ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే వారం నిర్వహించనున్న ‘ఢిల్లీ డయలాగ్’ మూడో దశలో బిజ్లీ (విద్యుత్), పానీ (తాగు నీరు)పై దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే వారం నిర్వహించనున్న ‘ఢిల్లీ డయలాగ్’ మూడో దశలో బిజ్లీ (విద్యుత్), పానీ (తాగు నీరు)పై దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించింది. ఇంతకుముందు యువజనులు, మహిళల అంశాలపై కేంద్రీకరించిన ఆప్ ఈసారి ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్యుత్, తాగునీటి సమస్యలపై దృష్టిని కేంద్రీకరించనున్నామని పేర్కొంది. మరోసారి ఢిల్లీలో అధికారంలోకి వస్తే నెలకు 400 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే గృహ వినియోగదారులకు చార్జీలను 50 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు విద్యుత్ సరఫరా కంపెనీల ఖాతాలను కాగ్ తనిఖీ చేసేంత వరకు ఈ రాయితీని కొనసాగిస్తామని పేర్కొంది. ప్రజలతో అనుసంధానమయ్యేందుకు చేపట్టిన ఢిల్లీ డయలాగ్ మూడో దశ కార్యక్రమాన్ని ఈ నెల 13న చేపట్టనున్నామని ఆప్ నేతలు చెప్పారు.
ప్రజలతో సంభాషణల ఆధారంగా పార్టీ రూపొందించబోయే ప్రణాళికకు ‘బిజ్లీ-పానీ డయలాగ్’ నిదర్శనంగా నిలుస్తుందని ఆప్ నాయకురాలు మీరా సాన్యాల్ చెప్పారు. ఢిల్లీలో విద్యుత్, ఇంధనం, నీటి సంక్షోభం వంటి సమస్యల పరిష్కారానికి ప్రజల సూచనలు, సలహాలు వింటామని తెలిపారు. పునర్వినియోగ ఇంధనం, పవర్ గ్రిడ్ కంపెనీలు, విద్యుదుత్పత్తి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల, విద్యుత్ పంపిణీ, సరఫరా సంస్థలకు చెందిన నిపుణులతో తమ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే చర్చలు ప్రారంభించారని ఢిల్లీ డయలాగ్ సభ్యుడు వినయ్ మిట్టల్ చెప్పారు. ఢిల్లీలోని 1.7 కోట్ల జనాభాకు ప్రాథమిక ఇంధన అవసరాలను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని మిట్టల్ పేర్కొన్నారు.
ఢిల్లీకి 54 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 6200 మెగావాట్ల విద్యుత్ అందుతుందని, కానీ 5400 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయగల సామర్థ్యం ఉందని ఆయన వివరించారు. ఈ అంశంపై వెంటనే దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. గ్రామీణ సమస్యలు, విద్య-వైద్యం, వ్యాపారుల సమస్యలు, లోక్‌పాల్, పాలనలో పారదర్శకత, ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై కూడా ఢిల్లీ డయలాగ్ నిర్వహిస్తామని ఆప్ నాయకుడు ఆశిష్ ఖేతాన్ తెలిపారు. ఢిల్లీ డయలాగ్ బృందానికి ఖేతాన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ డయలాగ్‌ల ద్వారా వచ్చే సమాచారాన్నంతా క్రోడీకరించి తమ ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఢిల్లీ డయలాగ్ కార్యక్రమం జనవరి 18న ముగుస్తుందన్నారు.