
నా భార్య చంపేస్తుందేమో: గంభీర్
గౌతం గంభీర్.. గత కొంతకాలంగా వివాదాల్ని కొనితెచ్చుకునే క్రికెటర్ గా బాగా గుర్తింపు పొందాడు.
రాజ్కోట్: గౌతం గంభీర్.. గత కొంతకాలంగా వివాదాల్ని కొనితెచ్చుకునే క్రికెటర్ గా బాగా గుర్తింపు పొందాడు. తాజాగా తన మిత్రుడు, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ను ఒక విషయంలో విమర్శించి అనవసరంగా రచ్చకెక్కాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సందర్భంగా ఇషాంత్ శర్మను కింగ్స్ పంజాబ్ తీసుకోవడంపై గంభీర్ సెటైర్లు గుప్పించాడు. ఈ విషయంలో కింగ్స్ కోచ్ సెహ్వాగ్ ను తప్పుబట్టాడు. దానికి సెహ్వాగ్ కూడా దీటుగా బదులిచ్చాడనుకోండి. ఇలా విభేదాలతో సావాసం చేయడం గంభీర్ కు అలవాటే.
ఇదిలా ఉంచితే ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్న గంభీర్ కు తన భార్య నటాషా భయం పట్టుకుంది. ఇందుకు కారణం ఒక కార్యక్రమంలో గంభీర్ డ్యాన్స్ చేయడమే. ఎప్పుడూ సీరియస్ గా ఉండే గంభీర్ కు పార్టీ మూడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ క్రమంలోనే తనతో డ్యాన్స్ చేయమని భార్య నటాషా ఎన్నోసార్లు కోరినా గంభీర్ మాత్రం పెద్దగా పట్టించుకునే వాడు కాదు. చివరకు బావమరిది బ్యాచిలర్ పార్టీ వేడుకలో కూడా డ్యాన్స్ చేయలేదు. ఈ విషయంపై నటాషా సీరియస్ అయ్యిందట. తనతో డ్యాన్స్ చేయకపోవడం నేరంతో సమానమని గంభీర్ తో వాదించినా ఫలితం లేకుండా పోయింది.
అయితే ఓ ప్రకటన కోసం తొలిసారి గంభీర్ డ్యాన్స్ చేశాడు. ఈ విషయంలో భార్య ఏమంటుందోనని గంభీర్ తెగ భయపడుతున్నాడట. ఇదే విషయాన్ని స్పష్టం చేసిన గంభీర్..ఈ విషయం తెలిస్తే తన భార్య చంపేస్తుందేమోనంటూ చమత్కరించాడు. తనకు పార్టీలంటే పెద్దగా ఇష్టం ఉండదని, ఆ క్రమంలోనే డ్యాన్స్ కూడా దూరంగా ఉంటానన్నాడు. కాగా, ఇటీవల ఓ పంజాబీ సాంగ్ కు డ్యాన్స్ చేయాల్సి వచ్చిందంటూ గంభీర్ పేర్కొన్నాడు.