ఢిల్లీ విధానసభ ఎన్నికలకు బీజేపీ వెనుకాడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. అందువల్లనే దొడ్డిదారిన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందంది.
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విధానసభ ఎన్నికలకు బీజేపీ వెనుకాడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. అందువల్లనే దొడ్డిదారిన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందంది. ప్రభుత్వ ఏర్పాటు యత్నాలు జరుగుతున్నాయని, ఇందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీని ఆహ్వానించే అవకాశముందనే వదంతుల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. ఆ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఒకటి రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఎన్నికలకు బదులు బీజేపీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. విధానసభకు తక్షణమే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉప ఎన్నికలఫలితాలతో ఖంగుతిన్న బీజేపీ... ఢిల్లీలో ఎన్నికలకు భయపడుతోందన్నారు.
మేము సిద్ధమే
అయితే ఆప్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటించింది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఇటువంటి ఆరోపణల్లో పసలేద ని తేలిందని, తాజా ఆరోపణలు కూడా అంతేనని పేర్కొంది. పదేపదే పాత ఆరోపణలే చేస్తోందని ఆ పార్టీ నాయకురాలు నళిన్ కోహ్లీ ఆరోపించింది.
ఎల్జీ నిర్ణయం తరువాతే ప్రతిస్పందిస్తాం: బీజేపీ
ప్రభుత్వ ఏర్పాటుపై లెఫ్టినెంట్ గవర్నర్ తుది నిర్ణయం తీసుకున్న తరువాతే ప్రతిస్పందిస్తామని బీజేపీ నాయకుడు షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఢిల్లీలో రాజకీయ ప్రతిష్టంభన అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, అయితే బంతి మాత్రం ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ కోర్టులో ఉందని, ఆయన తుది నిర్ణయం తీకున్న తరువాతనే తాము దానిపై ప్రతిస్పందిస్తామన్నారు. ఢిల్లీలోఅతిపెద్ద పార్టీ తమదేనని, ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.
మెజారిటీ లేదు
ఢిల్లీ విధానసభలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన లేదని కాం గ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల తరువాత నాటి పరిస్థితికీ, ఇప్పటి పరిస్థితికీ తేడా లేదని, అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సంఖ్యాబలం లేదని చెప్పిన బీజేపీ ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు.