ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సర్వసుఖాలు అనుభవించాల్సిన వ్యక్తి నడివీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడంపై మెజారిటీ
భారీ వర్షానికీ బెదరక...
Jan 21 2014 11:28 PM | Updated on Sep 2 2017 2:51 AM
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సర్వసుఖాలు అనుభవించాల్సిన వ్యక్తి నడివీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడంపై మెజారిటీ ఢిల్లీవాసుల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. ఉదయం నుంచే తీవ్రమైనచలి, జోరువాన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ధర్నా స్థలం నుంచి కదిలించలేకపోయాయి. రాత్రంతా చలిలో రోడ్డుపక్కనే నిద్రించిన ఆయన ఉదయం వానపడినా కదలలేదు. పోలీసులు ఆయనను సోమవారం రాత్రి జంతర్ మంతర్ వద్దకో మరో చోటికో తరలించి ఉంటారని మంగళవారం ఉదయం నిద్రలేచిన నగరవాసులు అనుకున్నారు. అయితే ఆయన రాత్రంతా చలిలో రోడ్డుపక్కనే గడిపారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కేజ్రీవాల్ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎప్పుడూ దగ్గుతూ కనిపించే ఆయన చలిలో రాత్రంతా గడపడానికి వెనుకాడకపోవడం చాలా మందిని నివ్వెరపరిచింది. పది రోజుల పాటు ధర్నా చేయడానికి వచ్చానన్న ఆయన ప్రకటనను రాజకీయ నాయకులు మొదట్లో తేలిగ్గా తోసిపుచ్చారు. వానపడినప్పుడైనా ఆయన అక్కడి నుంచి కదులుతారేమోనని అనుకున్నారు. వర్షంలోనూ కేజ్రీవాల్, ఆయన సహచరులు రైలుభవన్ వద్దనే ఉన్నారని తెలుసుకుని విస్తుపోయారు. కేజ్రీవాల్ మొండివాడనే నిర్ణయానికి వచ్చారు.
కేజ్రీవాల్, ఆయన మంత్రులు, శైలి, ధర్నాలు, వారి డిమాండ్లతో విబేధించేవారు కూడా ఆయనపై సానుభూతి చూపడం కనిపించింది. ధర్నా కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న దిల్లీవాలాలు కూడా కేజ్రీవాల్ కొత్త తరహా రాజ కీయ నాయకుడని, సంప్రదాయ రాజకీయ నాయకులు ఇచ్చే నిర్వచనానికి ఆయన సరిపోరని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ కూడా నొక్కిచెప్పారు. ఇక రాజకీయాలు ఏసీ గదుల నుంచి నడవబోవని, ఇలాగే రోడ్లపై జరుగుతాయని చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని ఢిల్లీ పోలీసులు చేసిన సూచనను ఆయన తిరస్కరించారు. తాను ముఖ్యమంత్రినని, ఎక్కడ ధర్నా చేయాలనేది తానే నిర్ణయించుకుంటానని స్పష్టం చేశారు. తాను ఎక్కడ ధర్నా జరపాలో చెప్పడానికి హోంమంత్రి ఎవరని ఆయన ప్రశ్నించారు.
మంచి చేస్తున్నారు
డాక్టర్ సుర్‌భీర్‌సింగ్, మయూర్‌విహార్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నది మంచి పని అందుకే బాసటగా నిలిచేందుకు మేం ఇక్కడికి వచ్చాం. అన్నా ఉద్యమం నుంచి మా డాక్టర్ల బృందం వారికి స్వచ్ఛందంగా సేవలందిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ వారికి వైద్యం చేయడానికి వచ్చాం.
వైద్యులుగా మా విధి
డాక్టర్ శంభుదాస్‌గుప్తా, నోయిడా
పోలీసులు జనాన్ని కాపాడాలి. అది వారి విధి. దాన్ని సక్రమంగా చేయాలనే కేజ్రీవాల్ ధర్నాకు దిగారు. మేం వైద్యులుగా మా విధి నిర్వహించేందుకు ఇక్కడికి వచ్చాం. ఆందోళనకారులు, పోలీసులు అన్న తేడా లేదు. సేవ చేయడమే మా కర్తవ్యం.
రాత్రంతా ఆయన వెంటే
రాంకిషన్, కిరాడీ
నేను ముందు నుంచి ఆప్ ఆందోళనల్లో పాల్గొంటున్నా. మాలాం టి సామాన్యులకు రక్షణ కల్పిం చాలనే కేజ్రీవాల్ సార్ చలిలోనూ ధర్నా చేశారు. మేం ఆయన వెంటే ఉన్నాం.
Advertisement
Advertisement