డీపీసీసీ అధ్యక్షుడిగా అజయ్ మాకెన్! | DPCC President Ajay Maken | Sakshi
Sakshi News home page

డీపీసీసీ అధ్యక్షుడిగా అజయ్ మాకెన్!

Feb 28 2015 10:28 PM | Updated on Mar 18 2019 7:55 PM

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షునిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్‌ను నియమించనున్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షునిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్‌ను నియమించనున్నారు. మాకెన్ నియామకానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదం తెలిపారని సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటనను త్వరలోనే జారీచేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పీసీ చాకోతో పాటు జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ తమ పదవులకు రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ రాజీనామాలను ఆమోదించలేదు.
 
 షీలా వ్యాఖ్యలతో నొచ్చుకున్న అజయ్
 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మాకెన్‌ను ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఎన్నికల కోసం ఆయన గట్టిగా ప్రచారం చేసినప్పటికీ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. మాకెన్ కూడా ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా డిపాజిట్ కూడా కోల్పోయారు. అయితే ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత మాజీ సీఎం షీలాదీక్షిత్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు మాకెన్‌ను బాధించాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా ఈ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఓటమిపై ఎవరూ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని పార్టీ నేతలను ఆమె ఆదేశించారు.
 
 పార్టీకి ప్రాణం పోయగలిగేది మాకెన్ మాత్రమే
 ఢిల్లీలో పూర్తిగా చతికిలపడ్డ కాంగ్రెస్‌లో తిరిగి ప్రాణం పోయగల సత్తా అజయ్ మాకెన్‌కు ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ప్రజాదరణ కలిగిన నేతలు కరువయ్యారు. షీలాదీక్షిత్ శకం ముగిసిన తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ నేత మాకెన్ మాత్రమే కావడంతో పార్టీ పగ్గాలను ఆయనకు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది. అంతేకాక అర్వింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కోగల సత్తా మాకెన్‌కే ఉందని కాంగ్రెస్ అంచనా. కాంగ్రెస్ ఓటుబ్యాంకు పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకి చేరడంతో పునాదులు లేని స్థితికి చేరిన కాంగ్రెస్‌కు మళ్లీ ప్రాణం పోయడానికి అజయ్ మాకెన్ వంటి అనుభవ జ్ఞుడైన నేత అవసరమని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement