నటించకున్నా పర్వాలేదు...కానీ.. | actor shaam interview | Sakshi
Sakshi News home page

నటించకున్నా పర్వాలేదు...కానీ..

Jun 20 2015 2:19 AM | Updated on Apr 3 2019 9:02 PM

నటించకున్నా పర్వాలేదు...కానీ.. - Sakshi

నటించకున్నా పర్వాలేదు...కానీ..

సినిమా కొందరికి సరదా.. మరికొందరికి ఫ్యాషన్. ఇంకొందరికి శ్వాస. ఈ మూడో కోవకు చెందిన వ్యక్తి నటుడు శ్యామ్.

సినిమా కొందరికి సరదా.. మరికొందరికి ఫ్యాషన్. ఇంకొందరికి శ్వాస. ఈ మూడో కోవకు చెందిన వ్యక్తి నటుడు శ్యామ్. సినిమానే జీవితంగా భావిస్తున్న ఈయన సినిమా వయసు 13 ఏళ్లు. చేసిన సినిమాలు 25. ఇలా ఏడాదికి సగటున రెండు చిత్రాలు చేసుకుంటూ ఇటు తమిళంతో పాటు అటు తెలుగులోనూ మంచి పాత్రలు చేస్తూ నిలకడగా నట జీవితాన్ని సాగిస్తున్న శ్యామ్ 25వ చిత్రం పొరంబోకు. ఎస్.పి.జననాథన్ దర్శక, నిర్మాతగా బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో ఆర్య, విజయసేతుపతిలు కూడా హీరోలుగా నటించారు. ఈ మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నటుడు శ్యామ్‌తో చిన్న చిట్‌చాట్..
 
 ప్రశ్న: ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో తొలుత ఇయర్కై చిత్రంలో నటించారు. మళ్లీ పొరంబోకు చిత్రంలో నటించిన అనుభవం?
 జవాబు: ఇయర్కై చిత్రం సమయంలో నాకంతగా అనుభవం లే దు. జననాథన్‌కు అది దర్శకుడిగా తొలి చిత్రం. తరువాత ఆయనేమిటన్నది గ్రహించాను. జననాథన్ చాలా ఆలోచనాపరుడు. తను నటుల కోసం కథ తయారు చేయరు. కథా పాత్రల కోసం నటుల్ని ఎంపిక చేసుకుంటారు. అలాంటి దర్శకుడితో రెండోసారి పని చేయడం సంతోషం. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు జననాథన్. ఇయర్కై చిత్రంలో నేను సరిగా నటించలేదనిపించేది. ఆ చింత పొరంబోకు చిత్రంతో పోయింది.
 
 ప్రశ్న: పొరంబోకు చిత్రంలో ఆర్య, విజయ్‌సేతుపతితో నటించిన అనుభవం?
 జవాబు: ఈ చిత్రంలో మేము ముగ్గురూ మూడు విభిన్న పాత్రల్లో నటించాం. ఎవరి దృష్టిలో వారు చేసేది కరెక్ట్ లాంటి పాత్రలవి. దర్శకుడు సృష్టించిన మూడుముఖ్య భూమికలను మేము ముగ్గురం భుజాలపై మోశాం. ఇక ఆర్య, నేను నటించిన ఉళ్లం కే టు 20 చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. అలాంటిదిప్పుడింత స్థాయికి ఎదగడం సంతోషం. విజయ్ సేతుపతి చాలా మంచి మనసున్న వ్యక్తి. మాలో ఎవరికి షూటింగ్ లేకపోయినా అందరితో పాటు షూటింగ్ వెళుతాం. ఖాళీ సమయాల్లో క్యారవాన్‌లో కూర్చొని జాలీగా మాట్లాడుకుంటాం. మా మధ్య ఇగోకు తావు లేదు.
 
 ప్రశ్న: తెలుగులోనూ నటుడిగా ఎదుగుతున్నట్లున్నారు?
 జవాబు: తెలుగులో ఇప్పటి వరకు ఐదు చిత్రాలు చేశాను. తదుపరి కిక్, రేసుగుర్రం చిత్రాల దర్శకుడు సురేంద్రరెడ్డి తదుపరి చిత్రంలో నటించనున్నాను.
 
 ప్రశ్న: నిర్మాతగా ‘6’ చిత్రం చేశారు. ఆ అనుభవం గురించి, మళ్లీ చిత్రం నిర్మించే ఆలోచన ఉందా?
 జవాబు: నిజం చెప్పాలంటే 6 చిత్రం నిర్మాతగా నాకు లాభాలు తెచ్చిపెట్టలేదు. మంచి గౌరవాన్ని గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే విధంగా శ్యామ్ బాధ్యత తెలియని వ్యక్తి కాదు. అన్వేషణ, అంకిత భావం, నిరంతర శ్రమ జీవి అనే పేరును తెచ్చిపెట్టింది. కచ్చితంగా మళ్లీ చిత్రం నిర్మిస్తా. అయితే అది నా గత 25 చిత్రాలకు పూర్తి భిన్నంగా, కొత్తగా, నన్ను నవ్యపరిచేలా ఉంటుంది.
 
 ప్రశ్న: మీ 25 చిత్రాల నట జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే?
 జవాబు: చాలా ఘనంగాను, సంతోషంగాను సంతృప్తి గాను ఉంది. అయితే ఇవన్నీ తలచుకుంటూ కూర్చోలేదు. ఇంకా ఇంకా పరిగెత్తాలి. శ్రమించాలి. ఎదగాలి. నటుడిగా రంగ ప్రవేశం చేసి 13 ఏళ్లు అయ్యింది. నిరంతరపోటీలో ఇంతకాలం నిలబడడం పెద్ద విషయం గానే భావిస్తున్నాను. నా గురువు జీవా నన్ను పరిచయం చేశారు. ఎంతగానో ప్రోత్సహించారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా కాలం చెందడంతో నాకు చేయూత నిచ్చేవారే లేకపోయారు. కిందకు పడతోసే వాళ్లు మాత్రం చాలా మంది తయారయ్యారు. అలాంటి పరిస్థితిలో తప్పొప్పులను సరి చూసుకుంటూ నేనే నటిస్తున్నాను. చాలామంది కథలుబాగానే చె ప్పేవారు. అలాంటి చిత్రాలు బాగా ఆడుతాయని గ్యారింటీ ఏముంటుంది. అలా ఎంతకాలం పొరపాట్లు చేస్తూ బోల్తాపడేది? ఇప్పుడలా కాదు సరైన నిర్ణయాలు తీసుకునే పరిణితి సాధించాను. సొంత డబ్బుతో చిత్రం చేసి నిలదొక్కుకున్నాను. ఇకపై నటించకపోయినా ఫర్వాలేదు. కాని చెడ్డ చిత్రం చేసి ఇంట్లో కూర్చోవడం నరకం. మధ్యలో అలాంటి పరిస్థితి చవిచూశాను. ఇకపై అలా జరగకుండా జాగ్రత్త పడుతాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement