
ధర్మవరంలో గ్యాంగ్ రేప్.. హత్య !
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై హతమార్చినట్లు తెలుస్తోంది.
- గుర్తు తెలియని మహిళపై కిరాతకం
- రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
ధర్మవరం : పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై హతమార్చినట్లు తెలుస్తోంది. గురువారం ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు కథనం మేరకు.. రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్ల సమీపంలోంచి దుర్వాసన వస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడి పాడు పడిన ఓ ఇంటిలో వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె వయసు సుమారు 40 ఏళ్లు ఉండవచ్చని అంచనా వేశారు. దాదాపు ఐదు రోజుల క్రితం ఈ దారుణం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసి ఆపై హతమార్చి ఉంటారని తెలుస్తోంది. మృతురాలు స్థానికురాలు కాదని, కేసును దర్యాప్తు చేస్తున్నామని పట్టణ పోలీసులు తెలిపారు.