6,7,8 నిలిచేవారెవరు? | Sakshi
Sakshi News home page

6,7,8 నిలిచేవారెవరు?

Published Thu, Jan 4 2018 12:58 AM

who is standed to south africa - Sakshi

2014 డిసెంబర్‌ 13... వేదిక అడిలైడ్‌. ప్రత్యర్థి ఆస్ట్రేలియా. మ్యాచ్‌ చివరి రోజు లక్ష్యం 364. మురళీ విజయ్‌ (99), విరాట్‌ కోహ్లి (141) అద్భుతంగా ఆడుతున్నారు. భారత్‌ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇంతలో శతకం చేజార్చుకుంటూ విజయ్‌ అవుటయ్యాడు. అప్పటికి చేయాల్సింది 122 పరుగులే. మరో ఎండ్‌లో కోహ్లి పాతుకుపోయాడు. కానీ... తర్వాత అతడికి సహరించేవారు కరవయ్యారు. 78 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయిన భారత్‌ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. (ఈ జట్టులో అశ్విన్, జడేజా లేరు).

2015 నవంబర్‌... చండీగఢ్‌లో భారత్, దక్షిణాఫ్రికా టెస్టు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 154 పరుగులకే  7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జడేజా (38), అశ్విన్‌ (20) ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్‌లో వీరిద్దరిదే రెండో అత్యధిక భాగస్వామ్యం. రెండు జట్ల తరఫున స్వల్ప స్కోర్లు నమోదైన ఈ టెస్టులో భారత్‌ 108 పరుగులతో  గెలిచింది. 

...ఈ రెండు ఉదాహరణలు స్వదేశంలో అయినా, విదేశంలో అయినా టెస్టుల్లో 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగలిగినవారి ప్రాధాన్యతను చాటుతున్నాయి. మొదట బ్యాటింగ్‌ చేపడితే ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు అండగా నిలుస్తూ, తమవంతుగా పరుగులు చేస్తూ భారీ స్కోరుకు దోహదపడటం, రెండోసారి బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు నిచ్చెనలా నిలవడం ఈ స్థానాల్లో ఆడేవారి బాధ్యత. ఒకవేళ బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమైతే ఫాలోఆన్‌ ప్రమాదాన్ని తప్పిస్తూ గౌరవప్రదమైన స్కోరుకు పాటుపడటం వీరి విధి. స్వదేశంలో ఈ విషయంలో మన జట్టుకు ఢోకా లేదు. కూర్పు మారిపోయి అదనంగా పేసర్‌ను ఆడించాల్సిన విదేశాల్లోనే ఈ ఇబ్బందంతా. భారత్‌ ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతి ప్రకారం ఓపెనర్లు, పుజారా, కోహ్లి, రహానే/రోహిత్‌లు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా తొలి అయిదు స్థానాల్లో వస్తారు. ఆరో నంబరు వికెట్‌ కీపర్‌గా వృద్ధిమాన్‌ సాహాది. ఇక్కడ ఎలాగూ స్పిన్‌ పిచ్‌లే కాబట్టి అశ్విన్, జడేజా 7, 8 స్థానాల్లో ఆడేవారు. మ్యాచ్‌ పరిస్థితులరీత్యా కొంత మారినా అటుఇటుగా ఈ ముగ్గురిది మాత్రం ఇదే బ్యాటింగ్‌ ఆర్డర్‌. బయట మాత్రం ఇది చెల్లుబాటు కాదు. 

విదేశాల్లో కూర్పు మార్పు... 
అయిదుగురు బ్యాట్స్‌మెన్, కీపర్, ఒక ఆల్‌రౌండర్, ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లు. బహుశా సఫారీ టూర్‌లో ఇదే భారత్‌ వ్యూహం. అలవాటైన వికెట్లపై మన బ్యాట్స్‌మన్‌ స్వదేశంలో పరుగుల వరద పారించేవారు. లోయర్‌ ఆర్డర్‌ ఆడినా, ఆడకున్నా ప్రభావం కనిపించేది కాదు. విదేశాల్లో విజయం సాధించాలంటే మాత్రం సమష్టిగా ఆడాల్సిందే. చివరి శ్రేణిలోని బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు... టాప్, మిడిలార్డర్‌కు దన్నుగా నిలవాల్సిందే. వారు తమవంతుగా 20లు 30లైనా జత చేయాలి. అయితే పూర్తి పేస్‌ పిచ్‌లుండే దక్షిణాఫ్రికాలో ఒక్క స్పిన్నర్‌తోనే బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ ప్రకారం 6, 7 స్థానాల్లో సాహా, హార్దిక్‌ పాండ్యా, 8లో అశ్విన్‌ వస్తారు. సరిగ్గా వీరే గెలుపునకు కీలకం అవుతారు. దేశంలో నంబర్‌వన్‌ టెస్టు కీపర్‌గా పేరున్న సాహా... మూడేళ్ల క్రితం ఆసీస్‌లో కీలక సమ యంలో అనవసర దూకుడు కనబర్చి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే గతేడాది వెస్టిండీస్‌లో శతకం సాధించి వాటికి తగిన జవాబిచ్చాడు. తెలివైన క్రికెటర్‌గా అశ్విన్‌ ఎక్కడైనా ఉపయోగపడేవాడే. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దాడిని కాచుకుంటూ వీరు నమోదు చేసే భాగస్వామ్యాలే జట్టుకు విలువైనవిగా మారతాయనడంతో సందేహం లేదు. 

హార్దిక్‌ ఏం చేస్తాడో...? 
పేస్‌ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తున్న హార్దిక్‌ పాండ్యాకు ఈ సిరీస్‌ కీలకం కానుంది. ఇటీవలే లంకపై అరంగేట్రం చేసిన పాండ్యా శతకం కూడా సాధించాడు. భారీ హిట్టింగ్‌తో బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకున్న పాండ్యా... తన పేస్‌ పదును చూపాల్సిన సమయం వచ్చింది. మ్యాచ్‌ స్థితికి అనుగుణంగా తనను తాను మలుచుకోవాల్సి ఉంటుంది. తద్వారా ‘కోహ్లికి పాండ్యా ఒక ఆయుధం’ అన్న మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వ్యాఖ్యలకూ సార్థకత చేకూర్చిన వాడవుతాడు. 

అచ్చొచ్చే(నా) ‘9’ 
9... ఈ సంఖ్యను చాలామంది ఇష్టపడతారు. ఇదే సంఖ్య సఫారీ పర్యటనలో భారత జట్టుకూ ఎంతోకొంత ఉపయోగపడుతుందేమో చూడాలి. ఎందుకంటే ఈ స్థానంలో బ్యాటింగ్‌ వచ్చేది పేసర్‌ భువనేశ్వర్‌. కొంతకాలంగా బౌలింగ్‌లో 140 కి.మీ. వేగం అందుకుంటున్న భువీ బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తున్నాడు. శ్రీలంకతో వన్డేలో బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట అతడు సాధించిన అర్ధ సెంచరీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించింది. స్ట్రోక్స్‌ ఆడటంలోనూ భువీ మెరుగయ్యాడు. ఈ నేప థ్యంలో దక్షిణాఫ్రికాలోనూ జట్టు బ్యాటింగ్‌ ప్రయోజనాలకు ఉపయోగపడతామో చూడాలి. 

చేజారితే  మ్యాచ్‌ పోయినట్లే... 
అవి అసలు సిసలు పేస్‌ పిచ్‌లు... బ్యాట్‌ అంచులకు తగిలిన బంతి స్లిప్‌లోకి వచ్చేందుకు క్షణం కూడా పట్టదు. అలాంటివాటిని ఒడిసిపట్టాలంటే ఫీల్డర్‌కు ఓపికతో పాటు తీక్షణత అవసరం. గతంలో భారత్‌కు ఈ ఏరియాలో రాహుల్‌ ద్రవిడ్, లక్ష్మణ్‌ వంటివారు పెట్టని కోటగా ఉండేవారు. ప్రస్తుత జట్టులో రహానే తప్ప... స్లిప్‌ స్పెషలిస్టుల లోటు కనిపిస్తోంది. ఇతడికి తోడుగా మరో చురుకైన ఆటగాడిని ఎంచుకోవాలి. కోహ్లి... ఇటీవలి శ్రీలంక సిరీస్‌లో తరచూ స్లిప్‌ ఫీల్డర్లను మార్చి ప్రయోగం చేసినా ఫలితం రాబట్టలేకపోయాడు. పైగా విలువైన క్యాచ్‌లు నేలపాలయ్యాయి. ఇదే తీరు ఎల్గర్, ఆమ్లా, డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్‌ వంటి బ్యాట్స్‌మన్‌ ఉన్న దక్షిణాఫ్రికాపైనా కొనసాగితే విజయం గురించి ఆలోచించడం సాహసమే అవుతుంది. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేసే ఇలాంటివారి క్యాచ్‌లు చేజారిస్తే మ్యాచ్‌లో తిరిగి కోలుకోవడం కష్టం.

ధావన్‌ సిద్ధం... జడేజా అనుమానం!
భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అస్వస్థత జట్టును కలవరపరుస్తోంది. రేపటి నుంచి కేప్‌టౌన్‌ టెస్టు ప్రారంభమవుతుండగా... అతను వైరల్‌ జ్వరం బారిన పడ్డాడు. ‘ధావన్‌ ఫిట్‌గా ఉన్నాడు. చీలమండ గాయంతోనే సఫారీకి బయల్దేరిన అతను తొలి టెస్టు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని బీసీసీఐ తెలిపింది. రెండు రోజులుగా వైరల్‌ జ్వరం బారిన పడిన జడేజాను బీసీసీఐ వైద్య సిబ్బంది, స్థానిక వైద్యులు పరీక్షించారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతను తుది జట్టులో ఉండేది లేనిది శుక్రవారమే తెలుస్తుంది.  

Advertisement
Advertisement