
దసరాకు వెళ్లొస్తుంటే.. గ్యాంగ్ రేప్, హత్య
దసరా సంబరాలు చూసేందుకు వెళ్లి, అన్నతో కలిసి తిరిగొస్తున్న 14 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు ఢిల్లీ శివార్లలో సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హతమార్చారు.
దసరా సంబరాలు చూసేందుకు వెళ్లి, అన్నతో కలిసి తిరిగొస్తున్న 14 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు ఢిల్లీ శివార్లలో సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హతమార్చారు. ఈ దారుణ ఘటన ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని కుండ్లి ప్రాంతంలో జరిగింది. నిందితులు ఐదుగురినీ అరెస్టు చేశామని, వాళ్లపై కుండ్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగిన దసరా సంబరాలు చూసి ఆమె తిరిగి సైకిల్ మీద వస్తోందని, అదే సమయంలో బాగా తాగేసి ఆటోలో వెళ్తున్న నిందితులు ఆమె కుటుంబ సభ్యులపై దాడిచేసి, ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారని చెప్పారు. బాధితురాలి తల్లి ఆటోను వెంబడించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
వాళ్లు ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి, చంపేశారు. ఈలోపు బాలిక బంధువులు పోలీసులకు ఫోన్ చేసి, ఆమె కిడ్నాప్ ఉదంతాన్ని చెప్పారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా ప్రవీణ్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతడు తన నేరాన్ని అంగీకరించి, బాలిక మృతదేహం ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతడితో పాటు నితిన్, దీపక్, కరణ్ అనే మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదో నిందితుడు మైనర్ అని పోలీసులు చెప్పారు. వీళ్లంతా ఆటో డ్రైవర్లేనని, కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.