తమ సహ విద్యార్థిని ఆత్మహత్య ఘటనతో నర్సింగ్ విద్యార్థినులు అగ్రహోదగ్రులయ్యారు. ఈ ఘటనను నిరసిస్తూ జంతర్‌మంతర్ ప్రాంతంలో
న్యూఢిల్లీ: తమ సహ విద్యార్థిని ఆత్మహత్య ఘటనతో నర్సింగ్ విద్యార్థినులు అగ్రహోదగ్రులయ్యారు. ఈ ఘటనను నిరసిస్తూ జంతర్‌మంతర్ ప్రాంతంలో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఈ విషయమై నర్సింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న యోగితా సింగ్ అనే విద్యార్థిని మాట్లాడుతూ హాస్టల్ సూపరింటెండెంట్ మానసిక వేధింపులను భరించలేకనే పల్లవి ఆత్మహత్య చేసుకుందన్నారు. అందువల్ల హాస్టల్ సూపరింటెండెంట్‌ను తక్షణమే విధుల్లోనుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
కాగా ఎయిమ్స్‌లో నర్సింగ్ కోర్సు చేస్తున్న 20 సంవత్సరాల విద్యార్థిని పల్లవి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు పల్లవి మృత దేహం వేలాడుతుండడాన్ని ఆమె స్నేహితురాళ్లు ఆ రోజు రాత్రి పది గంటల సమయంలో గుర్తించారు. పల్లవి అదే రోజు సాయంత్రం మాయాపురిలోని ఇంటి నుంచి హాస్టల్‌కు వచ్చింది. బీఎస్‌సీ సర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న పల్లవికి ఇటీవల జరిగిన పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయి. ఈ విషయమై హాస్టల్ సూపరింటెండెంట్ పల్లవిని ఎగతాళి చేయడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఆమె స్నేహితురాళ్లు మీడియాకు తెలిపిన విషయం విదితమే.