రాలిన విద్యా కుసుమాలు | 3 students of Svs Med College of Yogaand Naturopathy & Research allegedly committed suicide | Sakshi
Sakshi News home page

రాలిన విద్యా కుసుమాలు

Jan 24 2016 2:20 AM | Updated on Sep 3 2017 4:10 PM

రాలిన విద్యా కుసుమాలు

రాలిన విద్యా కుసుమాలు

విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చి సమీపంలోని చిన్న సేలం వద్ద ఎస్‌వీఎస్ ప్రైవేటు సిద్ధ వైద్య కళాశాల ఉంది.

భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరాల్సిన  ముగ్గురు వైద్య విద్యార్థినులు మృత దేహాలుగా తేలడం తమిళనాడులోని విల్లుపురంలో సంచలనం సృష్టించింది.

ఒకే బావిలో ముగ్గురు వైద్య విద్యార్థినుల  మృతదేహాలు బయట పడడం అనుమానాలకు దారి తీసింది.

ఈ ఘటనపై విల్లుపురం  జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, డీఐజీ, ఇక ఆరోగ్య మంత్రి సైతం నోరు మెదపక పోవడం చర్చకు దారి తీసింది.

 

బావిలో శవాలై తేలిన విద్యార్థినులు
హత్యగా ఆరోపణలు
ఆత్మహత్యగా  చిత్రీకరించేందుకు యత్నం
విల్లుపురంలో కలకలం
న్యాయ విచారణకు పట్టు
నిరసనల హోరు
నోరు మెదపని అధికార వర్గాలు
కళాశాలకు తాళం

 సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చి సమీపంలోని చిన్న సేలం వద్ద ఎస్‌వీఎస్ ప్రైవేటు సిద్ధ వైద్య కళాశాల ఉంది. ఈ కళాశాలపై తరచూ ఆరోపణలు వస్తూనే  ఉన్నాయి. ప్రస్తుతం ఈ కళాశాలకు చెందిన ప్రకృతి వైద్యం, యోగా సైన్స్ విభాగం ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రియాంక, మోనీషా, శరణ్య శనివారం పొద్దు పోయాక ఓ బావిలో శవాలుగా తేలారు. ఈ ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందర్నీ నమ్మించేందుకు కళాశాల యాజమాన్యం ప్రయత్నించినట్టుంది. ఆ విద్యార్థినుల పేరిట  సూసైడ్ నోట్‌ను సైతం పోలీసులు విడుదల చేశారు. అయితే,  కళాశాలకు కూత వేటు దూరంలో ఉన్న బావిలో ముగ్గురు ఒకర్ని మరొకరు పట్టుకుని ఉన్నట్టుగా మృతదేహాలు బయట పడడంతో అనుమానాలు బయల్దేరాయి. తవ్వే కొద్ది ఆ క ళాశాలకు వ్యతిరేకంగా ఆరోపణలు పుట్టుకొస్తున్నాయి. ముగ్గురు విద్యార్థినుల తలకు గాయాలు సైతం ఉన్నట్టుగా వచ్చిన సంకేతాలతో  ఇది ముమ్మాటికీ హత్య అన్న గళాన్ని విప్పే వారి సంఖ్య పెరిగింది.
 
 అసలు ఏమి జరిగింది:
 చెన్నైకు చెందిన తమిళరసన్ కుమార్తె మోనీషా(19), కాంచీపురం జిల్లా సెయ్యారుకు చెందిన ఏలుమలై కుమార్తె శరణ్య(19), తిరువారూర్‌కు చెందిన వెంకటేషన్ కుమార్తె ప్రియాంక(19) ఆ వైద్య కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి శుక్రవారం కళాశాలకు వెళ్లారు. ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుని, కళాశాలకు వెళ్లిన తమ బిడ్డలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా శనివారం వచ్చిన సమాచారంతో ఆ కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్న ఆ కుటుంబాలు శవాలుగా పడి ఉన్న తమ బిడ్డల్ని చూసి రోధించాయి. అయితే, తమ బిడ్డల మృతిపై అనుమానాలు బయల్దేరడంతో ఇది ముమ్మాటికీ హత్యే అని ఆరోపించే వారి సంఖ్య పెరిగింది.
 
 ముమ్మాటికీ హత్యే:
 ఆ కళాశాలలో వసతులు శూన్యం. పలు రకాల పేర్లతో ఫీజులు ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తున్నట్టుగా, అక్కడ పనిచేస్తున్న విద్యార్థినులే అన్నీ పనులు చేసుకునే పరిస్థితి ఉండడం, కళాశాల హాస్టల్ మరెక్కడో ఉండడం వంటి వ్యవహారాలు తాజా ఘటనతో వెలుగులోకి వచ్చాయి. దీనిని ప్రశ్నించినందుకే ఈ ముగ్గురు విగత జీవులయ్యారని ఆరోపించే వాళ్లు కూడా ఉన్నారు. గత ఏడాది జూనియర్లు సాగించిన నిరసనకు సీనియర్లు మద్దతు ఇవ్వడం, వారిలో ఈ ముగ్గురు విద్యార్థినులు సైతం ఉన్నట్టు చెబుతున్నారు.
 
 ఈ ముగ్గురు విద్యార్థినులు ఏకంగా యాజమాన్యాన్ని ప్రశ్ని స్తూ, వారి తీరుపై కలెక్టర్‌కు సైతం ఫిర్యా దు చేసి ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురి తలలకు ఒకే రకంగా గా యాలు ఉండడంతో వీరిని హతమార్చి బావిలో పడేశారని వాదించే వాళ్లు పెరి గారు. దీంతో ఆదివారం విల్లుపురం మీదుగా సాగుతున్న జాతీయ రహదారి నిరసనలతో అట్టుడికింది. విద్యార్థి సంఘాలు, ఆ కళాశాల విద్యార్థినులు ఆందోళనలకు దిగారు. ఆ ముగ్గురి మృత దేహాల్ని తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. పోస్టుమార్టం చెన్నై జీహెచ్ వైద్యుల నేతృత్వంలో, రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలోనే జరగాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 
  తన కుమార్తె శుక్రవారం సాయంత్రం కళాశాలకు చేరుకున్నట్టు తనకు ఫోన్ చేసిందని,  తదుపరి ఆమెతో సంబంధాలు  తెగిన దృష్ట్యా, హతమార్చి బావిలో పడేసి ఉన్నారని మోనీషా తండ్రి తమిళరసన్ ఆరోపిస్తున్నారు. తన కుమార్తె మృత దేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని, మిస్టరీ తేలే వరకు తగ్గేది లేదని, లేకుంటే తాను ఆ త్మాహుతికి సిద్ధం అని హెచ్చరించారు. కొన్ని చోట్ల  నిరసనకారులపై పోలీసులు బలవంతంగా తమ ఝులుం ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. పోలీసులపై జనం తిరగబడ్డారు. చివర కు  ఆందోళన కారుల్ని బుజ్జగించిన అధికారులు  ఆ విద్యార్థినుల కుటుంబీ కుల్ని ఆసుపత్రిలోకి తీసుకెళ్లి చర్చల్లో పడ్డారు.
 
 నోరు మెదపని అధికారులు :
 విల్లుపురం జీహెచ్‌లో ఆ ముగ్గురు విద్యార్థినుల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. సమాచారం అందుకున్న విల్లుపురం జిల్లా కలెక్టర్ లక్ష్మీ, ఎస్పీ నరేంద్ర నాయర్‌లు అక్కడికి చేరుకున్నారు. ఓ వైపు విద్యార్థి సంఘాల నిరసన, మరో వైపు కుటుంబీకుల ఆందోళన అక్కడ సాగుతుండడంతో వారి మధ్య ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు.
 
  లోనికి వెళ్లొచ్చిన అధికారులు ప్రధాన మార్గం గుండా కాకుండా, వెనుక మార్గంలో బయటకు వెళ్లేందుకు యత్నించారు. అక్కడ మీడియా అధికారుల్ని చుట్టు ముట్టింది. అయితే నోరు మెదపకుండా అక్కడి నుంచి కలెక్టర్, ఎస్పీ జారుకోవడం చర్చకు దారి తీసింది. తదుపరి అక్కడికి చేరుకున్న డీఐజీ అనీషా హుస్సైన్ ఆందోళనకారుల్ని బుజ్జగించారు. మృత దేహాల్ని పరిశీలించారు. ఈ ఘటనతో ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ విల్లుపురానికి ఉరకలు తీశారు. ఆయన సైతం నోరు మెదపక పోవడంతో సర్వత్రా ఆగ్రహం బయలు దేరింది.
 
 ఎట్టకేలకు స్పందన:
 ఎట్టకేలకు మధ్యాహ్నం తర్వాత అధికారుల్లో చలనం వచ్చిందని చెప్పవచ్చు. ఆగమేఘాలపై వైద్య కళాశాలకు సీల్ వేశారు. తదుపరి అదే కళాశాలలో  ఉన్న నిర్వాహకుడు వాసుకీ సుబ్రమణ్యన్ కుమారుడు సుభాకరన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా వాసుకీ సుబ్రమణ్యన్ గుండె నొప్పి సాకుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించి ఉండడం గమనార్హం. ఇక ఈ ఘటనపై ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌లు స్పందించారు. న్యాయ విచారణకు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement