చైనా కోసం చెత్త పనులు | AP government pre planned for china GICC over temples removing | Sakshi
Sakshi News home page

చైనా కోసం చెత్త పనులు

Aug 22 2016 2:53 PM | Updated on Aug 18 2018 8:05 PM

చైనా కోసం చెత్త పనులు - Sakshi

చైనా కోసం చెత్త పనులు

పుష్కరాలు 12 రోజులు కూడా గడవకముందే ఆ పేరిట ప్రభుత్వం చేసిన పనుల్లో డొల్లతనం బట్టబయలవుతోంది.

► పుష్కరాల పేరిట ప్రభుత్వం ధ్వంసరచన
► నదీముఖ పర్యాటకాభివృద్ధికి మాస్టర్ ప్లాన్
► వేలాది ఇళ్లు, పదుల సంఖ్యలో ఆలయాల కూల్చివేత
► హడావుడి, తాత్కాలిక పనుల వెనుక 
► అసలు రహస్యం ఇదే?
► ఘాట్‌లలో అప్పుడే ఊడిపోతున్న టైల్స్

అమరావతి: పుష్కరాలు 12 రోజులు కూడా గడవకముందే ఆ పేరిట ప్రభుత్వం చేసిన పనుల్లో డొల్లతనం బట్టబయలవుతోంది. పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్‌లలో అతికించిన నాసిరకం టైల్స్ ఎక్కడివక్కడ ఊడిపోతున్నాయి. దుర్గాఘాట్, పున్నమిఘాట్, పవిత్ర సంగమం (ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్)లు కాంక్రీట్ ఫ్లోరింగ్‌తోనే సరిపెట్టారు. అక్కడ టైల్స్ కూడా అతికించలేదు. పనుల్లో నాణ్యత లోపించిన కారణంగానే టైల్స్ ఊడిపోతున్నాయని, సమయం చాలకపోవడంతోనే కాంక్రీట్ ఫ్లోరింగ్‌తో సరిపెట్టారనే ఆరోపణలు వస్తున్నా.. కృష్ణా పుష్కరాల మాటున ప్రభుత్వం పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
పుష్కరాల పేరిట నదీ ముఖ పర్యాటకానికి (రివర్ ఫ్రంట్ టూరిజం) ముందస్తు ప్రణాళికతో మార్గం సుగమం చేసిందని అంటున్నారు. పుష్కరాల పేరుతో నిర్మించిన ఘాట్లు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడం వెనుక రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధికి అవరోధం లేకుండా చేసే వ్యూహం దాగి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో విజయవాడ నగరం నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీ వరకు కృష్ణా తీరంలో నదీముఖ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించడం గమనార్హం.
 
వ్యతిరేకత రాకుండా పుష్కరాల సెంటిమెంట్
కృష్ణా తీరంలో రివర్ ఫ్రంట్ టూరిజానికి పెద్ద పీట వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అలా చేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని ఆ తరువాత గుర్తించింది. దీంతో పుష్కరాల సెంటిమెంట్‌ను వాడుకోవాలని నిర్ణయించుకుంది. సౌకర్యాలు, ఘాట్లు, రోడ్లు అభివృద్ధి పేరుతో విధ్వంసానికి ప్రణాళిక రచించింది. కృష్ణా జిల్లా విజయవాడ, ఇబ్రహీంపట్నంతో పాటు గుంటూరు జిల్లా సీతానగరంతో కలిపి కృష్ణా నది వెంబడి ఏళ్ల నుంచి పేదలు నివసిస్తున్న దాదాపు 2,500కు పైగా ఇళ్లను తొలగించింది. 40కి పైగా ఆలయాలు తొలగించారు. ఇబ్రహీంపట్నంలో జాతిపిత మహాత్మగాంధీ, విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయవాడ మున్సిపల్ మాజీ చైర్మన్ టీవీఎస్ చలపతిరావు తదితర నేతల విగ్రహాలను ప్రజావ్యతిరేకత మధ్య తొలగించారు. ఇదంతా కూడా పుష్కరాల కోసమే చేస్తున్నట్టు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ పుష్కర ఘట్టం ముగియగానే కృష్ణా తీరాన్ని రివర్ ఫ్రంట్ టూరిజం కోసం డ్రాగన్ (చైనా)సంస్థ చేతికి అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 
 
నది ఒడ్డున విగ్రహాలు, పార్కులు, నదిలో బోటు షికారు, జలక్రీడలు, హోటళ్లు, వినోద కార్యక్రమాలు తదితరాల ప్రతిపాదనలు ఇదివరకే ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి వెనుక కృష్ణా నది మధ్యలో 133 ఎకరాలలో భవానీ ద్వీపం ఉంది. పర్యాటక అభివృద్ధికి ఇక్కడ కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాగా చైనాకు చెందిన జిజో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (జీఐసీసీ) ప్రతినిధులు ఇప్పటికే పలుమార్లు కృష్ణా తీరంలో పర్యటించారు. సుమారు రూ.850 కోట్లతో విజయవాడ దుర్గాఘాట్ నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీ(పవిత్ర సంగమం) వరకు రివర్‌ఫ్రంట్ టూరిజం అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగానే సుమారు రూ.150 కోట్లతో పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టారు. మరో రూ.700 కోట్లతో చైనా సంస్థ కృష్ణా తీరంలో పర్యాటక అభివృద్ధి పనులను చేపట్టేలా పథక రచన జరిగింది. వాస్తవానికి పుష్కర ఘాట్ల నిర్మాణం కూడా చైనా సంస్థ రూపొందించిన నమూనా మేరకే జరగడం గమనార్హం. కాగా ఆయా పనులను చైనా సంస్థల ప్రతినిధులు కూడా పర్యవేక్షించారు. రూ.150 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం ఇటు కాంట్రాక్టర్లకు, భవిష్యత్తులో అటు చైనా సంస్థకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిందని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement