ప్రీతి రాఠీ మృతి కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె తండ్రి అమర్‌సింగ్ బాంబే హైకోర్టుకు విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రీతి రాఠీ మృతి కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె తండ్రి అమర్‌సింగ్ బాంబే హైకోర్టుకు విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు. నగర పోలీసుల అచేతనత్వంతో విసిగిపోయిన అమర్‌సింగ్... ఈ కేసును సీబీఐకి బదిలీ చేయించాలని తన పిటిషన్‌లో అభ్యర్థించారు. ఢిల్లీకి చెందిన ప్రీతి రాఠీ ఉద్యోగంలో చేరేందుకు ఈ ఏడాది మే నెల రెండో తేదీన బాంద్రా రైల్వేస్టేషన్‌లో దిగింది. అంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై యాసిడ్ పోశాడు.
తీవ్రగాయాలపాలైన ప్రీతి ని స్థానిక బాంబే ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ జూన్ నెల ఒకటో తేదీన మరణించింది. అదే నెల నాలుగో తేదీన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఆమెకు అంత్యక్రియలు జరిగిన సంగతి విదితమే. ‘ప్రణాళికాబద్ధంగా ఈ దాడి జరిగింది. ఇప్పటికీ నిందితులెవరనే విషయాన్ని పోలీసులు కనుగొనలేకపోయారు. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడే నిందితుడని చెప్పలేం. నగర పోలీసుల దర్యాప్తుపై నాకు నమ్మకం లేదు. అందువల్ల ఈ కేసును సీబీఐకి బదిలీ చేయించండి’ అని అమర్‌సింగ్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఈ విషయాన్ని అమర్‌సింగ్ తరఫు న్యాయవాది గౌతమ్ ప్యారేలాల్ వెల్లడించారు.