఆదేశాన్నిచ్చింది. నకిలీ డిగ్రీ ఆధారంగా తోమర్ బీహార్‌లోని బిశ్వంత్‌సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగ ల్ స్టడీ కాలేజ్‌లో అడ్మిషన్‌పొందారని ఈ పిటిషన్ ఆరోపించింది. ఎల్‌ఎల్‌బి కోర్సు అడ్మిషన్ సమయంలో తోమర్ సమర్పించిన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, మార్కుషీటు, రోల్ నంబరు పూర్తిగా నకిలీవని ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్‌లోని రామ్ మనోహర్‌లోహియా అవధ్ యూనివర్సిటీ సమాధానం ఇవ్వడంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ ఇటీవల తోమర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది.