కేబినెట్లోకి ‘విరోధులు’.. | Cabinet 'enemies' .. | Sakshi
Sakshi News home page

కేబినెట్లోకి ‘విరోధులు’..

Aug 29 2013 2:45 AM | Updated on Sep 1 2017 10:12 PM

సీఎంకు రాజకీయ ప్రత్యర్థులుగా గుర్తింపు పొందిన వారిని రాష్ట్ర మంత్రి వర్గంలోకి చొప్పించడం ద్వారా సిద్ధరామయ్య దూకుడుకు కళ్లెం వేయవచ్చని ఏఐసీసీ భావిస్తోంది.

సాక్షి, బెంగళూరు : సీఎంకు రాజకీయ ప్రత్యర్థులుగా గుర్తింపు పొందిన వారిని రాష్ట్ర మంత్రి వర్గంలోకి చొప్పించడం ద్వారా సిద్ధరామయ్య దూకుడుకు కళ్లెం వేయవచ్చని ఏఐసీసీ భావిస్తోంది. ప్రజా తీర్పును గెలవడంలో విఫలమైన కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్‌కు ఏదో ఒక రీతిలో పదవి కట్టబెట్టి అతనికి డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చొబెట్టడమే కాకుండా.. డీకే శివకుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టి సిద్ధరామయ్యను ఇరుకున బెట్టేందుకు పావులు కదుపుతోంది. ఇటీవల ముగిసిన బెంగళూరు గ్రామీణ, మండ్య ఉప ఎన్నికలు రాబోవు లోకసభ ఎన్నికలకు దిక్సూచీ కావాలని ఢిల్లీ పెద్దలు అప్పట్లో భావించారు.

ఈ ఎన్నికలు ఇప్పటికే మంత్రి వర్గంలో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న కనకపుర ఎమ్మెల్యే డీకే శివకుమార్‌కు కలిసి వచ్చాయి. తన సామాజిక(ఒక్కలిగ) వర్గం ఓటు బ్యాంక్‌ను ఆయన అస్త్రంగా ఉపయోగించారు. తనకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే...  ఈ ఉప ఎన్నికలలో బెంగళూరు గ్రామీణ లోకసభ స్థానం నుంచి స్వయానా తన తమ్ముడు సురేష్‌కుమార్‌ను రంగంలో దింపడమే కాకుండా రెండు లోకసభ స్థానాల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానంటూ అధిష్టానం ఎదుట ప్రతిపాదనను ఉంచారు. ఈ రెండు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు సునాయసంగా గెలుపొందాలంటే ఆ ప్రాంతానికి చెందిన ఒక్కలిగుల ఓట్లు ప్రధానం కావడంతో అధిష్టానం సైతం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ప్రజాతీర్పును పొందలేకపోయినా... అడ్డదారిలోనైనా ఏదొక పదవిని పొంది డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ సైతం ఈ ఎన్నికలను అస్త్రంగా మార్చుకుని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేశారు. రెండు లోకసభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను స్వీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్, పరమేశ్వర్ పోటాపోటీ ప్రచారాలు సాగించారు. ఫలితంగా తమ పార్టీ అభ్యర్థులు తిరుగులేని మెజారిటీతో గెలుపొందేందుకు దోహదపడ్డారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డీకే శివకుమార్‌కు మంత్రి పదవి ఖాయమనే విషయం తేటతెల్లమైంది. త్వరలోనే పరమేశ్వర్‌ను కూడా అందలం ఎక్కించి డిప్యూటీ సీఎం కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైన సొంత పార్టీలోని రాజకీయ విరోధులకు మంత్రి పదవులు కట్టబెట్టిన తర్వాత సిద్ధరామయ్య పాలన సజావుగా సాగుతుందో... లేదో వేచి చూడాలి.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement