గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఆశ్రయం తనకు అక్కరలేదని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు.
సాక్షి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఆశ్రయం తనకు అక్కరలేదని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయిన పక్షంలో తాను కర్ణాటకలో ఉండనని దేవెగౌడ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో చిక్కబళ్లాపుర వచ్చిన నరేంద్రమోడీ బహిరంగ వేదికపై ఆదివారం మాట్లాడుతూ... కర్ణాటకలో ఉండటం దేవెగౌడకు ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా గుజరాత్ రావొచ్చునని, తాను కన్నకొడుకులా ఆశ్రయమిస్తానన్నారు.
మోడీ వ్యాఖ్యలపై దేవెగౌడ ప్రతిస్పందిస్తూ ‘తనకు మోడీ ఆశ్రయం అక్కరలేదు. విదేశాలకు వెళ్లగలిగే శక్తి నాకు ఉంది. అయినా నాకు ఆశ్రయం ఇవ్వడానికి ఆయన ఎవరు? భార్యకు ఆశ్రయం ఇవ్వలేని వ్యక్తి నాకు ఆశ్రయం ఇస్తాడని నేను అనుకోను. సొంత బలంతో మోడీ ప్రధాని అయితే రాష్ట్రాన్ని వదిలివెళ్తాను అని పేర్కొన్నది నిజం. ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉన్నా’ అని దేవెగౌడ అన్నారు. ఎన్నికల తర్వాత థర్డ్‌ఫ్రంట్ గురించి ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు.