మండ్య లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభృర్థిగా బరిలో దిగిన శాండల్‌వుడ్ నటి రమ్యకు సినీ గ్లామర్ కలొసొచ్చే అవకాశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, బెంగళూరు : మండ్య లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభృర్థిగా బరిలో దిగిన శాండల్‌వుడ్ నటి రమ్యకు సినీ గ్లామర్ కలొసొచ్చే అవకాశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలు, ప్రత్యర్థి పార్టీకి ఆ ప్రాంతంలో ఉన్న పట్టు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విషయం స్పష్టమవుతుంది. మండ్య పార్లమెంటు స్థానం పరిధిలో మేల్కోటే, నాగమంగ ళ, శ్రీంగపట్టణ, కే.ఆర్ పేట, మండ్య, మద్దూరు, మళవళ్లి, మైసూరు జిల్లాలోని కే.ఆర్ నగర్ శాసనసభలు ఉన్నాయి. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఐదింటిని (నాగమంగళ, శ్రీరంగపట్టణ, కే.ఆర్ పేట, మద్దూరు, కే.ఆర్ నగర) ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ కైవసం చేసుకుంది.
ఇక రెండింటిలో (మళవళ్లి, మండ్య) కాంగ్రెస్, మేల్కోటేలో సర్వోదయ కర్ణాటక పక్ష గెలుపొందాయి. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 16,14,874 ఓటర్లు ఉండగా.. వారిలో 8,01,173 మంది మిహ ళలు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ ఎనిమిది నియోజక వర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులకు 5,42,336, కాంగ్రెస్ అభ్యర్థులకు 3,44,085 ఓట్లు వచ్చాయి. అంతే కాకుండా 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానం నుంచి చలువరాయస్వామి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత, ప్రస్తుత గృహ మండలి మంత్రి అయిన అంబరీష్ కంటే దాదాపు 23 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఏ విధంగా చూసినా ఈ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ కంటే జేడీఎస్‌దే పై చేయిగా కనిపిస్తోంది.
అంతేకాకుండా అవగాహన కుదిరితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు బీజేపీకి సహకరించే అవకాశాలున్నాయి. దీంతో ప్రస్తుత జేడీఎస్ అభ్యర్థి పుట్టరాజు గెలుపు నల్లేరుమీద నడకే అవుతుందని రాజకీయ విశ్లేషకుల భావన. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న రమ్య సినీ రంగంలో అగ్రగామి హీరోయిన్. అంతేకాకుండా ఆమెకు రాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరున్న ఎస్.ఎం కృష్ణ ఆశీస్సులూ ఉన్నాయి. ఇక అంబరీష్ కూడా శక్తి వంచన లేకుండా రమ్య గెలుపు కోసం రాజకీయ వ్యూహరచన చేస్తున్నారు. వీటన్నింటి కంటే ముఖ్యంగా రమ్య నామినేషన్ వేసిన రోజే ఆమె తండ్రి ఆర్.టీ నారాయణ్ హఠాన్మరణం చెందారు. దీంతో సానుభూతి ఓట్లు కలిసి వస్తాయని కాంగ్రెస్ నాయకుల ఆశాభావం. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఈ నెల 24 వరకూ వేచిచూడాల్సిందే.