ఎనిమిది లక్షలమందికి ఉపాధి


 న్యూఢిల్లీ: తాము అధికారంలోకి వస్తే ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ యువతకు హామీ ఇచ్చారు. ఎన్నికలు ఏక్షణంలోనైనా జరిగే అవకాశముండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకుగాను తలపెట్టిన ‘ఆప్ ఢిల్లీ డైలాగ్’ కార్యక్రమాన్ని అరవింద్ శనివారం ప్రారంభించారు. జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన వందలాదిమంది నగరవాసులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి అరవింద్ ప్రసంగించారు. నిరుద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ‘అధికారంలోకి వస్తే ఎనిమిది లక్షలమందికి ఉపాధి కల్పిస్తాం. దీంతోపాటు మరో పది లక్షలమందికి వచ్చే పది సంవత్సరాల కాలంలో వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తాం’ అని అన్నారు.

 

 వర్ధమాన క్రీడాకారులకు శిక్షణ

 ‘నగరంలో ఓ మంచి క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తాం. నగరానికి ఆనుకుని ఉన్న ఓ గ్రామానికి నేను వెళ్లా. ఆక్కడ స్టేడియమే లేదు. కావాల్సినంత స్థలం ఉన్నప్పటికీ క్రీడాకారులు ఆడుకునేందుకు, తగు శిక్షణ పొందేందుకు ఇక్కడ స్టేడియమే లేదని ఆ ఊరిప్రజలు తెలియజేశారు. మాకు ఆ స్థలం ఇస్తే అధికారంలోకిరాగానే స్టేడియం నిర్మిస్తానంటూ వారికి హామీ ఇచ్చా’ అని అన్నారు.  వర్ధమాన క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని మైదానాలను వినియోగిస్తామని అరవింద్ చెప్పారు.

 

 విద్యార్థులకు రుణపథకం

 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు హామీలిచ్చారు. నగరంలోని పాఠశాలల్లో చదువులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు రుణసౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. శివారు ప్రాంతాల్లో కొత్తగా 20 కళాశాలలను ప్రారంభిస్తామన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top