ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ వేసిన పరువు నష్టం దావా కేసుపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం...బీజేపీ నేత విజేందర్ గుప్తాపై మంగళవారం పరువునష్టం అభియోగాలను నమోదుచేసింది.
సీఎం పరువు నష్టం కేసు విజేందర్‌పై అభియోగాలు
Published Tue, Aug 6 2013 10:27 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ వేసిన పరువు నష్టం దావా కేసుపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం...బీజేపీ నేత విజేందర్ గుప్తాపై మంగళవారం పరువునష్టం అభియోగాలను నమోదుచేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని 150వ సెక్షన్ కింద గుప్తాపై అభియోగాలను ఖరారు చేస్తున్నట్లు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నమ్రితా అగర్వాల్ పేర్కొన్నారు. అక్టోబర్ 28వ తేదీలోగా న్యాయస్థానానికి హాజరై షీలాదీక్షిత్ వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించారు. గతేడాది మున్సిపల్ ఎన్నికలకు ముందు విజేందర్ గుప్తా తనపై అనుచిత భాషను ఉపయోగించారని, తనకు పరువు నష్టం కలిగించారని షీలాదీక్షిత్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హజరుకాకుండా ఉండడం కోసం తన క్లయింట్‌కు మినహాయింపు ఇవ్వాలని షీలాదీక్షిత్ తరపు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. అయితే దీనిని గుప్తా తరపు న్యాయవాది వ్యతిరేకించారు. విచారణ తేదీ గురించి షీలాదీక్షిత్‌కు ముందుగానే తెలుసని, అందువల్ల మినహాయింపునకు తగిన ఆధారాలు లేవని గుప్తా తరపు న్యాయవాది అజయ్ బర్మన్ వాదించారు.
విద్యుత్ కంపెనీలతో కుమ్మక్కై, వాటికి సహాయపడ్డారని షీలాదీక్షిత్‌పై గుప్తా ఆరోపణలు చేసి ఆమె పరువుకు భంగం కలిగించినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి తేలిందని న్యాయస్థానం గత నెల ఒకటో తేదీన అభిప్రాయపడింది. అయితే ఈ ఆరోపణను గుప్తా మంగళవారం తోసిపుచ్చారు. ఈ అభియోగాలు తనను అవమానానికి గురిచేస్తున్నాయన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎక్కడా ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించే పదాలను ఉపయోగించలేదని చెప్పారు. ఒక వేళ తాను తప్పు చేస్తే వెంటనే కారాగారంలో పెట్టాలని అన్నారు.
అయితే సరైన కారణాలను చెప్పకుండానే ముఖ్యమంత్రి కోరుకున్న ప్రతిసారీ మినహాయింపు పొందుతున్నారని, తాను మాత్రం మినహాయింపు కోరినందుకు చిన్న చిన్న వివరాలను కూడా సమర్పించాల్సి వస్తోందన్నారు. ఇది తనను వేధించడమేనని అన్నారు. కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకు తాను మినహాయింపు కోరినప్పుడు తనకు అనుమతి లభించడం లేదని, ముఖ్యమంత్రికి మాత్రం గైర్హాజరీకి మాత్రం అనుమతి లభిస్తోందన్నారు. దీంతో తదుపరి విచారణ తేదీన షీలాదీక్షిత్ హాజరుకాకపోతే ఆమెపై చర్య తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ తేదీన షీలాదీక్షిత్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని తెలిపింది.
Advertisement
Advertisement