
ఆ సత్తా మాలో ఉంది: గంభీర్
ఈ ఐపీఎల్ సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో తన జోరును కొనసాగిస్తోంది.
పుణె: ఈ ఐపీఎల్ సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్లు ఆడిన కోల్ కతా ఆరింట విజయం సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రధానంగా లక్ష్య ఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ తన బ్యాటింగ్ లో సత్తాను చాటుకుంటుంది. కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని సైతం గంభీర్ సేన సునాయాసంగా ఛేదిస్తూ దూసుకుపోతోంది. బుధవారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ లో 183 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సాధించారు నైట్ రైడర్స్.18.1 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్నారు.
అయితే కోల్ కతా సాధిస్తున్న విజయాలపై అమితమైన ధీమా వ్యక్తం చేస్తున్నాడు కెప్టెన్ గంభీర్. ప్రధానంగా భారీ లక్ష్యాలను సాధించడానికి తమలో సత్తానే కారణమంటున్నాడు. 'మాకు ఎంతటి లక్ష్యాన్నైనా సాధించే సత్తా ఉంది. ఆ నమ్మకం జట్టు సభ్యుల్లో బలంగా ఉంది. మా జట్టు కచ్చితమైన ఛేజింగ్ జట్టు అని అనుకుంటున్నా. అదే తరహాలో విజయాలు కూడా సాధిస్తున్నాం. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ప్రత్యర్థి ఎంతటి లక్ష్యాన్ని నిర్దేశించినా దాన్ని కచ్చితంగా ఛేదించే జట్టు మాది. అదే విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. ఇక్కడ ఆరెంజ్ క్యాప్ అనేది విషయం కాదు..పాయింట్లే ముఖ్యం'అని గంభీర్ తెలిపాడు.