
అది చాలా కష్టం: గంభీర్
ఈ సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 49 పరుగుల అత్యల్ప స్కోరుకే పరిమితం చేసి ఘన విజయం సాధించడం పట్ల కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.
పుణె: ఈ సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 49 పరుగుల అత్యల్ప స్కోరుకే పరిమితం చేసి ఘన విజయం సాధించడం పట్ల కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. కొన్ని సందర్బాల్లో మాత్రమే అటు వంటి ప్రదర్శనలు వస్తాయని, ఆ తరహా ప్రదర్శనను పదే పదే పునరావృతం చేయడమంటే చాలా కష్టమన్నాడు.
'ఆ తరహా ఆట అనేది చాలా అరుదుగా మాత్రమే చూస్తాం. అప్పుడప్పుడూ జరిగే అద్భుతాల్ని కొనసాగించమంటే చాలా కష్టం. ఒక ట్రెండ్.. ఆ ట్రెండ్ కొనసాగింపు ఎప్పుడూ కష్టమే. ఏది ఏమైనా ఒక రికార్డును అయితే క్రియేట్ చేశాం. ఇప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకుని మా ఆటను కొనసాగిస్తాం' అని గంభీర్ పేర్కొన్నాడు. జట్టులోని ప్రతీ ఒక్క క్రికెటరక్ సమష్టి కృషితోనే పటిష్టమైన ఆర్సీబీపై అంతటి అద్భుతమైన విజయం సాధించామన్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్ లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 49 పరుగులకే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది.