
అభిప్రాయం
పొగాకు కంపెనీలు బర్లీ పొగాకును కొనుగోలు చేయకుండా రైతుల ఆశలపై నీళ్లుజల్లాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కంపెనీల చేత పొగాకు కొనుగోలు చేయించటంలో విఫలమైంది. అత్యంత శక్తిమంతమైన ఐటీసీ, బ్రిటిష్ అమెరికన్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, ఫిలిప్ మోరిస్ తదితర పొగాకు కంపెనీలు ఏపీ ప్రభుత్వ మాటను వినలేదు. తమకు అనుకూలమైన ధరకు, కొంత మేరకే పొగాకును కొనుగోలు చేస్తామని భీష్మించుకు కూర్చున్నాయి.
గత సంవత్సరం బర్లీ పొగాకును క్వింటాల్‌కు రూ. 15,000 కు కొన్నారు. ఈ సంవత్సరం వ్యవసాయ ఖర్చులు, కౌలు, కూలీ రేట్లు పెరిగాయి. కనీసం గత సంవత్సరం కొన్న ధరకైనా కొనమని స్వయానా వ్యవసాయ శాఖ మంత్రి లాం ఫారమ్ మీటింగులో అడిగినా ఫలితం లేకపోయింది.
ప్రభుత్వం మరొక మెట్టు దిగి రెండు, మూడు వలుపుల హైగ్రేడ్ క్వింటాల్ పొగాకు ధర రూ. 12 వేలు, మొదటి వలుపు లోగ్రేడ్ పొగాకు ధర 6 వేలుగా (ధరలను తగ్గించి) ప్రకటించింది. అయినా కంపెనీలు తమ పట్టు వదల లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పొగాకు కంపెనీలతో మాట్లాడినా ప్రయోజనం లేదు.
పొగాకును కొనుగోలు చేయమని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు కలెక్టర్ కార్యాలయాల వద్ద; పర్చూరు, పంగులూరు, చిలకలూరిపేట, యడ్లపాడు, కారంచేడు, యద్దనపూడి, పెదనందిపాడు మరికొన్ని తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు.
చిలకలూరిపేట, పర్చూరు, పంగులూరు, ఇంకొల్లు, ఒంగోలులో రైతు సదస్సులు జరిపి పొగాకును కొనిపించమని ప్రభుత్వాన్ని కోరారు. చిలకలూరిపేటలో ఐటీసీ కంపెనీ ముందు మే నెల 27, 28 తేదీల్లో నిరసన దీక్ష చేశారు. గుంటూరులో జీపీఐ కంపెనీ ఎదుట జూన్ 5న తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.
ధర్నా చేస్తున్న సమయంలోనే రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించామని ప్రభుత్వం ప్రకటించింది. చరిత్రలో మొట్టమొదటిసారి మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు దిగటం రైతుల ఆందోళనకు లభించిన విజయం. రైతు ఉద్యమిస్తేనే వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారమవుతాయని మరోసారి నిరూపితమయ్యింది.
అయితే ప్రభుత్వం తన మాట మీద నిలబడి చివరి ఆకు కొనుగోలు చేసేంతవరకూ రైతులు అప్రమత్తంగా ఉండాలి. మొదట 350 కోట్ల రూపాయలను నల్ల బర్లీ పొగాకు కొనుగోలుకు కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత 300 కోట్లన్నారు. చివరకు 270 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.
పొగాకు కొనుగోలు చాలా నెమ్మదిగా సాగుతోంది. రైతుల వద్ద పొగాకు చాలావుంది. ఆలస్యం అయ్యే కొద్దీ రైతులకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. పలు రకాల ఆలోచనలు వస్తున్నాయి. అప్పులు, వడ్డీలే కాకుండా పొగాకు చెడిపోతుంది. బరువు తగ్గుతుంది. ఈ విధంగా కొనుగోలు జరిగితే... రైతుల దగ్గర ఉన్న మొత్తం పొగాకును కొనడానికి ఇంకా రెండు మూడు నెలలు పడుతుంది.
ఎక్కువ మంది రైతులు పొగాకు బేళ్ళను కొనుగోలు కేంద్రాలకు తెచ్చుకోవటానికి మార్క్‌ఫెడ్ అనుమతించటం లేదు. ముందుగానే వాట్సాప్ మెసేజ్ ద్వారా రైతుకు తెలియజేసి కొద్ది మందినే పిలుస్తున్నారు. బయ్యర్ కొద్ది సమయంలోనే 300 బేళ్ళు కొనగలుగుతున్నాడు. స్పీడ్‌గా కొనగలిగిన శక్తి కలిగిన సిబ్బంది ఉన్నా అతి నెమ్మదిగా ప్రభుత్వం కొంటోంది.
పొగాకులో తేమ ఉందని కొనడానికి తిరస్కరిస్తున్నారు. తేమ పరిమితులను సవరించాలి. కొనుగోలు కేంద్రాలు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి. పెదనందిపాడు, ఇంకొల్లు లాంటి చోట్ల కొనుగోలు కేంద్రాలను పెట్టాలి. జిల్లా సరిహద్దులు అడ్డంకిగా ఉండరాదు. దగ్గరగా ఉన్న గ్రామాల రైతులను గుంటూరు పొమ్మనకుండా కంప్యూటర్ సహాయంతో వివరాలను సేకరించి దగ్గరలో అమ్ముకునే అవకాశం ఇవ్వాలి.
గోడౌన్లు అందుబాటులో లేకపోతే కొనుగోలు పాయింట్ పెట్టి పొగాకు కొనాలి. కొన్న పొగాకును దగ్గర ఉన్న గోదాములకు తరలించాలి. పొగాకును కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు వెంటనే రావటం లేదు. ఆలస్యం లేకుండా రైతులకు డబ్బులు వచ్చేలా చూడాలి. పొగాకు కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తగ్గిపోయింది. దీంతో నాణ్యమైన పొగాకును తక్కువ ధరకు తీరికగా కొనుక్కుంటున్నారు.
మరోవైపు రైతుల ఆందోళన రోజురోజుకూ ఉద్ధృతమౌతున్నది. స్థానిక శాసనసభ్యులు, మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. మూడుసార్లు వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు రైతులతో సమావేశమయ్యారు.
అయినా కంపెనీలు వాటి పంథా మార్చుకోలేదు. దేశాధిపతులనే మార్చగలిగిన చరిత్ర ఉన్న మల్టీ నేషనల్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క అనిపించినట్లు లేదు. అటువంటి అభిప్రాయం రాకుండా ప్రభుత్వం చూడాలి. పొగాకు కొనమని కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. మల్టీ నేషనల్ కంపెనీల పవర్‌కు ప్రభుత్వం తలొగ్గరాదు.
డా‘‘ కొల్లా రాజమోహనరావు
వ్యాసకర్త నల్లమడ రైతు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు