బె‘ధర’గొడుతున్నఇంధనం

Diesel Price Hikes More Than Petrol Prices In Odisha - Sakshi

పెట్రోల్‌ కంటే డీజిల్‌ రేటు అధికం

కేంద్రం వ్యవహారమే కారణం

ఆర్థిక శాఖ మంత్రి శశిభూషణ్‌ బెహరా

భువనేశ్వర్‌: ఇంధన ధరల పెరుగుదల సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. రాష్ట్ర రాజధాని నగరంలో డీజిల్‌ ధర పెట్రోల్‌ లీటర్‌ ధర కంటే ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చవిచూడనట్లు సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. పెట్రోల్, డీజిల్‌ ఇంధన ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలతో ఇటువంటి కనీ వినీ ఎరుగని పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శశి భూషణ బెహరా వ్యాఖ్యానించారు. సాధారణంగా డీజిల్, పెట్రోల్‌ ధరల మధ్య దాదాపు 10 శాతంవ్యత్యాసం కొనసాగేది. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి భిన్నంగా తయారైంది. డీజిల్‌ మూల ధర పెట్రోల్‌ ధర కంటే అధికంగా కొనసాగుతున్నట్లు సమాచారం.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి ఇంధనం ధరలు తగ్గుముఖం పడుతుండగా రాష్ట్రంలో వీటి ధరలు తరచూ పెరగడం కేంద్ర ప్రభుత్వ వ్యవహారంపట్ల సందేహాన్ని ప్రేరేపిస్తోందని అధికార వర్గాలు ఆరోపించాయి. నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.57 కాగా డీజిల్‌ లీటరు ధర రూ. 80.69గా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలతో ఈ విచిత్ర పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శశి భూషణ బెహరా ఆరోపించారు. తైల ఉత్పాదన కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం పట్టు కోల్పోయింది. లేకుంటే తైల కంపెనీలతో కేం ద్ర ప్రభుత్వం లాలూచీకి పాల్పడిన పరిస్థితుల్లో ఇటువంటి దయనీయ పరిస్థితులు తాండవిస్తాయని మంత్రి శశి భూషణ బెహరా పేర్కొన్నారు. డీజిల్‌ ధర పెరగడంతో అన్ని రకాల సామగ్రి ధరలు చుక్కల్ని తాకుతున్నాయి.

 

పార్టీ నిధుల కోసం తపన
తైల ధరల్ని తరచూ పెంచుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిధుల్ని మూట గట్టుకునే ప్రయత్నం కూడా ఒక కారణం కావచ్చని ఆర్థిక శాఖ మంత్రి శశి భూషణ బెహరా ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇటువంటి విచారకర చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

పన్ను భారం తగ్గించడం లేదు
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలపట్ల తరచూ కంట తడి పెడుతున్న అధికార పక్షం బిజూ జనతా దళ్‌ రాష్ట్రంలో ఈ ఉత్పాదనలపై వాల్యూ యాడెడ్‌ టాక్సు తగ్గించేందుకు వెనుకంజ వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు దేశంలో పలు రాష్ట్రాలు ఇటీవల పెట్రోల్, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ భారం కుదించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఈ నేపథ్యంలో చీమ కుట్టినట్లు అయినా స్పందించక పోవడం విచారకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి పృథ్వీ రాజ్‌ హరిచందన్‌ ఎదురు దాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50, తైల కంపెనీలు రూ.1 చొప్పున లీటరు పెట్రోల్, డీజిల్‌ ధరలపై పన్ను భారం తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 2.50 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించినట్లు ఆయన వివరించారు.

ఈ ఉత్పాదనలపై రాష్ట్ర ప్రభుత్వం 26 శాతం వ్యాట్‌ వసూలు చేస్తుండగా దేశంలో దాదాపు 13, 14 రాష్ట్రాలు ఇంతకంటే అధికంగా వ్యాట్‌ వడ్డిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శశి భూషణ బెహరా విశ్లేషించారు. దేశంలో పలు చోట్ల పెట్రోల్, డీజిల్‌పై పన్ను భారంలో వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా డీజిల్‌ కంటే పెట్రోల్‌పై పన్ను రేటు అధికంగా ఉంటుంది. రాష్ట్రంలో మాత్రం సమగ్రంగా 26 శాతం వ్యాట్‌ వడ్డిస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top