ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాలవీయనగర్ మాజీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీకి ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించింది.
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాలవీయనగర్ మాజీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీకి ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించింది. మాలవీయనగర్‌లో వివాదాస్పద అర్థరాత్రి తనిఖీల కేసుకు సంబంధించి సోమ్‌నాథ్‌భారతీకి ఈ ఊరట లభించింది. 12 మంది ఆఫ్రికన్ మహిళల పట్ల సోమ్‌నాథ్ భారతీ జాత్యాహంకారంతో ప్రవర్తించారని, అనైతిక చర్యలకు పాల్పడ్డారని , భారతీని దోషిగా గుర్తిస్తూ జాతీయ మానవహక్కుల సంఘం ఇచ్చిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది. ఎన్‌హెచ్‌ఆర్సీ ఉత్తర్వులను భారతీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.
రాజకీయోద్దేశాలతో ఢిల్లీ పోలీసులు తనపై ఆరోపణలకు మసిపూసి మారేడుకాయ చేవారని ఆరోపించారు. న్యాయమూర్తులు ఎస్, మురళీధర్, మన్మోహన్ సింగ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఎన్‌హెచ్‌ఆర్సీ సెప్టెంబర్ 29న జారీ చేసిన ఉత్తర్వును పక్కనబెట్టింది. భారతీ సమర్పించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారంపై తాజా విచారణ చేపట్టాలని ఎన్‌హెచ్‌ఆర్సీని ఆదేశించింది. జనవరిలో జరుగనున్న ఈ కేసు తదుపరి విచారణకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం సోమ్‌నాథ్‌భారతీని ఆదేశించింది.
నేను చెప్పిందే రుజువైంది
న్యూఢిల్లీ: తాను గతంలో చెప్పిందే రుజువైందని మాజీ న్యాయశాఖమంత్రి సోమనాథ్ భర్తీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని తెలిసి పోలీసులతో కలిసి అతను చేసిన దాడి ఘటనపై భర్తీ వాదనలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు జాతీయ హక్కుల కమిషన్‌ను ఆదేశించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో చెప్పిందే రుజువైందని అన్నారు. ఆ రోజు తన వాదనలను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. తాను తనకు పరువు నష్టం కలిగిందని, 100 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని హైకోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. పిటిషనర్ వాదనను కూడా పరిశీలించిన తర్వతే కేసును దర్యాప్తు చేయాలని కోర్టు ఎన్‌హెచ్‌ఆర్సీని ఆదేశించినట్లు చెప్పారు.