
తెలుసుకుని మాట్లాడండి..
రాష్ట్రంలో న్యాయవ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది.
► కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై సీఎం సిద్ధు విమర్శలు
మైసూరు: రాష్ట్రంలో న్యాయవ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. కర్ణాటక మరో బీహార్‌లా తయారయిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదు అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం మైసూరు నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక నుంచే ఎంపీగా ఎన్నికయిన నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై అవగాహన పెంచుకొని మాట్లాడాలన్నారు.
రాష్ట్రంలో న్యాయం, చట్టం వ్యవస్థ పకడ్బందీగా అమలు చేస్తుండడం వల్లే అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయాన్ని ఆమె తెలుసుకోవాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏమేం జరిగాయో ఆమె తెలుసుకోవాలన్నారు.
కరువు నిధులపై శ్వేతపత్రం ఎందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కరువు పరిహార నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్‌పై స్పందిస్తూ ఆ అవసరం లేదని సీఎం తెలిపారు. వర్షాల కొరతతో ఖరీఫ్ సీజన్‌లో చోటు చేసుకున్న పంట నష్టాలకు పరిహారంగా రూ.3,300 కోట్లు అదేవిధంగా రబీ సీజన్‌లో పంటనష్ట పరిహారంగా రూ.4,702 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్రాన్ని కోరామన్నారు. అయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.1,670 కోట్లను మాత్రమే విడుదల చేసిందని అందులో ఇప్పటికే రూ. 1,100 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు.
మిగిలిన రూ.570 కోట్లను ఇతరాత్ర అవసరాల కోసం తమ వద్దే అంటిపెట్టుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే బదులు రాష్ట్రానికి మరిన్ని కరువు పరిహార నిధులను విడుదల చేయాలంటూ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే సంతోషిస్తామన్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప అప్పుడప్పడూ రాష్ట్ర పర్యటన చేస్తుంటారని అందులో భాగంగానే మే18 నుంచి రాష్ట్ర పర్యటన చేస్తున్నారంటూ చమత్కరించారు. కేపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ అధిష్టానందే తుది నిర్ణయమని తెలిపారు. ఎవరూ కాంగ్రెస్‌ను విడిచి వెళ్లరని అన్నారు.