భార్యను చంపి గ్యాస్ బండ కింద దాచిన భర్త | Husband brutally murdered his wife in anantapur | Sakshi
Sakshi News home page

భార్యను చంపి గ్యాస్ బండ కింద దాచిన భర్త

Jan 20 2014 3:39 AM | Updated on Nov 6 2018 7:53 PM

భార్యను చంపి గ్యాస్ బండ కింద దాచిన భర్త - Sakshi

భార్యను చంపి గ్యాస్ బండ కింద దాచిన భర్త

ధర్మవరంలో అనుమానంతో భార్య ప్రాణం తీసిన భర్త ఉదంతం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టెలతో కొట్టి చంపి..

ధర్మవరం, న్యూస్‌లైన్ : ధర్మవరంలో అనుమానంతో భార్య ప్రాణం తీసిన భర్త ఉదంతం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టెలతో కొట్టి చంపి.. గోనె సంచిలో ఉంచి.. గ్యాస్‌బండ కింద దాచాడు. నేరం తనపైకి రాకుండా ఉండేందుకు ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసి.. అడ్డంగా దొరికిపోయాడు.

పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు... ధర్మవరంలోని జగ్జీవన్‌రామ్‌నగర్‌కు చెందిన ప్రవల్లిక (23), కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన డ్రైవర్ రాజేష్ ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరైనా.. ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. జగ్జీవన్‌రామ్‌నగర్‌లోనే నాలుగేళ్లపాటు నివాసం ఉన్నారు. రాజేష్ తరచూ పని ఎగ్గొడుతుండటంతో ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి.
 
 దీంతో ఏడాది కిందట వీరు అక్కడి నుంచి పోతుకుంట బీసీ కాలనీకి మకాం మార్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత నుంచి రాజేష్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు.. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో శనివారం మరోసారి గొడవపడి భార్యను కట్టెతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి.. గ్యాస్ బండ కింద దాచాడు. కట్టెలు, ఇతర సామగ్రిని అడ్డుగా పెట్టి బయటకు కనిపించకుండా చేశాడు. ఆ రోజు రాత్రంతా ఇంట్లోనే గడిపాడు. ఆదివారం ఉదయం నేరుగా పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఒకసారి, ఆత్మహత్య చేసుకుందని మరోసారి తెలిపాడు. పోతుకుంట రూరల్ పరిధిలో ఉండటంతో ఆ స్టేషన్ పోలీసులకు సమాచారమిచ్చారు.
 
 రాజేష్ చెబుతున్న మాటలు పొంతన కుదరకపోవడంతో అనుమానం వచ్చిన రూరల్ పోలీసులు అతడిని పిలుచుకుని ఇంటికెళ్లి తనిఖీ చేయగా బండకింద మృతదేహం కనిపించింది. రూరల్ సీఐ నర్సింగప్ప, ఎస్‌ఐ కరీం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ అభిషేక్ మహంతి కూడా సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన ప్రవల్లిక బంధువులు ఆందోళనకు దిగారు. అనుమానంతో ప్రవల్లికను కడతేర్చిన రాజేష్‌ను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. చట్టప్రకారం శిక్షిస్తామని ఏఎస్పీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement