కరోనా టీకాకు నేను వ్యతిరేకం: జొకోవిచ్‌

Wouldn't Want To Be Forced, Novak Djokovic - Sakshi

పారిస్‌: కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచం విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తుంటే,  సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యక్తిగతంగా తాను కరోనా టీకాను వేయించుకోవడానికి వ్యతిరేకమన్నాడు. ఈ విషయంలో ఏ ఒక్కరినీ బలవంతం చేయాల్సి  అవసరం లేదని జొకోవిచ్‌ అభిప్రాయపడ్డారు.  టెన్నిస్‌ ప్లేయర్లు ప్రతీ ఒక్కరూ కరోనా టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలన్న మహిళా టెన్నిస్‌ మాజీ నంబర్‌ వన్‌ ఎమెలీ మౌరెస్మో సూచనను జొకోవిచ్‌ వ్యతిరేకించాడు. ఒకవేళ కరోనా టీకాను వేయించుకుంటే అది తన ఆటను ఆపేసే అవకాశం కూడా లేకపోలేదని జొకోవిచ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. దాంతో ఈ విషయంలో వారి వారి నిర్ణయాలకే వదిలి వేయాలన్నాడు (మన ముగ్గురం కలిసి...)

‘నేనైతే వ్యక్తిగతంగా కరోనా టీకాకు వ్యతిరేకం. ఈ విషయంలో ఎవర్నీ బలవంతం చేయవలసిన అవసరం లేదు. ‘ కరోనా టీకాను తప్పనిసరి చేస్తే ఏమౌతుంది.  ఏ పని అయినా చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు అనేవి ఉంటాయి. ఇక్కడ నేనే నిర్ణయం తీసుకోవాలి. నా ఆలోచనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను. సమయాన్ని బట్టి ఆలోచనలు మారతా ఉంటాయి’ అని జొకోవిచ్‌ పేర్కొన్నాడు. ఈ టెన్నిస్‌ సీజన్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తనకు తెలియదని జొకోవిచ్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తన అంచనా ప్రకారం జూలై, ఆగస్టు మాసాల్లో టెన్నిస్‌ తిరిగి ఆరంభం అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నట్లు తెలిపాడు. 

కరోనా మహమ్మారి దెబ్బకు టోర్నీల్లేక ఇబ్బందులెదుర్కొంటున్న యువ ఆటగాళ్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు టెన్నిస్‌ దిగ్గజాలు రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) సిద్ధమవుతున్నారు.  వీరు ముగ్గురు కలిసి 30 నుంచి 45 లక్షల డాలర్లు సమకూర్చడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో వచ్చిన ప్రైజ్‌మనీతో ఈ నిధిని జమచేయవచ్చని అన్నాడు. ఒకవేళ ఈ సీజన్‌ మొత్తం రద్దయితే ఈ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో దక్కించుకున్న ప్రైజ్‌మనీ నుంచైనా నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జొకోవిచ్‌ తెలిపాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top