26న బెంగళూరు బంద్ | Bangalore bandh on 26 | Sakshi
Sakshi News home page

26న బెంగళూరు బంద్

Jul 22 2014 2:48 AM | Updated on Sep 2 2017 10:39 AM

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలను ఖండిస్తూ, వారికి సరైన రక్షణ కల్పించాలన్న డిమాండ్‌తో సుమారు యాభైకి పైగా కన్నడ సంఘాలు ఈ నెల 26న బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలను ఖండిస్తూ, వారికి సరైన రక్షణ కల్పించాలన్న డిమాండ్‌తో సుమారు యాభైకి పైగా కన్నడ సంఘాలు ఈ నెల 26న బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలలకు చెందిన ప్రతి ఒక్కరూ, మహిళా సంఘాలు, ఐటీ, బీటీ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు, హోటళ్ల యజమానులు, చలన చిత్ర పరిశ్రమ సహా అందరూ బంద్‌లో పాల్గొనాలని కన్నడ చళవళి అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ కోరారు.

కన్నడ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంద్ సందర్భంగా టౌన్ హాలు నుంచి మైసూరు బ్యాంకు సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించనున్నట్లు చెప్పారు.  ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శాంతియుతంగా సాగే బంద్ నుంచి ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాలు, పత్రికల పంపిణీని మినహాయిస్తామని వివరించారు.

లైంగిక దాడులకు పాల్పడుతున్న వికృత మనస్తత్వం కలిగిన నిందితులకు సంఘటన జరిగిన నెలలోగా శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఉద్యోగులు, గృహిణులకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోరారు.

డాక్టర్ రాజ్ కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా. గోవిందు, కన్నడ సేన అధ్యక్షుడు కేఆర్. కుమార్, కర్ణాటక దళిత సంఘర్ష సమితికి చెందిన ఎన్. మూర్తి, కర్ణాటక రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివరామే గౌడ ప్రభృతులు బంద్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement