ఇక రోజువారీ విచారణ | CWG scam: After SC order, court orders daily trial of Kalmadi case | Sakshi
Sakshi News home page

ఇక రోజువారీ విచారణ

Apr 28 2014 11:49 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ ఎంపీ సురేశ్ కల్మాడీ సహా తొమ్మిది మంది ప్రముఖులు నిందితులుగా ఉన్న కామన్వెల్త్ క్రీడల (సీడబ్ల్యూజీ) కుంభకోణం కేసు విచారణ వేగవంతం కానుంది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ సురేశ్ కల్మాడీ సహా తొమ్మిది మంది ప్రముఖులు నిందితులుగా ఉన్న కామన్వెల్త్ క్రీడల (సీడబ్ల్యూజీ) కుంభకోణం కేసు విచారణ వేగవంతం కానుంది. కేసును ఏడాదిలోపు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో రోజువారీ విచారణ నిర్వహిస్తామని స్థానిక సీబీఐ కోర్టు ప్రకటించింది. 2010లో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడల కోసం ఉపయోగించిన టైమింగ్, స్కోరింగ్ అండ్ రిజల్ట్ (టీఎస్సార్) వ్యవస్థ కాంట్రాక్టును అక్రమంగా కట్టబెట్టడంపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై ప్రస్తుతం విచారణ నిర్వహిస్తోంది. టీఎస్సార్ కాంట్రాక్టును అధిక ధరలకు అప్పగిం చడం వల్ల ప్రభుత్వానికి రూ.90 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్న ఈ కేసు విచారణను ఏడాదిలోపే పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం మార్చి 10న సీబీఐ కోర్టును ఆదేశించింది. ఇందుకోసం రోజువారీ విచారణ చేపట్టాలని సూచించింది.
 
 సీబీఐ జడ్జి మధుజైన్ ప్రస్తుతం దర్యాప్తు సంస్థ తరఫు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.  ఈ కేసు విచారణ గత ఫిబ్రవరిలో మొదలయింది. సిట్టింగ్ ఎంపీ కల్మాడీతోపాటు తొమ్మిది మందిపై నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం తదితర నేరాలతో చార్జిషీటు నమోదు చేశారు. ఈ అభియోగాలు రుజువైతే వీరికి యావజ్జీవ శిక్ష పడే అవకాశముంది.కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు రావడంతో క్రీడానిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కల్మాడీ, దీని ప్రధాన కార్యదర్శి లలిత్ భానోత్ తదితరులను పదవుల నుంచి తొలగించారు. అవినీతి నిరోధక చట్టం, భారత శిక్షాస్మృతి ప్రకారం నిందితులందరిపై కేసు లు నమోదయ్యాయి. సీబీఐ చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు వీరందరిపై అభియోగాలను నమోదు చేసింది. వీరంతా బెయిల్‌పై విడుదలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement