breaking news
temples Removing
-
చైనా కోసం చెత్త పనులు
► పుష్కరాల పేరిట ప్రభుత్వం ధ్వంసరచన ► నదీముఖ పర్యాటకాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ► వేలాది ఇళ్లు, పదుల సంఖ్యలో ఆలయాల కూల్చివేత ► హడావుడి, తాత్కాలిక పనుల వెనుక ► అసలు రహస్యం ఇదే? ► ఘాట్లలో అప్పుడే ఊడిపోతున్న టైల్స్ అమరావతి: పుష్కరాలు 12 రోజులు కూడా గడవకముందే ఆ పేరిట ప్రభుత్వం చేసిన పనుల్లో డొల్లతనం బట్టబయలవుతోంది. పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్లలో అతికించిన నాసిరకం టైల్స్ ఎక్కడివక్కడ ఊడిపోతున్నాయి. దుర్గాఘాట్, పున్నమిఘాట్, పవిత్ర సంగమం (ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్)లు కాంక్రీట్ ఫ్లోరింగ్తోనే సరిపెట్టారు. అక్కడ టైల్స్ కూడా అతికించలేదు. పనుల్లో నాణ్యత లోపించిన కారణంగానే టైల్స్ ఊడిపోతున్నాయని, సమయం చాలకపోవడంతోనే కాంక్రీట్ ఫ్లోరింగ్‌తో సరిపెట్టారనే ఆరోపణలు వస్తున్నా.. కృష్ణా పుష్కరాల మాటున ప్రభుత్వం పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్కరాల పేరిట నదీ ముఖ పర్యాటకానికి (రివర్ ఫ్రంట్ టూరిజం) ముందస్తు ప్రణాళికతో మార్గం సుగమం చేసిందని అంటున్నారు. పుష్కరాల పేరుతో నిర్మించిన ఘాట్లు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడం వెనుక రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధికి అవరోధం లేకుండా చేసే వ్యూహం దాగి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో విజయవాడ నగరం నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీ వరకు కృష్ణా తీరంలో నదీముఖ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించడం గమనార్హం. వ్యతిరేకత రాకుండా పుష్కరాల సెంటిమెంట్ కృష్ణా తీరంలో రివర్ ఫ్రంట్ టూరిజానికి పెద్ద పీట వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అలా చేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని ఆ తరువాత గుర్తించింది. దీంతో పుష్కరాల సెంటిమెంట్‌ను వాడుకోవాలని నిర్ణయించుకుంది. సౌకర్యాలు, ఘాట్లు, రోడ్లు అభివృద్ధి పేరుతో విధ్వంసానికి ప్రణాళిక రచించింది. కృష్ణా జిల్లా విజయవాడ, ఇబ్రహీంపట్నంతో పాటు గుంటూరు జిల్లా సీతానగరంతో కలిపి కృష్ణా నది వెంబడి ఏళ్ల నుంచి పేదలు నివసిస్తున్న దాదాపు 2,500కు పైగా ఇళ్లను తొలగించింది. 40కి పైగా ఆలయాలు తొలగించారు. ఇబ్రహీంపట్నంలో జాతిపిత మహాత్మగాంధీ, విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయవాడ మున్సిపల్ మాజీ చైర్మన్ టీవీఎస్ చలపతిరావు తదితర నేతల విగ్రహాలను ప్రజావ్యతిరేకత మధ్య తొలగించారు. ఇదంతా కూడా పుష్కరాల కోసమే చేస్తున్నట్టు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ పుష్కర ఘట్టం ముగియగానే కృష్ణా తీరాన్ని రివర్ ఫ్రంట్ టూరిజం కోసం డ్రాగన్ (చైనా)సంస్థ చేతికి అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నది ఒడ్డున విగ్రహాలు, పార్కులు, నదిలో బోటు షికారు, జలక్రీడలు, హోటళ్లు, వినోద కార్యక్రమాలు తదితరాల ప్రతిపాదనలు ఇదివరకే ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి వెనుక కృష్ణా నది మధ్యలో 133 ఎకరాలలో భవానీ ద్వీపం ఉంది. పర్యాటక అభివృద్ధికి ఇక్కడ కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాగా చైనాకు చెందిన జిజో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (జీఐసీసీ) ప్రతినిధులు ఇప్పటికే పలుమార్లు కృష్ణా తీరంలో పర్యటించారు. సుమారు రూ.850 కోట్లతో విజయవాడ దుర్గాఘాట్ నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీ(పవిత్ర సంగమం) వరకు రివర్‌ఫ్రంట్ టూరిజం అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగానే సుమారు రూ.150 కోట్లతో పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టారు. మరో రూ.700 కోట్లతో చైనా సంస్థ కృష్ణా తీరంలో పర్యాటక అభివృద్ధి పనులను చేపట్టేలా పథక రచన జరిగింది. వాస్తవానికి పుష్కర ఘాట్ల నిర్మాణం కూడా చైనా సంస్థ రూపొందించిన నమూనా మేరకే జరగడం గమనార్హం. కాగా ఆయా పనులను చైనా సంస్థల ప్రతినిధులు కూడా పర్యవేక్షించారు. రూ.150 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం ఇటు కాంట్రాక్టర్లకు, భవిష్యత్తులో అటు చైనా సంస్థకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిందని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆలయాల పునర్నిర్మాణం కోసం ఉద్యమం
భీమవరం: విజయవాడలో తొలగించిన పురాతన హిందూ ఆలయాలను పునఃనిర్మించాలని కోరుతూ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి భీమవరంలోని కోదండ రామాలయం వద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆలయాలు పునఃనిర్మించే వరకూ ఇక నుంచి ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు, శ్రీరామజపం చేపడుతున్నామని హిందూ ఆలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు తోరం సూర్యనారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఆలయాల వద్ద మన హిందూ దేవాలయాలను మనమే కాపాడుకొందాం అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. పరిరక్షణ సమితి కన్వీనర్ గరికిముక్కు సుబ్బయ్య మాట్లాడుతూ అధికార పక్ష రాజకీయ నాయకుల అండదండలతో ఆలయాల కూల్చివేత జరుగుతుందన్నారు. కార్యక్రమంలో క్రొవ్విడి రవికుమార్ శర్మ, పాదన్న శ్రీధర్, కమతం బాలు పాల్గొన్నారు. -
మిత్రపక్షమైనా దౌర్జన్యాలు చేస్తే ఊరుకోం : బీజేపీ
► దేవాలయాలను కూల్చడం ఏకపక్ష నిర్ణయమే ► బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య కాకినాడ: మిత్రపక్షమైనా టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య హెచ్చరించారు. విజయవాడలో విగ్రహాలు కూల్చడంపై స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో దేవాలయాలు రాత్రికి రాత్రికి కూల్చడం సరైన పద్ధతి కాదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కేశినేని నాని విశ్వహిందూ పరిషత్ సభ్యులపైన, స్వామీజీలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ లో నెగ్గిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చుబెట్టుకొన్పప్పుడు ఈ విషయం వారికి గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. పార్టీని బలోపేతం చేయడంలో ఎవ రి వ్యూహాలు వారికి ఉంటాయన్నారు. విజయవాడలో దేవాలయాలు కూల్చడంపై పార్టీ ఆదేశాల మేరకు నిజాలు తెలుసుకొనేందుకు బీజేపీ నాయకులు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, సురేష్‌రెడ్డి బృందం అక్కడికి వెళితే టీడీపీ నాయకులు వారిపై దాడికి పాల్పడేందుకు సిద్ధపడడం దారుణమన్నారు. ఇటువంటి బెదిరింపులు, దాడులకు బెదిరిపోయేది బీజేపీ కాదని హెచ్చరించారు. దేవాలయాల తరలింపు ఆగమశాస్త్రం ప్రకారం జరగాలన్నారు. హిందువులు మనోభావాలను లెక్కచేయకుండా, వారి సెంట్మెంట్ను పట్టించుకొనకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం దారుణమన్నారు. ఎంపీ కేశినేని నాని ఒక బస్సు డ్రైవర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని అతను స్థాయి మరచి మాట్లాడుతున్నారన్నారు. దేవాలయాలు కూల్చివేసేటప్పుడు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు సమాచారం ఇవ్వలేదన్నారు. -
బెజవాడ బంద్ : నేతల హౌస్ అరెస్ట్
విజయవాడ: అభివృద్ధి పేరుతో ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా అఖిలపక్షం నేతృత్వంలో బుధవారం విజయవాడ నగరబంద్ కొనసాగుతుంది. పోలీసులు ముందస్తుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంటిని కాపాడటం కోసం గోశాలను తొలగిస్తున్నారంటూ ధర్మ పరిరక్షణ సమితి ఆరోపించింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత గోశాలను భారీ యంత్రాలతో అధికారులు తొలగించారు. దీనిని ప్రశ్నించిన గోశాల నిర్వహాకులపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కచ్చితంగా తొలగిస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు నగరంలో 44 ఆలయాలను ధ్వంసం చేశారు. తాజాగా కెనాల్‌రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలయాల తొలగించడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.