
300 వికెట్ల క్లబ్బులో జహీర్ ఖాన్
వెటరన్ బౌలర్ జహీర్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు.
వెటరన్ బౌలర్ జహీర్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. జొహాన్నెస్బెర్గ్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టిన జహీర్, రెండో ఇన్నింగ్స్లో జాక్వెస్ కలిస్ను ఔట్ చేసి 300వ వికెట్ సాధించాడు. అల్లాటప్పా బ్యాట్స్మన్తో కాకుండా, కలిస్ లాంటి స్టార్ బ్యాట్స్మన్ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను మరింత ఆనందంగా అనుభవించాడు.
300వ వికెట్ తీయగాన డ్రెసింగ్ రూంలో ఉన్న తన సహచరుల వైపు చూతులు ఊపాడు. జహీర్ వేసిన ఇన్సైడ్ ఎడ్జ్ బాల్ను జడ్జి చేయడంలో పొరబడిన కలిస్, వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో జహీర్ ఖాన్ లేటు వయసులో ఘాటైన విజయం సాధించాడు. ఇప్పటివరకు భారతీయ బౌలర్లలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (413) మాత్రమే 300 వికెట్లు సాధించిన ఘనత పొందగా ఇప్పుడు జహీర్ ఖాన్ కూడా వారి సరసన చేరినట్లయింది. అయితే ఫాస్ట్ బౌలర్లను మాత్రమే చూసుకుంటే కేవలం కపిల్ దేవ్, తర్వాత జహీర్ ఖాన్ మాత్రమే 300 వికెట్లు దాటారు. మిగిలిన ఇద్దరూ స్పిన్నర్లు కావడం విశేషం.