
మిత్రపక్షమైనా దౌర్జన్యాలు చేస్తే ఊరుకోం : బీజేపీ
మిత్రపక్షమైనా టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య హెచ్చరించారు.
► దేవాలయాలను కూల్చడం ఏకపక్ష నిర్ణయమే
► బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య
కాకినాడ: మిత్రపక్షమైనా టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య హెచ్చరించారు. విజయవాడలో విగ్రహాలు కూల్చడంపై స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో దేవాలయాలు రాత్రికి రాత్రికి కూల్చడం సరైన పద్ధతి కాదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కేశినేని నాని విశ్వహిందూ పరిషత్ సభ్యులపైన, స్వామీజీలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ లో నెగ్గిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చుబెట్టుకొన్పప్పుడు ఈ విషయం వారికి గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. పార్టీని బలోపేతం చేయడంలో ఎవ రి వ్యూహాలు వారికి ఉంటాయన్నారు. విజయవాడలో దేవాలయాలు కూల్చడంపై పార్టీ ఆదేశాల మేరకు నిజాలు తెలుసుకొనేందుకు బీజేపీ నాయకులు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, సురేష్‌రెడ్డి బృందం అక్కడికి వెళితే టీడీపీ నాయకులు వారిపై దాడికి పాల్పడేందుకు సిద్ధపడడం దారుణమన్నారు.
ఇటువంటి బెదిరింపులు, దాడులకు బెదిరిపోయేది బీజేపీ కాదని హెచ్చరించారు. దేవాలయాల తరలింపు ఆగమశాస్త్రం ప్రకారం జరగాలన్నారు. హిందువులు మనోభావాలను లెక్కచేయకుండా, వారి సెంట్‌మెంట్‌ను పట్టించుకొనకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం దారుణమన్నారు. ఎంపీ కేశినేని నాని ఒక బస్సు డ్రైవర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని అతను స్థాయి మరచి మాట్లాడుతున్నారన్నారు. దేవాలయాలు కూల్చివేసేటప్పుడు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు సమాచారం ఇవ్వలేదన్నారు.